*ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు.*
*వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి, తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.*
*కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు.*
*చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు.*
*విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్య ఫలం ఏపాటి సాటి వస్తుందని అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు.*
*తపోఫలమా? సత్సాంగత్య ఫలమా? ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. విష్ణువు, దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు.*
*ఇద్దరూ కలిసి అక్కడకూ వెళ్లారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటివరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు.*
*విశ్వామిత్రుడు వెంటనే ‘నా వేయి సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది’ అన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు.*
*అప్పుడు వశిష్ఠుడు అన్నాడు ‘ఒక్క పూట సమయంతో పాటు మేం చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్య ఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.*
*వశిష్ఠుడు అలా అనగానే, ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని ‘మీ ఇద్దరూ ఇక వెళ్లవచ్చ’ని అంటాడు.*
*అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్లమంటే ఎలా? అని ఇద్దరూ ఆదిశేషుడిని ప్రశ్నించారు. ‘మీ ఎదురుగానే రుజువైంది కదా! ఏ తపోఫలం గొప్పదో? ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది?’ అని ఆదిశేషుడు అన్నాడు.*
*వేయి సంవత్సరాల తపశ్శక్తి ధారపోసినా కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్య ఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు గ్రహించారు.*
*చూశారుగా! మంచి మాటల ప్రభావమెంతో?*
*ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా అదే పని. ఏ ఇద్దరు కలిసినా అదే తీరు. ‘చరవాణి’ తోనే మాట్లాడుకుంటున్నారు. చరవాణితోనే గడుపుతున్నారు. దానితోనే పుణ్య కాలం కాస్తా గడిచిపోతోంది. ఇక మనం మనసు విప్పి మనతో మనం, ఇతరులతో మనం మంచి మాటలు మాట్లాడేదెప్పుడు?🙏*
No comments:
Post a Comment