Wednesday, December 28, 2022

మౌనయాగం

 *మౌనయాగం*
                   ✍️ *చక్కిలం విజయలక్ష్మి*
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

*మౌనం ఒక యోగం. మౌనం ఒక యాగం. మౌనం మనసు భాష. మౌనం ఆత్మభాష.*

అన్ని భాషలూ మిళితమై ఉన్న అంతర్ విశ్వభాష. మానవుడిలోని సర్వ జీవశక్తుల్ని, అంతర్గత మనోశక్తుల్ని, ఆధ్యాత్మిక శక్తుల్ని వృథా కానీయకుండా తేజరిల్లజే సేది *మౌనం.* 

*మౌనం* మహా శక్తిమంతమైనది. మాటలతో మనంగా ముక్కలుగా విభజించేసుకునే శక్తి, పరిమితంగా వినియోగించుకునే శక్తి - మౌనం ద్వారా అపరిమితంగా, పరిపూర్ణంగా వినియోగించుకోగలం. లోకంలో సహజంగానే మౌనం పట్ల గౌరవం, విశ్వాసం ఉన్నా, దాని ఉపయోగం, వినియోగం ఆధ్యాత్మిక రంగంలో అత్యధికంగా ఉంటాయి. 

రమణమహర్షి *'మౌనస్వామి'*  గా ఖ్యాతిగాంచారు. పరమశివుడి మరో స్వరూపంగా ఆరాధించే దక్షిణామూర్తి బోధన, , మౌనంతోనే సాగుతుంది.

చాలామంది గురువులు శిష్యులకు బోధ చేసేందుకు మౌనాన్నే ప్రధానంగా ఎంచుకుంటారు. నిజానికి మనసును, మనసులోని భావాలను వెల్లడించేందుకు 'మాటలు చాలవు. మనోభావాలను అనువదించేందుకైనా, ఆవిష్కరించేందుకైనా తగిన భాషను ఎవరూ కనుక్కోలేదు. మౌనం మూసలో పోసేందుకు సరిపడా మాటల్ని ఎప్పటికీ కనుక్కోలేరు. ప్రాపంచికులు అనేక ప్రయోజనాల కోసం మౌనాన్ని ఆశ్ర యించినా పారమార్ధికుల ప్రధాన అనుసరణీయ సాధన - *మౌనమే.* 

ప్రతిక్షణం ఇంద్రియ వినియోగంతో వృథా అయిపో తున్న, దుర్వినియోగం అయిపోతున్న అంతర్గత శక్తివనరులు మౌనంతో ఇంకా వృద్ధి పొందుతాయి. బలోపేతం అవుతాయి. 

*మౌనం* నోటి దురుసును పరిమితం చేస్తుంది. *మౌనం* అసత్య భాషణను అరికడుతుంది. ఇటువంటి ఎన్నో లౌకిక ప్రయో జనాలున్నా అత్యంత ఉత్కృష్టమైన ప్రయోజనం ఆధ్యాత్మిక సాధనలో ఉంది. 

భక్తుల ప్రార్ధనలో, కోరికల నివేదనలో, మరెన్నో ప్రక్రియల్లో మాటల వినియోగం ఉన్నా భగవంతుడికి బాగా ప్రీతిపాత్రమై, అత్యంత వేగంగా ఆయనను చేరే భాష, *మౌనమే.* భావం మౌనంలోకి అనువాదం అయినంత స్పష్టంగా, వివరంగా, పూర్ణంగా మాటల్లోకి కాలేదు. *"సమయమే అవసరం లేని 'చేరవేత మార్గం' మాత్రం మౌనమే.*

మనం చేసే సాధనలను మెరుగు పెట్టి, వృద్ధి చేసి, అతిని తొలగించి, వృథాను కట్టడిచేసి సానపట్టిన వజ్రంలా మన సాధనా నైవేద్యాన్ని భగవంతుడి పాదాలచెంత సమర్పించే విస్తరి మౌనమే. ఆధ్యాత్మిక అవసరాలకు తప్ప మనం మాటలను శత్రువుల్లా భావించాలి. విషంలా నిరాకరించాలి. మనకు తెలిసిన మనం నేర్చిన భాషల జాబితాలోకి మౌనభాషను చేర్చుకోవాలి. మొదటి వరసలో పేర్చుకోవాలి. అవసరం లేకపోయినా అలవాటైన మాటలతో మనం వృథా చేసే సమయాన్ని మౌనం మనకు మిగుల్చుతుంది. ఎందుకంటే మన ఆధ్యాత్మిక సాధనలకు సమయం ఎంతో అవసరం. మాటల అవసరమే లేకపోతే (మనం నోటిని కట్టడి చేసుకోగలిగితే) ఆ సమయమంతా మనకు మిగిలినట్లే. ప్రతి క్షణాన్నీ మనం సాధనలోనే వినిమయం చేసుకోవచ్చు. 

భగవత్ సాధన అనే బృహత్ యజ్ఞానికి జీవితకాలమే సరిపోదు. మనం మాటలతో ఎంతో సమయాన్ని వృథా చేస్తున్నాం కదా! చిలిపి పనులకు, పనికిరాని మాటలకు అంత అవసరం ఉందా? లేదుగాక లేదు. మన సమయం మంత్రపూతం కావాలి. ధ్యాన పూర్ణం కావాలి. భగవన్మయం కావాలి. నిజానికి, హిమాలయాల్లో చాలామంది సాధకులు కేవలం మౌనాన్నే ఒక సాధనగా, సాధనలో నిమగ్నమై ఉంటారు.

*మౌనం* వల్ల మన శ్వాసలు తగ్గిపోతాయి. శ్వాసలు తగ్గితే మన ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుష్షు పెరిగితే మానవ జీవితంలో మాత్రమే సాధ్యపడే భగవత్ సాధనకు కావలసినంత సమయం దొరుకు తుంది. ఇక మనకు కావలసింది ఏముంది?

*లోకాస్సమస్తా సుఖినోభవంతు*

*Courtesy* : *ఈనాడు*

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏

🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*


✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️ 

No comments:

Post a Comment