Friday, February 18, 2022

భ క్తి

130122C1110. 180222-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


భ క్తి
➖➖➖✍️

మనలో అన్ని భావాలు ఉన్నట్లు, ‘భక్తి’ కూడా ఉంటుంది. వర్షాకాలంలో వరదొచ్చినట్లు భక్తి పొంగుకు రావాలి. రాదు. భక్తి పారవశ్యం అందరికీ తెలియదు. కొందరికి మాత్రమే తెలిసి, అందరికీ తెలియని ఆ భక్తి గురించి ఆధ్యాత్మిక చరిత్ర చాలా గొప్పగా చెబుతుంది. మనకు అనుభవంలోకి రానిది ఎంత గొప్పదైనా దాని విలువ ఓ పట్టాన అర్థం కాదు.

ఎంతోమంది భక్తులున్నారు. ఎన్నో విషయాలు చెప్పారు. వారు వారి దేవుళ్లకు, గురువులకు అంకితమై పోయారు. భక్తులే భక్తికి పరమ ప్రమాణాలు.

భక్తి ఏ స్థాయిలోనైనా ఉంటుంది. రెండు చేతులూ కలిపి జోడించిన దగ్గర నుంచి ‘ఇందుగలడందు లేడని చక్రి సర్వోపగతుండు...’ అని ప్రహ్లాదుడు తండ్రికి బోధించే స్థాయి వరకు ఉంటుంది.

ఇవ్వనిది భగవంతుడు భక్తుడి దగ్గర నుంచి ఆశించడం లేదు. అతడి హృదయంలో ముందుగా నిక్షిప్తం చేసి, భూమ్మీదకు పంపించి, ఆ తరవాత నీ భక్తి ఎంత అని అడుగుతున్నాడు.

అదేదో తనకు తెలియని విషయం లాగా మనిషి తెల్లమొహం వేసి చూస్తున్నాడు.

భక్తి మనిషికి సహజ వస్తువు. ప్రేమ మనిషిని నడిపించే ఇంధనం. ప్రేమ పెరుగుతూ పోతుంటే అది భక్తిగా మారుతుంది. ప్రేమ లేకుండా భక్తి ఉండదు. భక్తి ప్రేమను ఆధారం చేసుకుని బతుకుతుంది.

భయమో, భక్తో ఏదో ఒకటి ఉండాలంటారు పెద్దలు. భయం కారణంగా భక్తి అలవాటుగా మారవచ్చు. ఆ తరవాత భయం పోయి ఆ స్థానంలో ప్రేమ ప్రవేశిస్తుంది.

భక్తిని అలవాటు చేయాలి. భక్తిని పలక మీద బలపంతో అక్షరాలు దిద్దించినట్లు నేర్పాలి.

భక్తి పుట్టుకతో రాదు- కారణజన్ములకు తప్ప!

మనసులో భక్తి ఉంటుంది. అది మనుషులకు తెలియకుండా ఉంటుంది. భక్తిని రగిలించే ప్రేమజ్యోతి హృదయంలో జ్ఞానం రూపంలో ప్రవేశించాలి. జ్ఞానం తాళం తెరిస్తేనే గానీ భక్తి కనిపించదు.

ఇదంతా ఆసమయం వచ్చినప్పుడు దైవానుగ్రహం వల్ల జరుగుతుంది. చేసిందంతా చేసి, ‘నువ్వు నాకు భక్తితో మొక్కు. నీకు అన్నీ నేను చేస్తాను.’ అన్నాడు శ్రీకృష్ణుడు.

శరణాగతి చెంది, పాదాల మీద పడ్డాడు అర్జునుడు.

జ్ఞానం కలిగిన తరవాతే అతడిలో నిజమైన భక్తి, ప్రేమ పొంగుకొచ్చాయి. ‘నువ్వేం చెబితే, అది నేను చేస్తాను’ అని ఉత్సాహంతో కదనరంగంలోకి దూకాడు.

మన లోపల ఉన్న భక్తిని, సరైన సమయంలో భగవంతుడే చూపిస్తాడు.

అప్పుడు అన్నమయ్యను, త్యాగరాజును, ఆంజనేయుణ్ని తలచుకుని తలచుకుని మురిసిపోతాం.

భక్తికి ప్రయోగశాల భక్తుడి శరీరమే. నవవిధ భక్తుల గురించి నారద మహర్షి భక్తి సూత్రాలు రచించారు. అందులో ఏ ఒక్కటి ఒంటబట్టినా దైవదర్శనం సాధ్యపడు తుందంటారు.

భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు అన్నారు. అన్నంలో భక్తిని కలుపుకోవాలి. అంటే భక్తితో జీవించాలి. భక్తిని శ్వాసించాలి. భక్తి శరీరంలో రక్తంగా ప్రవహించాలి. మనసులో మహా భావమై పొంగిపొరలాలి. ఆత్మను శుద్ధిచెయ్యాలి.

ఎన్ని జన్మలెత్తినా, ఒకసారి భక్తుడిగా పుడితే, కథ ముగింపునకు వస్తుంది. తప్పకుండా దైవ దర్బారులో ఆసనం దొరుకుతుంది అంటారు పెద్దలు.

భక్తికి భావం ప్రధానం. అందరికీ కనిపించని రూపం భక్తుడికి కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా ఎవ్వరూ లేకుండా ఏవో మాటలు మాట్లాడుతున్న పిచ్చివాడిలా కనిపిస్తాడు నిజమైన భక్తుడు. అలా ఎందరో కనిపించారు. లోకం వాళ్ళను పట్టించుకోలేదు. కాని, అతడి హృదయంలో భక్తిని నాటిన ఈశ్వరుడు మాత్రం వాళ్ళ వెంటే ఉన్నాడు, ఉంటాడు. కాయ లాంటి భక్తుడే ఒక రోజున పండు లాంటి భగవంతుడిగా మారతాడు.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

No comments:

Post a Comment