Saturday, May 2, 2020

పంచకోశాలనుండి వేరుచేసిన ఆత్మను ఎలా భావించాలి?

💛 పంచకోశాలనుండి వేరుచేసిన ఆత్మను ఎలా భావించాలి?

💛 శ్రీ ఆది శంకరాచార్యుల వారి "ఆత్మబోధ" గ్రంధంలో

వ్యాఖ్యానం : సూక్ష్మంగా
ఒక రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు అన్నింటికీ తానే అధిపతి. తన కారణంగానే అన్ని పనులు జరిగిపోతుంటాయి. అయితే ఆయన స్వయంగా ఏమీ చేయడు. మంత్రి ఆలోచనలు చేస్తుంటాడు. అధికారులకు ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు. క్రింది అధికారులు దానికి తగినట్లుగా వ్యవహారం నడుపుతూ ఉంటారు. రాజు మాత్రం సాక్షిగా అన్నింటిని వీక్షిస్తూ ఉంటాడు. అలాగే ఆత్మయే అన్నింటికీ అధిపతి. సర్వానికీ అధిష్టానం. అయితే స్వయంగా ఆత్మ ఏమీ చేయదు. అక్రియం. అయితే ఆత్మవల్లనే అన్ని పనులు జరిగిపోతుంటాయి. మంత్రి లాంటి బుద్ధి ఆలోచనలు చేస్తుంటుంది. అధికారుల లాంటి ఇంద్రియాలకు ఆజ్ఞలు జారి చేస్తుంటుంది. దాని ప్రకారం దేహేంద్రియాలు పనులు చేస్తూ ఉంటాయి. ఆత్మ మాత్రం అక్కడి రాజులాగా సాక్షిలా వ్యవహరిస్తుంది. రాజ్యంలో పరిపాలనా వ్యవహారాలన్నింటిని తాను చెయ్యకుండానే అన్నీ తన పేరుమీదుగా ఎలా జరిగిపోతాయో అలాగే ఆత్మకు ఈ దేహంలో అన్నిపనులు, ఆలోచనలు, అనుభవాలు తన పేరు మీదగానే జరిగిపోతున్నా తాను మాత్రం ఏమీ చేయని దానిగా సాక్షిగానే ఉండిపోతున్నది. “మయాద్య క్షేణ ప్రకృతి: సూయతే స చరాచరం” అని గీతలో చెప్పింది ఇదే - ఒక లైటు నాటకంలోని అన్ని వస్తువులను, అందరు వ్యక్తులను ప్రకాశింపజేసి మనకు కనిపించేటట్లు చేస్తున్నది. ఆ లైటు కేవలంగా ఆ వస్తువులును చూస్తుంటుంది. అక్కడి చర్యలతో దానికే సంబంధంలేదు. సాక్షి మాత్రంగా ఉంటుంది. అలాగే ఆత్మ అన్ని దేహ-ఇంద్రియ-మనో-బుద్ధులను ప్రకాశింపజేస్తుంది. ఆ కారణంగా అవి వాటి వాటి ధర్మాలను నిర్వర్తిస్తాయి. అయితే వాటి కర్మలతో గాని, ఫలితాలతో గాని ఏ మాత్రం సంబంధం లేకుండా ఆత్మ కేవలసాక్షిగా ఉంటుంది.

"నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్ నకారయన్” అని గీతలో చెప్పినట్లుగా తొమ్మిది ద్వారాలు గల ఈ దేహమనే పురంలో ఏమీ చేయకుండా, ఏమీ చేయించకుండా హాయిగా, రాజులాగా ఆత్మ పురుషుడు విశ్రాంతిగా ఉంటాడు. ఆత్మను అట్టిదిగా తెలుసుకొని, అట్టి ఆత్మగా మనం ఉండాలి? ఎలా?

(i) మంచి పనో, చెడ్డపనో ఏది చేసినా సరే 'నేను చేశాను' అనే భావన లేకుండా, ఈ దేహం ద్వారా ఫలానా పని జరిగిపోతున్నది అనే నిర్లిప్త భావన ఉండాలి. ఆ పని చేసిన దేహాన్ని వేరుగా-ఊరకే చూడాలి. మంచి ఐతే గొప్పగా ఫీల్ కావటమో, చెడ్డ అయితే దిగాలు పడటమో గాక కేవల సాక్షిగా ఉండాలి.

(ii) మంచి చేస్తే సుఖము, చెడ్డ చేస్తే దు:ఖము వచ్చాయనుకోండి. అప్పుడు సుఖించే మనస్సును, దు:ఖించే మనస్సును నిర్లిప్తంగా చూడాలి. ఇలా చూస్తున్న నేను ఆత్మను అని భావించాలి.

(iii) ఒక వస్తువును చూచి ఫలానా అని తెలుసుకున్నప్పుడు అలా తెలుసుకున్న ఇంద్రియ మనస్సులను గమనించాలి.

(iv) కోరికలతో, సంకల్పాలతో బుద్ధి రెపరెపలాడుతున్నప్పుడు వాటిలో మునిగి పోక ఈ కోరికలెవరికి? అని ప్రశ్నించుకొని, ఇవన్నీ బుద్ధిలో పుట్టినవేనని గ్రహించి, బుద్ధిని గమనిస్తూ, నేను ఆ బుద్ధిని తెలుసుకొనే ఆత్మను - సాక్షిని అని గుర్తించాలి. ఇలా అన్ని దేహేంద్రియమనోబుద్ధులను, వాటి వృత్తులను నిరంతరం సాక్షిగా చూస్తూ ఉంటే, మనం ఆత్మగా ఉన్నట్లే. నేను నిష్క్రియమైన ఆత్మనే గాని ఈ పనులు చేసే వాణ్ణి కాదు అనే దృఢ నిశ్చయం ఉండాలి. నేను చేసే వాణ్ని కాదు. అనుభవించే వాణ్ని కాదు. నేను కేవల ఆత్మను అని ఆత్మగా ఉండిపోవాలి.

సేకరణ :* : ఆత్మబోధ - శ్లోకం : 18

No comments:

Post a Comment