Tuesday, January 5, 2021

కాలం విలువ

🌸కాలం విలువ🌸

ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి, ఒక కొత్త కలను కనడానికి వయసుతో సంబంధం లేదు. మూడొందల అరవై అయిదు రోజులంటే, మూడొందల అరవై అయిదు అవకాశాలు అనుకుని మనిషి కార్యోన్ముఖుడై ముందుకు సాగిపోవాలి.

కాలం అంచు మీద జీవితం నాట్యం చేయనీయండి... ఆకు చివర మంచు బిందువులా- అని వర్ణిస్తారు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. కాలం కదలడం లేదని, మనిషి ఒంటరిగా ఉన్నానని అనుకుంటాడు... అదే అతడు తనతో తాను గడపాల్సిన సమయమని గుర్తుంచుకోవాలి.

మనిషి ఎదుగుదలకు అది ఎంతో అవసరం.
సమయపాలనంటే గడియారాన్ని అనుసరించి బతికేయడం కాదు. స్వయం నిర్వహణ. ముఖ్యమైన విషయాలకు ‘అవును’ అని చెప్పగలగడం. ‘కాదు’ అని చెప్పాల్సిన విషయాలకూ, అంతే శక్తితో చెప్పగలగడం. చేయాలనుకున్న పనులే కాదు. చేయకూడనివేమిటో క్రమశిక్షణతో, జీవితం పట్ల బాధ్యతతో వేరు చేయగలగాలి. ‘రేపు ఎక్కడుండాలి’ అని అనుకుంటే, కాలాన్ని ఆ దిశలోనే వెచ్చించాలి. ఆరోగ్యం గురించి కాలాన్ని ఖర్చు చేస్తే రోగాలను దూరంగా ఉంచవచ్చు. ఆధ్యాత్మికమైన ఆలోచనలను ఆకళింపజేసుకుంటే భవిష్యత్తులో మానసిక వైద్యులను సంప్రతించే పని తప్పుతుంది. మనశ్శాంతీ దక్కుతుంది.

చరిత్రలో కాలాన్ని సక్రమంగా వెచ్చించకుండా ఎవరూ విజేతలు కాలేదు. విజేతలను చూసి వారు అదృష్టవంతులని ఆసూయపడటంకంటే కాలాన్ని మనసు పెట్టి సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నం కావాలి.

కాలాన్ని వెచ్చించిన చోటే భవిష్యత్తు మొలకెత్తుతుంది! జనన మరణాల మధ్య మనిషి ఎన్నింటినో ఎదుర్కొంటుంటాడు. కొందరు ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిస్తే, మరికొందరు ఎలా ఉండకూడదో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తారు.

చాలామంది ఎటువంటి ప్రభావం చూపించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తారు.

జీవితానికి కాలం మూలాధారం. పుట్టగానే ఎంతో ‘కాలం’ ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయి ఉంటుంది. జీవితంలో ఏం సాధించాలో నిర్ణయించుకోవడానికి ఇందులో కొత్త సంవత్సరం కేవలం ఒక భాగం మాత్రమే. కాలానికి విలువను ఇచ్చేవారే జీవితానికి విలువనిస్తారని గ్రహించాలి. ‘నేను ఏది ముఖ్యమని నమ్మానో, దాని కోసం నాకు సరిపోయేంత సమయముంది చేయడానికి’ అని అనుకోగలిగే వ్యక్తే గొప్ప అదృష్టవంతుడు.

కొందరు కాలం చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్లుంది అంటూంటారు. ఒక రుతువు తరవాత మరొకటి. రోజులు, నెలలు సంవత్సరాల్లో ప్రచండ వేగంతో ఎగిరిపోతున్నట్లు ఉంటుంది. ‘ఏం సాధించలేకపోతున్నాం’ అని చింతించేవారు ఎందరో.

కదిలిపోయే ప్రతి క్షణం ఎరుకతో జీవించాలి. దేనికోసం లావాదేవీలు జరుపుతున్నాం... కోపం, అసూయలతోనా, గతం గురించిన వ్యక్తమైన బాధతోనా, భవిష్యత్తు గురించిన చింతతోనా... ఈ భూమ్మీదకు మనమెందుకొచ్చాం, దేనికోసం అన్న యథార్థాలను గ్రహించి ఆకళింపజేసుకోవడానికా... వీటి పై జీవితంలో స్పష్టత అవసరం.
ప్రకాశానికి అడ్డుతగలకుండా ఆత్మజ్ఞానంతో ఉన్నతిని పొందాలంటే ప్రతిరోజూ ధ్యానం కోసం సమయం కేటాయించాలి. లక్ష్యసాధనకు మార్గం ఏర్పడుతుంది. ఎంత సమయం కేటాయించగలిగితే అంత సార్థకత. జీవితం ఊహాతీతం. మనిషి ఎంపికలు, ఫలితాలు, ప్రేరణలు... ఎలా ఉన్నా గడియారం అదే వేగంతో కదులుతుంటుంది. కాలాన్ని సక్రమంగా వినియోగించుకుని సద్భావనలతో సాగిపోవడం ముఖ్యం. కాలం నేర్పే పాఠాలెన్నో! కాలం విలువను గ్రహించకపోతే, ఆ తరవాత అది మనిషితో తనకు తోచిన విధంగా ఆడుకుంటుంది. జీవితంలో మనిషి తన ఆనందపు తాళం చెవులను ఎవరి చేతిలోనూ పెట్టకూడదనే సత్యాన్ని తెలుసుకోవాలి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment