Friday, June 16, 2023

కోపం ఒక శాపం

 140623g1736.    160623-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               *కోపం ఒక శాపం*
                 ➖➖➖✍️

*కొందరికి కోపం   ముక్కు మీదే ఉంటుంది.    చీటికిమాటికి చిరచిరలాడుతూ ఆగ్రహం ప్రదర్శిస్తారు.* 

*మనిషికి కోపం శత్రువు లాంటిది. అది ఎందరినో శత్రువుల్ని తెచ్చిపెడుతుంది. ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది.*

*మనసుకు నచ్చని మాటలు విన్నా, నచ్చనివారిని చూసినా కొందరికి ఇట్టే కోపం వచ్చేస్తుంది. అలాంటప్పుడు సరిపడని మాటలను పట్టించుకొనకపోవడం, కోపం కలిగించేవారి నుంచి మన దృష్టిని మరల్చుకోవడం మంచి పరిష్కారం.*

*తగిన కారణం ఉంటే కోపాన్ని ప్రదర్శించి నయానో భయానో ఎదుటివాడి తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం చేయకపోతే సంభవించే దుష్ఫలితాలకు మనమే కారణం కావచ్చు.*

*సరైన పద్ధతిలో  కోపాన్ని ప్రదర్శించడం అనేది అంత సులభం కాదన్నది విదుర నీతి.*

*అనవసరంగా క్రోధాన్ని ప్రద రించడం అనేది మనం విషం తాగుతూ ఎదుటివాణ్ని చావాలని కోరుకోవడం లాంటిది.*

*ఎవరిపైనైనా విసిరేందుకు ఎర్రగా కాలిన నిప్పు కణికలను చేతిలోకి తీసుకోవడం లాంటిదే కోపం,  క్రోధం ప్రతీకారాన్ని ప్రోత్సహిస్తుంది. అది సరైన పద్ధతి కాదని బుద్ధుడు. అంటాడు.* 

*బలవంతులైనవారు క్షమిస్తారు. విజ్ఞత కలిగినవారు అసలు పట్టించుకోరు. దీనితో మనకు కోపం తెప్పించినవాడు అవమానం చెందుతాడు.*

*పంచవటిలో సీత అపహరణకు గురైనప్పుడు శ్రీరాముడు ఎంతో వేదనతో గోదావరిని, చెట్టు గుట్టలను, పశుపక్ష్యాదులను ఆమె ఉనికిని తెలపమని వేడుకొంటాడు. గోదావరి మారు పలకక జలజలా ప్రవహిస్తూనే ఉంటుంది. పశువులు మోరలెత్తి శ్రీరాముడి వైపు జాలిగా చూస్తాయే కాని బదులు పలకవు. అప్పుడు రాముడికి వచ్చిన కోపం చూసి ప్రకృతి మొత్తం వణికిపోతుంది. తన వేదనను పట్టించుకోని ఈ పృధ్విని, సీత జాడ తెలపలేని జీవజాలాన్ని నాశనం చేస్తానంటూ బాణాన్ని ఎక్కుపెడతాడు.* 

*అప్పుడు సౌమిత్రి- 'అన్నా, ఈ కోపం నీకు శత్రువు అవుతుంది. నిగ్రహించు. స్వభావరీత్యా నీవు మృదుస్వభావుడివి. ఆత్మనిగ్రహం కలవాడివి. నీ బాణంలోని అగ్నికీలలు ప్రపంచాన్ని పటాపంచలు చేస్తే వదిన సీతమ్మను ఎక్కడని వెతుకుతావు. ఆ మాత సైతం నీ బాణాగ్నికి ఆహుతి అవుతుంది కదా!    నీ కోపం వెనక ఉన్న ప్రేమను వేదనను అర్ధం చేసుకొన్నవారు మనకు స్నేహితులుగా విశ్వాసపాత్రులుగా లభించక మానరు. వెతికితే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. కోపం కన్నా మనకు శత్రువు వధ ముఖ్యం. ఇప్పుడు మన కర్తవ్యం… సీతమ్మ అన్వేషణ' అని రాముణ్ని శాంతపరుస్తాడు.*

*సమాజ పరిస్థితులకు తగ్గట్టు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని మన అదుపులో ఉంచే ఓర్పు నేర్చుకోవాలి.* 

*ఓర్పు వల్ల జటిలమైన పనులు సైతం సఫలం అవుతాయి. జాతి ప్రయోజనాన్ని ఆశించి కోపం కనబరచవచ్చు.*

*ఆగ్రహం ప్రదర్శించేందుకు గాంధీజీ సత్యాగ్రహాన్ని ఎంచుకున్నారు.*

*కోపం నేరుగా ఉన్నట్టుండి పుట్టుకు రాదు. దానికి కారణం కావాలి. మౌన పోరాటం, నిరాహార దీక్ష, అలగడం, సహాయ నిరాకరణ లాంటి 'మెతక కోపపు పద్ధతులు సమాజానికి మేలు చేస్తాయి.*

*కోపం వ్యక్తిగతం కాకూడదని జిడ్డు కృష్ణమూర్తి 'ది సాంగ్స్ ఆఫ్ లైఫ్'లో సూచించారు. వ్యక్తిగతం అయితే మాత్రం కోపం ఒక శాపమే..!*✍️

No comments:

Post a Comment