Sunday, January 3, 2021

ప్రార్థనాశక్తి

🧘ప్రార్థనాశక్తి🧘‍♂
🕉🌞🌎🌙🌟🚩

భక్తుడు ఆర్తితో, ఆర్ద్రతతో భగవంతుడికి చేసే విన్నపమే ప్రార్థన.


ఆధ్యాత్మిక చింతన, భగవంతుడి పట్ల ఉన్న అపారమైన విశ్వాసం ఎలాంటి కష్టాన్నయినా తొలగిస్తాయని పెద్దల మాట. శరణుజొచ్చి ఆర్తితో భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన తప్పక ఆదుకుంటాడని ఎందరో విశ్వసిస్తారు. ప్రార్థన అనేది గుండెల లోతుల నుంచి పెల్లుబికి వచ్చే మనోభావం.


నోటితో ప్రార్థించలేనివారు మనసులో ప్రార్థించవచ్చు. నిజానికదే మేలైన ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలవల్లే ఉత్తమ సంస్కారాలు అలవడతాయి. సాధనా ప్రణాళికలో ప్రార్థనకు విశిష్టస్థానం ఉంది. పరిశుద్ధ అంతఃకరణం, నిర్మలమైన భక్తికి భగవానుడు సంతుష్టుడవుతాడు.


ప్రార్థనకు శ్రద్ధాభక్తులతోపాటు దృఢమైన విశ్వాసం సైతం ముఖ్యం. ఇలాంటి ప్రార్థనలు శీఘ్రంగా ఫలవంతమవుతాయంటారు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ద్రౌపది, మీరాబాయి, త్యాగయ్య, గోపయ్య మొదలైన మహాభక్తుల ప్రార్థనలే ఇందుకు తార్కాణాలు. భగవంతుడు దయామయుడు. మనసారా ప్రార్థిస్తే కోరినవన్నీ ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.


మనిషి కోరికలు ధర్మబద్ధమై ఉండాలి. స్వార్థపూరితమైన మనసుతో కోరిన కోరికలు మనిషి వినాశనానికి దారితీస్తాయి. ఘోర తపస్సుచేసి ఆ పరమాత్మ నుంచి వరాలు పొందిన హిరణ్యకశిపుడు, రావణాది రాక్షసుల జీవిత చరిత్రలే దీనికి నిదర్శనాలు.


ప్రార్థన మనోమాలిన్యాన్ని నిర్మూలిస్తుంది. భవభయాన్ని తొలగిస్తుంది. ప్రార్థనల వల్ల మానసిక ఒత్తిడులన్నీ మటు మాయమవుతాయి. మనసులో ప్రశాంతత గూడుకట్టుకుంటుంది.


ప్రార్థనా సమయంలో మనసంతా ఒకచోట కేంద్రీకృతమవుతుంది. అప్పుడు సంశయాలన్నీ తొలగి పోతాయి. ఆందోళన తగ్గుతుంది. మనసు నిర్మల తటాకమవుతుంది.


భారతీయ సంస్కృతి మానవాళికి అందించిన అద్భుతవరం- ఈ ప్రార్థనాశక్తి. అనాది నుంచి తత్వవేత్తలు, ఆచార్యులు, యోగులు ప్రార్థన ద్వారానే పరిపూర్ణతను సాధించారు.


గాంధీజీకి ప్రార్థనా శక్తిమీద అపారమైన విశ్వాసం ఉంది. ‘మన లక్ష్యాన్ని పరమాత్మగా భావించాలి. అందుకోసం త్రికరణ శుద్ధితో నిజాయతీగా కృషిచేస్తే ఆ భగవంతుడు తప్పక సహకరిస్తాడు. అదే అసలైన ప్రార్థన’ అనేవారు గాంధీజీ.


రామకృష్ణ పరమహంస ప్రార్థన గురించి చెబుతూ- ‘మనం భగవంతుణ్ని ప్రాపంచిక కోరికలు కోరకుండా భక్తితో ఆయన అనుగ్రహం కోసం ప్రార్థన చెయ్యాలి. అలా చేస్తే దుఃఖాలు శాశ్వతంగా తొలగిపోతాయి. అప్పుడే ఆయన ముక్తికి సరైన మార్గం చూపిస్తాడు’ అని బోధించేవారు.


కొందరు లౌకిక సంపదలతోనే చిరశాంతి లభిస్తుందని భావిస్తారు. ఆ సంపదలకోసం దైవాన్ని ప్రార్థిస్తారు. నిజానికి లౌకికమైనది ఏదైనా శాశ్వతశాంతిని మానసిక ఆనందాన్ని ప్రసాదించలేదు. రాగద్వేషాలకు అతీతంగా లోకకల్యాణం కోసం, పరహితం కోసం చేసే ప్రార్థనలే మహత్తరమైనవి. అవే ఉదాత్తమైనవి. ఈ ప్రార్థనలు చేసేవారి మనసులు కూడా ప్రేమానురాగాలతో నిండి ఉంటాయి.


ప్రార్థన మనిషిలో మంచిని పెంచుతుంది. వ్యక్తిత్వంలో మార్పు తెస్తుంది. ప్రార్థన ఎప్పుడైనా చేయవచ్చు. సమయ నియమం లేదు. ఎవరిని ప్రార్థిస్తున్నామో వారిమీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. వేదం ప్రతిపాదించిన ‘వ్యాసవిద్య’ ఇది. ఉపనిషత్తులు విశదీకరించిన ‘ప్రపత్తి’ ఇది.


సర్వేజనా స్సుఖినోభవంతు అనే మహత్తరమైన ప్రార్థనను ఈ లోకానికి అందించిన సంస్కృతి మనది.


వ్యక్తిగతమైన కోరికల కోసం కాకుండా సర్వ మానవాళి శ్రేయస్సుకోసం ప్రార్థన చేయడం చాలా మంచిది. అదే మనిషికి మనశ్శాంతిని కలిగిస్తుంది !

🕉🌞🌎🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment