Friday, March 3, 2023

✍️.. *నేటి చిట్టికథ*

 ✍️.. *నేటి చిట్టికథ* 

ఒక గృహస్థుడు రోజూ బుద్ధునికి భిక్ష పెట్టేవాడట. ఆ సమయంలో "స్వామీ! నాకు ఉపదేశం ఇవ్వండి, దీక్ష ఇవ్వండి" అంటూ గౌతమబుద్ధుని ప్రార్థించేవాడు. 

బుద్ధుడు ఒకరోజు భిక్షా పాత్రలో దుమ్ము, ధూళి పెట్టుకొని భిక్షకు వచ్చాడు. ఆ గృహస్థుడు భిక్ష వేసేందుకు వచ్చి పాత్రను చూశాడు. "అయ్యా! పాత్రను శుద్ధి చేయకుండా భిక్ష భిక్ష అంటావేమయ్యా, ఆ మురికిపాత్రలో భిక్ష వేస్తే ఆ పధార్థం వ్యర్థమైపోదా?" అన్నాడట.

అప్పుడు బుద్ధుడు "అయ్యా! నా పాత్ర సంగతి అలా ఉండనీ, నీ అంతఃకరణమనే పాత్ర సంగతి ఏమిటి? నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోకుండా ఉపదేశం, ఉపదేశం అంటే ఎలా? కల్మషమైన అంతఃకరణంలో చేసిన ఉపదేశం వ్యర్థమే కదా. ముందు నీ అంతఃకరణాన్ని ఎటువంటి కోరికలు లేకుండా, అరిషడ్వర్గాలు లేకుండా నిర్మలంగా, పవిత్రంగా ఉంచుకో, అప్పుడు నీకు ఉపదేశం చేస్తాను" అన్నాడట. 

 
 
మన మనస్సులో కోరికలు తాపత్రయాలు, రాగద్వేషాలు ఉండి, ఎటువంటి ఉపదేశాలు ఎందరి నుండి పొందినా అవి వ్యర్థమే.

🍁🍁🍁🍁

ఆత్మశుద్ధిలేని యాచార మదియేల 
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినురవేమ"
 

మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధితో చేసే అచారం ఎందుకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు? అపనమ్మకంతో దూరాలోచనతో చేసే శివ పూజ ఎందుకు అని అర్థం.

No comments:

Post a Comment