Friday, March 12, 2021

తలపు! (కవిత)

తలపు!
---------------
ఎవరి తలపైతే
గత జన్మ స్మృతులను
నిదుర లేపుతుందో
ఎవరి గొంతు విన్నంతనే
మనో తటాకాన అలలు కదులుతాయో
ఎవరి ఆలోచనలతో
నిదుర చెదిరి రాత్రుళ్ళు మేల్కొంటావో
ఎవరివల్ల ఆనందమెంతో
దుఃఖం అంతకన్నా రెట్టింపు పొందుతావో
వారి గురించి తలచుకో
ఈ జీవితం
ఒక్కసారే లభించే వరం మిత్రమా!
మనసిచ్చాక నువ్వు నువ్వు కావు
నువ్వు కేవలం నీకు మాత్రమే చెందవు
నీ జీవితం నీ అదుపులో ఉండదు
అసలు నువ్వు నీకోసం బ్రతకవు
ప్రాణం కన్నా మిన్న ఏమిటో నీకు తెలుస్తుంది
ఆ ప్రాణం నీకు ఎందుకు లభించిందో
నీకు అర్ధమవుతుంది
నువ్వపుడు జన్మకూ,
జన్మ రాహిత్యానికీ అతీతుడవవుతావు!
మనసు సున్నితమవుతుంది
బ్రతుకు పునీతమవుతుంది
భరించలేనిదే అయినా వేదన,
నీకు దివ్యత్వం సిద్ధిస్తుంది
వదులుకోకు మిత్రమా
ఈ అద్భుతమైన అనుభూతిని
ఈ అనిర్వచనమైన అనుభవాన్ని!
ప్రాణికి ఒక్కసారే లభించే ఈ జీవితాన్ని!
ప్రాణికి ప్రాణం విలువ తెలిపే ఈ బంధాన్ని!
ఈ అనుబంధాన్ని!!
---- దండమూడి శ్రీచరణ్
9866188266

Source - Whatsapp Message

No comments:

Post a Comment