Sunday, July 11, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

మనుషులతో కాదు, మనస్తత్వాలతో బతకాలి. కలిసి మెలిసి బతకాలి. మనిషి, మనసు ఒకటి కాదా? మనిషిలోనే మనసుంటుంది కదా. మనసుతోనే మనిషి జీవనం కదా. అవును. మనసుతోనే!
నన్ను అర్థం చేసుకో, నన్ను అర్థం చేసుకో అని చాలాసార్లు మనవాళ్లు మనతో అంటుంటారు. అర్థం చేసుకోవడం అవసరం. అర్థం చేసుకోకపోవడం వల్ల ఎన్నో చిక్కుముళ్లు ఏర్పడతాయి. అవి అపార్థాలుగా మారతాయి. వాటిని నెమ్మదిగా, నేర్పుగా విప్పుకోవాలి. అందరూ ఒకేలాగా ఉండరు... ఎవరికి వారు ప్రత్యేకం. రంగులో, రూపులో తేడా ఉన్నట్లే- భిన్నమైన మనస్తత్వాలూ కలిగి ఉంటారు. నొక్కితే పేలిపోయే తుపాకీ గుండులా ఉంటారు ఒకరు. నిదానంగా ఉంటారు మరొకరు. ఒకరు ప్రతి విషయంలో ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. ఒకరు అంటీ ముట్టనట్లు ఉంటారు... ఒకరు శాంతంగా ఉంటారు. ఒకరు మనకెందుకులే అన్నట్లు ఉంటారు. మరొకరు దేనికీ తొణక్క బెణక్క నిండుకుండలా ఉంటారు.
ఈ స్వభావాలు బయట మనుషులకే కాదు, మన కుటుంబంలోని వారికీ ఉంటాయి. అందుకే జాగ్రత్త వహించాలి.
శరీరానికి గాయమైతే మందో, మాకో ఇచ్చి బాగుచేసుకోవచ్చు. మనసు గాయపడితే బాగు చేయడం కష్టం. ఇంట్లో గబుక్కున ఏదైనా అన్నా, ఇంకొకరు దాన్ని సర్దిచెబుతారు. ఈ విషయంలో పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అని లేదు. ఎవరు ఎప్పుడైనా, ఎవరినైనా, ఏదైనా అనేసే సందర్భాలు చూస్తుంటాం. అటువంటప్పుడు కొంత మంది నొచ్చుకుంటారు. అందుకే మనసెరిగి మసలుకోవాలి. నాన్నగారికి కోపమెక్కువ. అమ్మ శాంతంగా ఉంటుంది. అన్న ప్రతిదానికీ చిరాకు పడతాడు. అక్క ఉత్తిపుణ్యానికే ఆందోళన పడుతుంది. చెల్లి క్షణక్షణం భయంగా ఉంటుంది. ఇలా రకరకాలు... ప్రతి ఒక్కరి మనసు ఒక్కో పుస్తకం లాంటిది. చదవడానికి ప్రయత్నించాలి. ఓపిగ్గా వారిని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనల్ని వారూ అర్థం చేసుకుంటారు.
అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు మనం బాగా అర్థమవుతాం అంటాడు ఓ ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు. కానీ, అపార్థం చేసుకోవడంలోనే జీవితాలు గడిచిపోతున్నాయి. అర్థాలు వెతుక్కోవడంలోనే కాలం కరిగిపోతుంది.
రామాయణ, మహాభారత కథల్లో ఎన్నో పాత్రలు ఆవేశ కావేషాలకు లోనై, అపార్థాలకు గురై విషాదంలో మునిగిపోయినట్లు చూశాం. చివరకు కథ సుఖాంతమై, సత్యమే గెలిచినట్లు రుజువైంది. మబ్బులు తొలగితేనే సూర్యుడు కనిపిస్తాడు. వెలుగు వస్తుంది. మనసులు నిర్మలమవుతాయి. మనుషులు కలిసిపోతారు. అపార్థాలకు కారణం మన మనసులోని అహం. దాన్నే నేను అంటారు. దీనికి సరైన విరుగుడు ‘ప్రేమ’.
దైవం మనల్ని ఏ కారణం లేకుండా ప్రేమిస్తున్నట్లే, మనం కూడా ప్రేమను అలవాటు చేసుకోవాలి. ప్రేమ వల్లనే కొత్త మనుషులు పుట్టుకొస్తారు. ‘నా జీవితం నా ఇష్టం. నాకు అదుపు లేదు. అడ్డు లేదు. ఆజ్ఞ లేదు. హద్దులు లేవు. నేను అనుకున్నదే జరగాలి. నా మాటే అందరూ వినాలి-’ అని అనుకుని విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి ఈ భూమ్మీద చోటు లేదు. మనుషులు మంచివారు, పరిస్థితులే దేనికైనా కారణం. పరిస్థితులను మారిస్తే అపార్థాలు తొలగిపోతాయి.
ధర్మరాజులా మనం ఉండలేకపోవచ్చు. కాని, దుర్యోధనుడిలా ఉండకూడదు. శ్రీరాముడిలా ఉండటం అసాధ్యం అనిపిస్తుంది. కాని రావణాసురుణ్ని ఆదర్శంగా పెట్టుకోకూడదు. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ఉద్యానవనం. అందమైన, అరుదైన పువ్వుల్లాంటి మనుషుల ఆత్మసౌందర్యాన్ని, ప్రేమ పరిమళాన్ని ఆస్వాదించాలి. ప్రేమను ఇవ్వాలి. ప్రేమను పుచ్చుకోవాలి.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment