Monday, May 31, 2021

ఉత్తమ దృక్పథం

💥ఉత్తమ దృక్పథం
🕉️🌞🌎🏵️🌼🚩

సమాజాన్ని, నిత్యం ఎదురయ్యే అనుభవాలను మనిషి దర్శించే విధానమే దృక్పథం. పరవళ్ళు తొక్కుతున్న గోదావరి ఆనకట్ట మీదుగా రైలు ప్రయాణిస్తోంది. ఓ మహిళ వెంట తెచ్చుకున్న పసుపు, కుంకుమల్ని భక్తితో- పవిత్రమైన ఆ నీళ్ళలోకి జారవిడిచింది. పక్కనే కూర్చున్న యువకుడికి ఆమె చర్య హాస్యాస్పదంగా అనిపించింది. అతడు అల్పాహారం తిన్న తరవాత పొట్లం కట్టిన కాగితాన్ని నలిపి అదే నీళ్ళలోకి విసిరేశాడు. ఆ చర్యలు సంస్కృతీ సంప్రదాయాల ఆచరణలో వాళ్ళ దృక్పథాన్ని తెలియజేస్తాయి.
జరిగే సంఘటనలను సామాన్యులు యథాతథంగా గ్రహిస్తారు. సత్పురుషుల వ్యక్తిత్వం అందుకు విభిన్నం.శ్రీరాముడు అనేక సందర్భాల్లో సంఘటన అంతర్లీనతను గ్రహించి ఉత్తమ దృక్పథాన్ని ప్రదర్శించడం గమనించవచ్చు.
సీతా లక్ష్మణ సమేతుడై రాముడు అరణ్యాలకెళ్ళాడు. భరతుడికి ఆ విషయం ఆలస్యంగా తెలిసింది. పితృ సంస్కారాలను భారంగా పూర్తిచేశాడు. అన్న లేని అయోధ్యలో ఇక ఏమాత్రం ఉండలేక, ఆయనను అయోధ్యకు తీసుకువస్తానంటూ బయలుదేరాడు. సైన్యం, ప్రజలు భరతుడితో కలిసి ముందుకు నడిచారు. కొంత ప్రయాణం తరవాత వారు గుహుడి నివాసాన్ని సమీపించారు. భరతుడు సైన్య సమేతుడై రావడాన్ని గుహుడు దూరంనుంచే చూశాడు. రాముడికేదైనా అపకారం చెయ్యబోతున్నాడేమో అని అతడి మనసు కీడును శంకించింది. భరతుణ్ని సమీపించి తన అనుమానాన్ని వ్యక్తపరచాడు.
గుహుడి మాటలు భరతుణ్ని తీవ్రంగా బాధించాయి. తనకు తండ్రిలాంటి వాడైన శ్రీరాముడిని అరణ్యం నుంచి అయోధ్యకు తీసుకెళ్ళడానికే తాను వచ్చానని చెప్పాడు. అతడి మాటలు విని గుహుడు సంతోషించాడు. రాముడు అరణ్యానికి వెళ్ళిన మార్గాన్ని చూపించాడు. భరతుడు గుహుణ్ని కలుపుకొని ముందుకు సాగిపోయాడు.
కొంత ప్రయాణం తరవాత భరతుడు భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆ రుషి భరతుడికి అతడి పరివారానికి మంచి ఆతిథ్యం అందించాడు. కుశలప్రశ్నలడిగిన పిమ్మట భరద్వాజుడు అతడి రాకలోని ఆంతర్యాన్ని ప్రశ్నిస్తూ రామలక్ష్మణులకేదైనా అన్యాయం తలబెట్టబోతున్నావా అంటూ నిర్భయంగా, నిర్మొహమాటంగా అడిగాడు. ఆ ప్రశ్న వినడంతోనే భరతుడు దుఃఖితుడయ్యాడు. మహర్షిని సమీపించి తనకే పాపం తెలియదని విన్నవించుకున్నాడు. భరతుడి నిజాయతీని అర్థం చేసుకున్న భరద్వాజుడు అతన్ని… ఓదార్చాడు. రాముడి ఔన్నత్యాన్ని మరోమారు భరతుడికి తెలియజెప్పాడు. రామలక్ష్మణుల్ని చేరుకోవడానికి దారిని చూపించాడు.
మరికొంత దూరం ప్రయాణం చేసిన భరతుడు సీతారామలక్ష్మణులు నివసిస్తున్న చిత్రకూట పర్వతాన్ని సమీపించాడు. భరతుడు సపరివారంగా రావడంవల్ల ఆ ప్రాంతమంతా ధూళి వ్యాపించింది. లక్ష్మణుడు అందుకు కారణాన్ని అన్వేషిస్తూ చెట్టు పైకెక్కి చూశాడు.
భరతుడు సైన్యసమేతుడై రావడం కనిపించింది. భరతుడి రాక లక్ష్మణుడికి అపోహను కలిగించింది. పరుషోక్తులతో భరతుణ్ని నిందించడం ప్రారంభించాడు.
శ్రీరాముడు ఆ సందర్భంలో భరతుడి పట్ల ఔదార్యాన్ని ప్రదర్శించాడు.

లక్ష్మణుడిని వారిస్తూ భరతుడి రాక సమయోచితంగా ఉందంటూ కొనియాడాడు. అతడు వచ్చిన పిమ్మట పరుష వచనాలను ఉపయోగించ వద్దని ఆ విధంగా మాట్లాడితే అది తనను గురించి మాట్లాడినట్లే కాగలదని అన్నాడు. రాజ్యం కోసం ఆశతో ఈ విధంగా భరతుణ్ని నిందిస్తున్నావన్న భావన తనకు కలగగలదని చెప్పాడు.
ఈ విధంగా గుహుడు, భరద్వాజుడు, లక్ష్మణుడు వంటివారు శంకించిన భరతుడి వ్యక్తిత్వాన్ని శ్రీరాముడు తన దృక్పథంతో సరైన కోణంలో దర్శించాడు. అన్నదమ్ముల బంధాన్ని కలకాలం నిలుపుకోగలిగాడు.
మనందరం నకారాత్మకతను విడిచిపెట్టాలి. తోటి మనుషులపట్ల, జరిగే సంఘటనల పట్ల సరైన దృక్పథాన్ని కలిగి ఉండాలి. జీవితాన్ని ఆదర్శమయంగా తీర్చిదిద్దుకోవాలి.
ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంకలాంటి మనిషిలో కూడా వెయ్యి వంకలు కనిపిస్తాయి.

ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే వెయ్యి వంకలున్న మనిషి కూడా నెలవంక లాగా అందంగా కనిపిస్తారు. కాగితం నలిపేటపుడు చెత్తగా చూస్తాం. డబ్బయినపుడు దేవుడిగా చూస్తాం. మనమూ కాగితమే, చెత్తవడం దేవుడవడం మన స్థాయిని బట్టే ఉంటుంది*

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment