Thursday, October 9, 2025

 *శ్రీ శివ మహా పురాణం* 
*397.భాగం*

*వాయవీయ సంహిత (పూర్వ భాగం)పదహారో అధ్యాయం* 

*దేవీ శక్తి ఉద్భవించుట* 

*వాయువు ఇట్లు పలికెను:* 

అప్పుడు ప్రకాశస్వరూపుడు, దేవాధిదేవుడు, మిక్కిలి ప్రీతిని పొందినవాడు అగు ఈశ్వరుడు గొప్ప మేఘగర్జనను పోలియున్నది, మధురము గంభీరము సుస్పష్టము మరియు సున్నితము అగు వర్ణములు గలది, అర్థముతో నిండియున్న పదములు గలది, రాజఠీవి గలది, సకలములైన విషయములను ఆరంభించి వాటిని స్వచ్ఛముగా పోషించుటలో సమర్థమైనది, మిక్కిలి మనోహరము ఉదారము మధురము అగు చిరున వ్వుతో మొదలగునది అగు వాక్కుతో సృష్టికర్తయగు బ్రహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను.

*ఈశ్వరుడిట్లు పలికెను:* 

ఓ కుమారా! కుమారా! నీవు నా పుత్రుడవు. ఓ పితామహా! నీ వాక్యములోని గాంభీర్యము అంతయు నాకు ఎరుకయే. నీవు ఇప్పుడు ప్రజల వృద్ధి కొరకు మాత్రమే తపస్సును చేసితివి. నీ తపస్సుచే నేను ప్రసన్నుడనైతిని. నీ కోరికను తీర్చెదను. ఈ విధముగా మిక్కిలి ఉదారమైనది, స్వభావము చేతనే మధురమైనది అగు వచనమును పలికి, దేవదేవుడగు శివుడు తన శరీరభాగమునుండి దేవిని సృష్టించెను. సర్వేశ్వరుడగు శివపరమాత్మయొక్క ఆ దివ్యగుణములతో కూడియున్న సర్వోత్కృష్టశక్తిని బ్రహ్మవేత్తలు దేవి అని వర్ణించుచున్నారు. ఆమెయందు పుట్టుక, మరణము, వృద్ధాప్యము మొదలగునవి లేవు. ఆమె భవుని శరీరమునుండి ఆవిర్భవించుటచే భవాని యనబడును. వాక్కులు, మనస్సు మరియు ఇంద్రియములు ఆమెయొక్క స్వరూపమును తెలియజాలక వెనుకకు మరలి వచ్చుచున్నవి. ఆమె భర్తయొక్క దేహభాగమునుండి పుట్టినదా యన్నట్లు కానవచ్చెను. ఆమె తన మహిమచే ఈ జగత్తునంతనూ వ్యాపించి యున్నది. ఆ దేవి శరీరము కలది వలె కానవచ్చుట విచిత్రము. ఆమె ఈ జగత్తునంతనూ మాయచే సమ్మోహ పరచుచున్నది. ఆమె ఈశ్వరునినుండి పుట్టిననూ, వాస్తవములో పుట్టనే లేదు. ఆమె యొక్క సర్వోత్కృష్టస్వరూపము దేవతలకైననూ తెలియదు. జగత్తునకు, దేవతలకు ప్రభ్వియగు ఆమె భర్తయొక్క దేహమునుండి విడివడినది. సర్వలోకములకు అధిరాజ్ఞి , సర్వజ్ఞురాలు, సర్వవ్యాపిని, సూక్ష్మమగు స్వరూపము గలది, కారణ కార్యభావమునకు అతీతురాలు, సర్వోత్కృష్టురాలు, ఈ జగత్తునంతనూ తన కాంతిచే ప్రకాశింప జేయుచున్నది, మహాదేవి అగు ఆ పరమేశ్వరిని చూచి, హిరణ్యగర్భుడు, నమస్కరించి ప్రార్థించెను.

*బ్రహ్మ ఇట్లు పలికెను:* 

ఓ దేవీ! సర్వజగత్స్వరూపిణీ! సృష్ట్యాదియందు శివుడు నన్ను సృష్టించి, ప్రజలను సృష్టించే కార్యమునందు నియోగించినాడు. నేను సకలజగత్తును సృష్టించుచున్నాను. ఓ దేవీ! నేను దేవతలు మొదలగు వారిని మనస్సుచే సృష్టించినాను. నేను వారిని మరల మరల సృష్టించుచున్ననూ, వారు వృద్ధి చెందుట లేదు. ఈ పైన నేను స్త్రీ పురుషసంయోగజన్యమగు సృష్టిని మాత్రమే చేసి నా సంతానమునందరినీ చక్కగా అభివృద్ధి చేయవలెనని కాంక్షించుచున్నాను. పూర్వము నీ నుండి స్త్రీ సమూహము ఉదయించలేదు. కావున, స్త్రీ సమూహమును సృష్టించే శక్తి నాకు లేదు. శక్తులన్నియూ ఉద్భవించేది నీనుండియే గదా! కావున, సర్వకాలములలో సర్వులకు శక్తిని మరియు వరములను ఇచ్చే దేవేశ్వరివి మరియు మాయాస్వరూపిణివి అగు నిన్ను మాత్రమే నేను ప్రార్థించుచున్నాను. ఓ సర్వవ్యాపినీ! సంసారనాశినీ! నీవు స్థావరజంగమాత్మకమగు సృష్టి వృద్ధిని పొందుట కొరకై ఒక అంశచే నా పుత్రుడగు దక్షునకు కుమార్తెవు కమ్ము. పరబ్రహ్మనుండి పుట్టిన బ్రహ్మ ఈవిధముగా ప్రార్థించగా, ఆ దేవి తన కనుబొమల మధ్యనుండి తనతో సమానమగు కాంతి గల ఒక శక్తిని సృష్టించెను. దేవదేవోత్తముడగు శివుడు ఆమెను చూచి నవ్వి ఆమెతో నిట్లనెను. నీవు తపస్సుచే బ్రహ్మను ఆరాధించి, ఆతని కోరికను మన్నించుము. పరమేశ్వరుని ఆ ఆజ్ఞను ఆమె తలదాల్చి, బ్రహ్మ కోరిన విధముగా దక్షుని కుమార్తె అయెను. మరియు, ఆమె వేదము రూపములోనున్న సాటిలేని శక్తిని బ్రహ్మకు ఇచ్చి, శివుని దేహమును ప్రవేశించెను. శివుడు కూడ అంతర్ధానమాయెను. ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఆ నాటినుండియు ఈ లోకములో స్త్రీల భోగము స్థిరపడి, స్త్రీ పురుషసంయోగముచే సంతానము కలుగుచుండెను. ఓ మహర్షులారా! బ్రహ్మ కూడ సంతోషమును, ఆనందమును పొందెను. ఈ విధముగా దేవినుండి శక్తి పుట్టిన తీరు అంతయు మీకు చెప్పబడినది. పుణ్యమును వర్ధిల్లజేయు ఈ వృత్తాంతమును సృష్టిప్రకరణముతో బాటు వినవలెను. దేవినుండి శక్తి పుట్టిన ఈ వృత్తాంతమును ఎవడైతే నిత్యము కీర్తించునో, ఆతడు సకలపుణ్యమును, పుత్రులను మరియు శుభములను పొందును.

*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో దేవీశక్తి ఉద్భవించుటను వర్ణించే పదనారవ అధ్యాయము ముగిసినది.*

No comments:

Post a Comment