Thursday, February 17, 2022

తాతయ్య సందేశం (కథ )

తాతయ్య సందేశం (కథ )
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
ఆరవ తరగతి చదివే రవికి బద్ధకం ఎక్కువ. బడి నుండి రాగానే పుస్తకాలు పడేసి, బూట్లు తియ్యకుండానే మంచం మీద చతికిలబడతాడు. కొన్నిసార్లు కుర్చీలో కూర్చుని అమ్మ మొబైలులో ఆటలాడతాడు. తరువాత పక్షులు, చెట్లు, జంతువుల గురించి చూపించే కార్యక్రమాలను చూస్తాడు.
టిఫిన్ తినేసి హోమ్ వర్క్ చెయ్యమని అమ్మ చెప్పినా వినిపించుకోడు. చాలాసార్లు వాళ్ళ నాన్న కూడా చెప్పాడు.
అలాగేనంటాడు కానీ బద్ధకం వదలడు రవి.
బడికి వెళ్ళేటప్పుడైతే పుస్తకాల సంచి కనబడలేదని, సాక్స్ దొరకలేదని పెద్దాళ్ల మీద చిరాకు పడతాడు. హోమ్ వర్క్ చెయ్యని రోజైతే బడికి ఎగనామం పెడతానంటాడు కానీ బ్రతిమలాడితే కానీ హోంవర్క్ చెయ్యడు.
ఒకసారి వూరు నుండి సత్యం తాతయ్య వచ్చాడు. మూడోరోజుకే రవికి ఉన్న బద్ధకంతో బాటు టీవీల్లో వచ్చే జంతువుల కార్యక్రమాలను అదేపనిగా చూస్తాడని తాతయ్య తెలుసుకున్నాడు. వాడిని దారిలోకి తేవాలని అనుకున్నాడు.
ఆదివారం రోజు ఉదయం రవిని తీసుకుని పార్కుకి వెళ్లాడు తాతయ్య. వాడికి ఇష్టమైన ఐస్ క్రీమ్, పల్లీలు కొనిచ్చాడు తాతయ్య. అవన్నీ తిన్న తరువాత ఆటలాడి తిరిగొచ్చాడు రవి. వాడిని నెమ్మదిగా మాటల్లోకి దించాడు తాతయ్య.
“ జంతువులకి బద్ధకం ఉండదన్న సంగతి నీకు తెలుసా?“ అనడిగాడు తాతయ్య. ‘ అవునా’ అని ఆశ్చర్యపోయాడు రవి. నిజమేనని తాతయ్య చెప్పగానే ‘ఎందువలన’ అన్నాడు రవి.
“జంతువుల కార్యక్రమాలు టీవీలో చూస్తావు కదా. నీకు తెలియదా? వాటికి కొంత వయసు వచ్చాక కావలసిన ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. అజాగ్రత్తగా ఉన్నా , బద్ధకంగా మెలిగినా ఇంకో జంతువుకి ఆహారమైపోవాలి. అందుకే బద్ధకంగా ఉండవు“ అన్నాడు తాతయ్య.
‘నిజమా తాతయ్యా?’ అని రవి ఆశ్చర్యపోతుంటే “నిజమేరా. పుట్టింది మొదలు పరుగులు నేర్చుకుని పరుగెత్తుతూనే ఉంటుంది జింక. లేకపోతే పులి, సింహం వంటి జంతువులకు దొరికిపోయి చస్తుంది. పులి కూడా బద్ధకముగా ఉండదు. అది వేగంగా పరిగెత్తినప్పుడే జంతువులు దొరికి దాని ఆకలి తీరుతుంది. అలాగే మిగతా జంతువులూ, పక్షులు చలాకీగా ఉంటాయి” అని చెప్పాడు తాతయ్య.

“ ఇంకా చెప్పు తాతయ్యా’ అని రవి అడగ్గానే “వాటి ఆహారం మనుషులకి అందినట్టుగా కాళ్ల దగ్గరకు రాదు. కష్టపడి సంపాదించాల్సిందే. అవేకాదు మొక్కలు కూడా నిత్యం చలాకీగా ఉంటాయి”అన్నాడు తాతయ్య.
“అదెలా తాతయ్యా’ అని రవి అడగ్గానే “ మామిడి టెంక గట్టిదనం తెలుసుగా. దాన్ని చీల్చుకుని మొలక బయటపడి మొక్కగా మారుతుంది. చెట్టుగా ఎదిగేవరకు వేళ్ళను భూమిలోకి బలంగా నాటుతుంది. వేళ్ళు ద్వారా నీటిని పీల్చుకుని , సూర్యుడి వేడి గ్రహించి ఆకుల ద్వారా తగిన శక్తిని పొందుతుంది. అందుకే ఎప్పుడూ చలాకీగా ఉండాలి మొక్క. తరువాత కూడా తియ్యటి పండ్లని, కలపని, కాయల్ని మనుషులకు అందిస్తూనే ఉంటాయి చెట్లు”అన్నాడు తాతయ్య.
“మొక్కలు మాత్రమేనా?లేక జంతువులు కూడా పుట్టుకతోనే పోరాటం చేస్తుంటాయా?’ అనడిగాడు రవి.
“అవి కూడా చేస్తాయి. ముక్కుతో గుడ్డుని పగలకొట్టుకుని బయటకు వస్తుంది కోడిపిల్ల. తల్లి కడుపులో నుండి తల బయటపడగానే కోతిపిల్ల తన చేతుల్తో అమ్మకి సాయపడుతూ పుడుతుంది. ఆరడుగుల ఎత్తు నుండి తల క్రిందులుగా భూమ్మీద పడే జిరాఫీ పిల్ల వెంటనే లేచి నడవగలగాలి. లేకపోతే తల్లి జిరాఫీ దాన్ని కాళ్లతో తన్ని నిలబెడుతుంది. జంతువులన్నీ పుట్టుకతోనే సొంతంగా బ్రతకడం అలవాటు చేసుకుంటాయి“ అన్నాడు తాతయ్య.
“నువ్వు చెప్పింది వింటే ఆశ్చర్యంగా ఉంది తాతయ్య” అన్నాడు రవి.
“అందుకే .. మనుషులుమైన మనం బద్ధకంగా ఉండకూడదు. జంతువులకన్నా ఆలోచనలో, తెలివిలో ఎంతో గొప్పవాళ్ళమైన మనం, సరికొత్తగా ఆలోచిస్తూ ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటూ, జీవితాన్ని అందంగా తీర్చి దిద్దుకోవాలి. బద్ధకానికి అలవాటు పడితే ఏమీ సాధించలేము. అందుకే ఎప్పటిపని అప్పుడే చేసేస్తూ సొంత కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నించాలి” కొనసాగించాడు తాతయ్య.
“తాతయ్యా. నాకిప్పుడో విషయం అర్ధమైంది. నేను బద్ధకంతో అమ్మానాన్నల మీద ఆధారపడుతుంటాను. ఇకనుండి అన్ని పనులు సొంతంగా చేస్తాను. క్రమశిక్షణతో మెలుగుతాను” అన్నాడు రవి.
ఈ మాటలు విని సత్యం తాతయ్య ఎంతగానో సంతోషించాడు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment