Monday, January 4, 2021

జీవన మాధుర్యం

🍁జీవన మాధుర్యం🍁

✍️ మురళీ మోహన్

🤘మనిషి తన జీవిత కాలంలో ప్రపంచ వ్యవహారాలు నిర్వహించే తీరునే బతుకుగా చెబుతారు. పుట్టుక ప్రపంచానికి ప్రవేశ ద్వారం. మరణం నిష్క్రమణ మార్గం. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. జీవి అంటే ప్రాణంతో ఉన్నది. దేహంలో ప్రాణం ఉన్నంతవరకు జీవుడు.

ప్రతి జీవికీ అంతిమ గమ్యం మరణమే. జీవన ప్రయాణం చావుతో ముగిసిపోతుంది. బతుకు తీపి ఉన్నంతకాలం చావు గురించిన ఆలోచనే భయం కలిగిస్తుంది.

అయ్యో... అప్పుడే బాల్య, యౌవన దశలు దాటి, వార్ధక్యంలోకి వచ్చేశామా... మరణం ముంగిట ఉన్నామా- అనుకోగానే మనసు దుఃఖంతో బరువెక్కిపోతుంది.
బతుకు ముగిసిపోతోందనే బాధకు బదులు ఈ బతుకులో నేను సాధించినదేమిటి అనే ప్రశ్న వేసుకుంటే, మనం చేసిన పొరపాట్లన్నీ మనసులో మెదులుతాయి. పశ్చాత్తాపం కలుగుతుంది. మనం అలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేస్తే ఎంతో బావుండేది అనుకుంటాం.

విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేసి పెద్దవారయ్యాక, తమ ఆశలకు తగిన ఉద్యోగాలు దొరకనప్పుడు ఇలాగే పశ్చాత్తాపపడతారు. ఉద్యోగులు శ్రద్ధగా పనిచెయ్యకుండా పదోన్నతులు పొందలేరు కదా? చిన్న స్థాయిలోనే ఉద్యోగకాలం ముగిసిపోతుంది. అప్పుడు ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. సకాలంలో ఉన్నత విద్య చదివి, ప్రజ్ఞను పెంచుకుంటే పెద్ద ఉద్యోగం, ఎక్కువ జీతం పొందగల వీలుంటుంది. ఆర్థిక ఇబ్బందులు లేని జీవితం లభిస్తుంది. సంతానానికి మంచి విద్యతోపాటు ఉత్తమ భవిత  సాధ్యపడుతుంది.


బతుకుబండి ప్రయాణం సాఫీగా,ఒడుదొడుకులు  లేకుండా గమ్యం చేరాలంటే చక్కటి జీవన ప్రణాళిక వేసుకోవాలి. పొదుపు పాటించాలి. అప్పుల తప్పులు చెయ్యకూడదు. ఎవరికీ ఎలాంటి అపకారం తలపెట్టకూడదు. దుర్విచక్షణ చూపకుండా అందరితో ఆత్మీయంగా సమభావంతో వ్యవహరించాలి. కులమతాలన్నీ కల్పనలే, అడ్డుగోడలే. మనం ఇతరులకు చేసే ఉపకారాలే మన ఆస్తిపాస్తులు.  ఇతరులకు మనం చేసే అపకారాలే శాపాలు.


మనల్ని అందరూ ప్రేమించాలంటే, మనం అందర్నీ ప్రేమించాలి. ఈ జీవన సూత్రం పాటించిన వారికే బతుకు తియ్యదనం అనుభవంలోకి వస్తుంది. జన్మ ధన్యమవుతుంది.👍



🍁🍁🍁🍁

Source - Whatsapp Message

No comments:

Post a Comment