Thursday, December 29, 2022

✍️...నేటి చిట్టికథ, అనగనగా ‘మృకండుడు’ అనే ఋషి ఉండేవారు.

 ✍️...నేటి చిట్టికథ

*అనగనగా ‘మృకండుడు’ అనే ఋషి ఉండేవారు. ‘మృకండుడు’ శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట. అలాంటి మృకండునికి ‘మరుద్వతి’ అనే సాధ్వి భార్యగా ఉండేది.*

*భగవన్నామ  స్మరణలో   హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆదంపతులకి ఒకటే లోటు. వారికి పిల్లలు లేరు!* 

*సంతానభాగ్యం కోసం వారిద్దరూ వారణాశి క్షేత్రానికి చేరుకుని శివుని పూజించడం మొదలుపెట్టారు. * 

*ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు.*

 *కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో… “మీకు తప్పకుండా పుత్రసంతానాన్ని ప్రసాదిస్తాను. కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి…. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా?   లేకపోతే      పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా?”  అని అడిగాడు.* 

*”వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమేం, మాకు గుణవంతుడైన అల్పయుష్కుడే కావాలి !”    అని కోరుకున్నారు మృకండుని దంపతులు.*

*అచిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖలాంటి ఓ బాలుడు కలిగాడు. మృకండుని కుమారుడు కాబట్టి అతనికి ‘మార్కండేయుడు’ అన్న పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకలగుణాభి రాముడు! బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టాడు మార్కండేయుడు. మరో పక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు.*

*ఇలా ఉండగా ఓసారి మృకండుని ఆశ్రమానికి సప్తఋషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్షు తీరనుందని వారికి అర్థమైంది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తఋషులు. మార్కండేయుని చూసిన బ్రహ్మ, అతడిని నిరంతరం శివారాధన చేస్తూండమని సూచించాడు.*

*అందరూ కలిసి, శివనామస్మరణ చేత అకాలమృత్యవు దరిచేరదని మార్కండేయునికి తెలియచేశారు.*

*పెద్దల మాటలమేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు.* 

*ఒకపక్క అతని మృత్యుఘడియలు సమీపిస్తున్నాయి. మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరికదా ఒకో నిమిషం గడిచేకొద్దీ మరింత జోరుగా సాగుతోంది.*

*యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయల్దేరారు యమభటులు.*

*కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా! అతని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు.*

*ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి, యమపాశాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు.*

*”ఆ ధ్యానాన్ని ఆపి ఇవతలికి రా!                       నీ మృత్యువు సమీపించింది!” అని హుంకరించాడు యముడు.*

*కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు ఇవతలికి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు.*

*ఇక యమునికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు. ‘తన మీదకీ, తన భక్తుని మీదకీ పాశాన్ని విడుస్తావా?’ అంటూ యముడిని ఒక్కపెట్టున సంహరించాడు.* 

*ఆ సందర్భంలోనే శివునికి ‘కాలాంతకుడు’ అనే బిరుదు వచ్చింది. అంటే కాలాన్ని/మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం.*

*’కానీ యుముడే లేకపోతే ఈ లోకంలో చావుపుట్టుకల జీవనచక్రం ముందుకు సాగేదెలా?’ అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు.*

*అయితే మార్కండేయుని జోలికి అతను ఇక రాకూడదనీ, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదనీ హెచ్చరించి వదిలివేశాడు పరమేశ్వరుడు.*

*ఈ ఘట్టం తమిళనాడులోని ‘తిరుక్కడయూర్‌’ అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం.*

*కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి. మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా, అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు.*

శివకేశవుల లీలలే    కాకుండా దేవీమాహాత్మ్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది.

🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹

No comments:

Post a Comment