6️⃣1️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*10. సహ యజ్ఞా: ప్రజాస్సృష్ట్వా పురోవాచ ప్రజాపతిl*
*అనేన ప్రసవిష్యధ్వమేషవోఽస్త్విష్టకామధుక్ll*
కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధిచెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలనెల్ల తీర్చును అని చెప్పాడు.
ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు ప్రజలను సృష్టించాడు. వెంటనే వారు చేయవలసిన కర్మలను సృష్టించాడు. వాటినే యజ్ఞములు అన్నారు. ఈ యజ్ఞముల ద్వారా అంటే కర్మల ద్వారా వృద్ధిచెందండి అని ప్రజలను ఆదేశించాడు. ఈ యజ్ఞములు మీకు సకలమైన కోరికలు తీరుస్తాయి. ఈ యజ్ఞములు కామధేనువు లాంటివి అని చెప్పాడు. దీనికి సాధారణంగా అర్ధం చెప్పుకోవాలంటే ఏ వ్యక్తి అయినా, పుట్టగానే వాడు చేయవలసిన కర్మ కూడా పుడుతుంది. అది మంచి కర్మ కావచ్చు చెడు కర్మ కావచ్చు. ఆ వ్యక్తి తనలో ఉన్న గుణములను బట్టి ఆ కర్మలు చేస్తాడు. ఆ కర్మలు అతనికి కామ ధేనువు వలే తగిన ఫలితములను (మంచి గానీ, చెడు గానీ) ఇస్తాయి. చేసే కర్మలను ఒక దేవతారాధన మాదిరి, ఫలితం ఆశించకుండా చేస్తే ఆనందం, శాంతి కలుగుతుంది. అలా కాకుండా తమ ఇష్టం వచ్చినట్టు చేస్తే సుఖము, దు:ఖము, బంధనములు కలుగుతాయి.
మానవులు సృష్టించబడి నపుడు వారి వెంట వారు చేయవలసిన కర్మలు కూడా సృష్టించబడ్డాయి. కర్మలు చేస్తే ఫలములు వస్తాయి. ఆ కర్మఫలములు బంధనములను కలిగిస్తాయి. ఆ కర్మ బంధనములలో చిక్కుకోకుండా ఉండే సాధనములు కూడా వేదములలో శాస్త్రములలో వివరించబడ్డాయి. ఆ సాధనములే యజ్ఞములు. ఆ రోజుల్లో యజ్ఞములను వేదములలో చెప్పబడిన కర్మకాండల ననుసరించి చేసేవారు. కాని ఈ రోజుల్లో యజ్ఞము అంటే సాటి ప్రజలకు ఉపయోగపడే స్వార్థరహితమైన కర్మ అని అర్థం చెప్పుకోవచ్చు. ఆ కర్మ కూడా భగవంతుని పరంగా చేయాలి. పరోపకారం కొరకు చేయాలి. నిష్కామంగా చేయాలి. నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చేయాలి. ఇటువంటి కర్మలు కామ ధేనువుల వంటివి. కామధేనువు అంటే కోరిన కోరికలు తీర్చేది. అలాగే ఇటువంటి కర్మలు మంచి ఫలితములను ఇస్తాయి. ఇటువంటి పనులు చేయడం వలన ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అనేక దుఃఖముల నుండి విముక్తి కలుగుతుంది. మానవునిలో నైతిక విలువలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ముఖ్యంగా మనసుకు శాంతి కలుగుతుంది.
ఈ రోజుల్లో ఎంత ఆస్తి, అంతస్తు, హోూదా, పదవి ఉన్నా, ప్రతి వాడికి మనశ్శాంతి కరువవుతూ ఉంది. అనేక అక్రమాలు చేసి, అవస్థలు పడి సంపాదించిన ధనం అంతా మనశ్శాంతి కోసం ఖర్చుపెడుతున్నారు. ధర్మపరంగా నిష్కామ కర్మలు, ఫలాపేక్షలేకుండా, కర్మత్వభావన లేకుండా చేస్తే మనశ్శాంతి దానంతట అదే లభిస్తుంది. మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో బతికిన బాబాల చుట్టు తిరగనవసరం లేదు. ఇక్కడ కర్మలు, యజ్ఞములు అంటే ఇది వరకు అధ్యాయములలో చెప్పబడిన నిష్కామకర్మ నిస్వార్ధకర్మ, కర్మత్వభావనలేని కర్మ, అని అర్థం చేసుకోవాలి.
*11. దేవాన్బావయతానేన తే దేవా భావయన్తు వ:l*
*పరస్పరం భావయన్త: శ్రేయ: పరమవాప్స్యథll*
యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు. ఆ దేవతలు మీకు మేలు చేస్తారు. ఈ విధంగా మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు.
ఈ శ్లోకంలో దేవతలు అనే పదం వాడారు పరమాత్మ. దేవతలు అంటే మంచి వాళ్లు ధర్మపరులు అని కూడా అర్థం. సాత్విక గుణం కలవారందరూ దేవతలే. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. సాత్విక గుణం కల దేవతలలో ఇంకా ప్రకృష్టంగా ప్రకటితమౌతుంటాడు. దేవతలు ఎక్కడో ఉన్నారు అని అనుకుంటే సకలదేవనమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి అని వేదవాక్యము. కాబట్టి మనం ఏ దేవుడిని ఏ దేవతలను ఆరాధించిన అది పరమాత్మను ఆరాధించినట్టే. ఏయే దేవతలను ఆరాధిస్తే, ఆయా ఫలములు మనకు లభిస్తాయి. దేవతారాధన కూడా ఒక యజ్ఞమే. ముందు శ్లోకంలో చెప్పినట్టు ఏ యజ్ఞము కానీ, కర్మ కానీ స్వార్థబుద్ధితో కాకుండా సమాజహితం కొరకు చేస్తే, అది కూడా దేవతారాధన కిందికే వస్తుంది. మంచి ఫలితములను ఇస్తుంది. దాని ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి పరమాత్మ పరంగా చేసే ఏ పని అయినా అది యజ్ఞమే.
ఇది వరకు యజ్ఞములు చేసే వారు అని చెప్పుకున్నాము కదా. ఆ యజ్ఞములలో వివిధములైన సమిధలను, ఓషధులను వేసే వారు. ఆ ఓషధులు కాలి వాటినుండి ధూమము పైకి లేచేది. ఆ ధూమముపైన ఉన్న మేఘములతో చేరి, మనకు వర్షములు కురిసేటట్టు చేసేది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ మాసములు యతులు, మునులు అందరూ చాతుర్మాస్య వ్రతం చేసేవారు. అప్పుడు ప్రతిరోజూ హెూమము చేసేవారు. యజ్ఞములు చేసేవారు. యజ్ఞకుండములో ఎన్నో ఓషధులను, నేతిని, సమిధలను వేసేవారు. వాటి నుండి వెలువడిన ధూమం పైకి లేచి ఎక్కడెక్కడో ఉన్న మేఘములను ఒక చోటకు చేర్చి వర్షములు కురిపించేవి. అందుకే ఆ నెలలలో వర్షములు కురిసేవి. పంటలు పండేవి. ధన, ధాన్యములు సమృద్ధిగా సమకూరేవి. మరి ఇవన్నీ దేవతలు మనకు ఇచ్చిన వరాలు కాదా! ఈ రోజుల్లో యజ్ఞయాగాలు లేవు కానీ మేఘమధనాలు జరుగుతున్నాయి. మేఘాలను ప్రార్థించి, ఆవాహన చేస్తే వర్షాలు కురుస్తాయి కానీ మధిస్తే వర్షాలు కురుస్తాయా. అందుకే మేఘమథనాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P158
No comments:
Post a Comment