స్థిరబుద్ధి
మనుషుల ఆలోచనల సముదాయమే బుద్ధి. ఆ బుద్ధికి స్థిరత్వం, ప్రశాంతత లేనప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆలోచనలు అన్ని దిశలలో పరుగులు పెడతాయి. కాంతి కన్నా వేగంగా పయనిస్తాయి. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడే మనసు నిర్మలంగా ఉంటుంది. బుద్ధికి స్థిరత్వం సాధించడానికి మనిషి చేయవలసిన సాధనలెన్నో ఉంటాయని, అవి విజయవంతమైతేనే బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనలు, అవి ఎంత విలువైనప్పటికీ బుద్ధిలోకి చొరబడి అతడిని ప్రభావితం చెయ్యలేవని జ్ఞానులు చెబుతారు.
మనిషికి సందేహాలు, సమస్యలుగా తోచే ఎన్నింటికో... నిష్ప్రయోజకమైన అతడి ఆలోచనలే మూలకారణం. అంతర్మథనంతో పరిష్కరించుకోగల వాటికి, అతడు సమాధానాల కోసం, చమరీమృగంలా ఎక్కడెక్కడో వెదుకుతుంటాడు. అరణ్యంలో కస్తూరి లాంటి సువాసనలు వస్తున్నప్పుడు ఆ జంతువు అక్కడ కలయ తిరుగుతూ ఎక్కడినుంచి వస్తున్నాయోనని వెదుకుతుంది. ఆ వచ్చేది తనలోంచేనని తెలుసుకోలేదు. స్థిరబుద్ధి లేనప్పుడు మనిషి కూడా అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటాడు.
తాబేలు పరిస్థితులకు అనుగుణంగా, బాహ్య అవయవాలను లోలోపలికి ఉపసంహరించుకుంటూ అవసరమైనప్పుడు వెలికి తెచ్చుకుంటుంది. మనిషి కూడా స్థిరచిత్తంతో, లౌకిక అనుభూతులు కలిగించే ఉద్రేకాలపై, అదే విధంగా నియంత్రణ సాధించుకోవచ్చంటారు మహాత్ములు. జ్ఞానేంద్రియాలన్నింటిపై పట్టు సాధించుకొమ్మంటారు.
స్థిరబుద్ధి లేని మనిషి తన మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోలేడు. అహంభావనలు అదుపు తప్పుతుంటాయి. ప్రతికూల అనుభవాలను జీర్ణించుకోలేడు. తనను విమర్శించే వారంతా శత్రువులనుకుంటాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా, జ్ఞానప్రదాతలు గురువులైనా తనతో ఆనందాన్ని పంచుకుంటూ తన హితాన్ని కోరుకునేదెవరైనా, వారు చెబుతున్నదంతా అతడికి లోపభూయిష్ఠంగానే అనిపిస్తుంది. తప్పులు చేస్తూ అవి చిన్నవేనని సరిపెట్టుకుంటాడు. సరిదిద్దుకోలేని పెద్ద తప్పులూ చేస్తుంటాడు. ప్రలోభాలకు లొంగిపోతాడు.
స్థిరబుద్ధితో వచ్చే విశిష్టమైన లక్షణాలు మనుషులకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తాయి. స్వశక్తిపై నమ్మకం పెంచుతాయి. వానరుడైనా తన బుద్ధికి ఉన్న స్థిరత్వంతో హనుమంతుడు బుద్ధిమంతుల్లోనే వరిష్ఠుడు అనిపించుకుని కార్యసాధకుడిగా కీర్తిమంతుడయ్యాడు. స్థిరబుద్ధి తెచ్చిపెట్టే పట్టుదలతో భగీరథుడు గంగను దివినుంచి భువికి దింపగలిగాడు. స్థిరబుద్ధితో సాధ్యమయ్యే ఏకాగ్రచిత్తం- లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా, అది దగ్గరలోనే ఉన్నట్లు అనిపింపజేస్తుంది. విలువిద్య ప్రదర్శన సమయంలో అర్జునుడు ఆ విషయం నిరూపించాడు. ధనుర్విద్యలో సాటిలేని వాడనిపించుకున్నాడు. స్థిరబుద్ధితో మనిషి లక్షల మందిలో కదలికకు కారణం కాగలడని, లక్షలాది మనుషుల్లో కదలిక కనపడితే సమాజమే కదులుతుందన్నారు వివేకానందులు.
స్థిరబుద్ధి లేని మనుషులెప్పుడూ బుద్ధిదోషాల్ని తొలగించుకోలేరు. ఆధ్యాత్మికులు కాలేరు. భగవద్ధ్యానానికి ఉపక్రమించలేరు. కర్మయోగులకు కావలసినది నిశ్చయాత్మకమైన స్థిరబుద్ధి మాత్రమేనని, బుద్ధి మనసు రెండింటినీ గుణరహితమైన శూన్యస్థితికి చేర్చే సాధన అన్నింటికీ మూలాధారమై, మనిషిని మోక్షార్హుడిని చేయగలదన్నది గీతాచార్యుడు కృష్ణుడి బోధ. బుద్ధిని నియంత్రణలో నిలుపుకోవడమే ‘జ్ఞానం’ అన్న ఆయన మాటలు మనుషులకెప్పుడూ గుర్తుండాలి.
Source - Whatsapp Message

No comments:
Post a Comment