Sunday, May 23, 2021

సజ్జన సాంగత్యం

🌸సజ్జన సాంగత్యం🌸

మంచి భావాలు, నడవడికగల వ్యక్తుల కలయికే సత్సంగం. ఇలాంటి వ్యక్తులు ఒకచోట కలుసుకొని ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసు కోవాలి. విజ్ఞులు, ప్రాజ్ఞులు, మేధావులు, సత్పురుషులు, పెద్దల ఉపన్యాసాలు వినే అవకాశం లభిస్తే పొరపాటునకూడా ఆ అవకాశాన్ని జారవిడుచు కోవద్దు.

ధర్మం కుంటికాలుతో కూడా కుంటలేక కుప్పకూలిపోతున్న ఈ కలికాలంలో అధర్మం, అన్యాయం, అత్యాచారాలు, ప్రేమోన్మాదాలు, ప్రతీకార వాంచలు తప్ప సదాచారాలు, ఉత్తమ సంస్కారాలు కంపించని ఈ రోజుల్లో మంచితనం, మానవత్వం గుండెల నిండా నింపుకున్న ప్రతిమనిషీ దేవునితో సమానమే. కనుక అలాంటి వ్యక్తుల్ని కలిసే అవకాశం లభిస్తే మనసారా చేతులు జోడించి వారికి నమస్కరించే అదృస్టం కలిగితే, ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ వదులుకోవద్దు.

మల్లెపూలతో కలిసిన మట్టిపెడ్డకు కూడా ఎలా ఆ మల్లెల సుగంధం అంటుకుంటుందో, సత్పురుషులతో కలవటంవలన వారియొక్క మంచితనం, మానవత్వాలలో ఎంతోకొంత అంటుకొనక మానదు. మంచితనం, మానవత్వం, దయాగుణం, నిస్వార్ధం ఇలాంటివన్నీ నిప్పురవ్వల లాంటివి. మెల్లగా అవి మండుతూ అవకాశం లభిస్తే దావానలాన్నే సృష్టించగలవు.కావున ఉన్నతమైన ఆ సద్గుణ బీజాలు మన మనసుల్లో నాటుకున్నత్లైతే అవి మహా వృక్షాలై మనల్ని మహనీయులుగా మలుస్తాయి. అందులకే “సజ్జనులతో చెలిమి – అన్నింటా కలిమి” అన్నారు పెద్దలు.

🌹“సజ్జన సాంగత్యంబున మూర్ఖము సమసి విరాగము గలుగునురా, మూడులోకముల సత్సహవాసమె ముక్తినొసంగును దెలియుమురా”

యని జగద్గురు శంకరాచార్యులవారు మానవాళికి సందేశమిచ్చారు. అందులకై సజ్జనులతో స్నేహం చేసి, వారిలో ఉన్న సద్గుణాలను స్వీకరించి, నిజ జీవితంలో ఆచరించినట్లైతే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. తద్వారా మనమూ సమాజంలో మన చుట్టూ ఉన్న పదిమందికి మంచి మార్గాన్ని చూపించి, మార్గదర్శకులుగా తయారవుదాం. బహుజన్మల పుణ్య పాకవశాన లభించిన మానవ జన్మను సార్ధకం చేసుకుందాం.

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment