Thursday, January 26, 2023

🧘‍♂️89 - శ్రీ రమణ మార్గము🧘‍♀️* *మహాత్ముల మహిమలు:-*

 *🧘‍♂️89 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*మహాత్ముల మహిమలు:-*

మన ‘మంచితనం’ అనేది, తరచూ స్వార్థంతో కూడుకొని ఉంటుంది. ఏదో ఒక ఫలితం ఆశించ కుండా మనం 'మంచి'గా ఉండలేము. మంచితనం మన సహజ స్వభావం కానంతవరకూ, అనగా అది మనలో నుండి 'స్పాంటేనియస్'గా పుట్టుకు రానంతవరకూ, దాని మూలం ఎప్పుడూ స్వార్థంతోనే ముడి వేసుకుని ఉంటుంది. అలాంటి మన సాధారణ 'మంచితనానికి', మనలో కొందరు  ధనాన్ని ఆశించవచ్చు; మరి కొందరు సంఘంలో కీర్తి ప్రతిష్ఠలను, లేదా ఇతరుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని, ఏదో ఒకటి ఆశించవచ్చును. ఆశించకుండా ఉండలేము.

మన మెరిగిన ఈ 'మంచితనం' కాక మరో మంచితనం ఉన్నది. అది ఆలోచనాత్మకమైనది కాదు. అది కరుణలో నుండి జనించేటువంటిది. కరుణ, ప్రేమ ఆకారణమైనవి. అవి ఎవరిపై ఎప్పుడు జనిస్తాయనేది ఎవరూ నిర్ధారించలేరు. కరుణాళువులైన మహానుభావుల్లో అరుణాచల రమణులు ఒకరు. ఆయన స్వయంగా పూనుకొని ఏ మహిమలూ ప్రదర్శించే వారు కాదు. 'పాపులారిటీ' కోసం పాకులాడాల్సిన అవసరం ఆయనకి ఏనాడూ కలుగలేదు.

కానీ ఆయన సమక్షంలో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతుండేవి. వాటి గురించి ఆయనతో ఎవరైనా ప్రస్తావించినా కూడా, ఆయన ఏమీ వ్యాఖ్యానించే వారు కాదు. 'ఏదో సంభవించిందనీ, అది అవతలి వారి బాధను నివారించిందనీ, ఆయనకు తెలుసు. కానీ అందుకాయన కర్తృత్వ బాధ్యత స్వీకరించడం గానీ, ఆ విషయాన్ని మరో సందర్భంలో అనడంగానీ జరిగేది కాదు: చూచి వూరుకునే వాడు.

శ్రీ రామస్వామి పిళ్ళె అనే శిష్యుడు రమణుణ్ణి గురించి ఇలా చెప్పుకొస్తాడు: “నేనిప్పుడు చెప్పబోయే సంఘటనలో రమణుడు నాటకీయంగా ఏదో సిద్ధిని ప్రదర్శించాడని అనుకోవద్దు. కానీ ఈ విషయాన్ని గనక జాగ్రత్తగా పరిశీలిస్తే, రమణుడు ఎంత నెమ్మదిగా ఎంత సహజ సిద్ధంగా కొన్ని కార్యాలు నిర్వహించాడో తెలుస్తుంది.

తిరువణ్ణామలై సమీపంలోని ఒక ఊర్లో మనిషి ఏదో తీవ్రమైన జ్వరం వల్లనో, ‘అమ్మవారు’ పోయడం వల్లనో రెండు నేత్రాల దృష్టిని కోల్పోయాడు. రమణాశ్రమం వెళ్ళి రమణుణ్ని సందర్శిస్తే మళ్ళీ దృష్టి కలుగుతుందని ఎవరో తమ విశ్వాసం కొద్దీ అతడితో చెప్పగా, మరొక మనిషి తోడు తీసుకొని ఆశ్రమానికి వచ్చాడు. శ్రీ రమణులు ఎక్కడ కూచోనుంటారు అని అక్కడున్న వారిని విచారిస్తున్నాడు.

అంతకు మునుపు కొద్ది రోజుల క్రితమే రమణుని దర్శనానికై ఇద్దరు యువ డాక్టర్లు ఆశ్రమానికి వచ్చారు. ఆ ఇద్దరికీ రమణునిపై ఎంతో గౌరవ భావం ఏర్పడింది. 

దర్శనం, ఆశ్రమ నివాసమూ పూర్తి చేసుకొని మద్రాసుకు తిరిగి వెళ్ళడానికి తమ కారుతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నారు. రమణుని వద్ద సెలవు తీసుకొని బయట తమ కారు వద్దకు బయలుదేరుతూ, వెళ్ళేముందు ఒక్కసారి రమణ రూపాన్ని తనివితీరా చూచిపోదామని మళ్ళీ హాలు వద్దకు వచ్చారు. ఈలోగా హాలులోనికి ప్రవేశించిన ఆ దృష్టిహీనుడు, ఏదో విధంగా తనకు దృష్టిని ప్రసాదించమంటూ రమణుణ్ణి వేడు కుంటున్నాడు. రమణుడు వింటున్నాడు కానీ ఏమీ మాట్లాడడం లేదు. ఇదంతా చూచిన ఆ ఇద్దరు డాక్టర్లు, ఆ వ్యక్తిని తమతో మద్రాసుకు తీసుకువెళ్ళి కంటి ఆపరేషను చేయిస్తామని అన్నారు. చివరకు ఆ వ్యక్తి ఆ డాక్టర్లతో కలిసి కారులో మద్రాసుకు వెళ్ళడం జరిగింది.

కొన్ని నెలల తర్వాత నేను శ్రీ రమణుల వారి చెంత కూచోనున్నప్పుడు, ఒక వ్యక్తి వచ్చి రమణుల ముందు ఒకటే సాష్టాంగ పడుతూండడం చూశాను. ఒక కంటికి చూపు కలిగిందనీ, ఇదంతా రమణుని కరుణేననీ అతడు పదే పదే చెప్పుకుంటూ ఉండడం చూశాను. ఆ డాక్టర్లు అప్పుడు అతణ్ణి మద్రాసుకు తీసుకువెళ్లి, ఆపరేషన్ వగైరా చేయించి, రెండు కళ్ళకూ దృష్టివచ్చేట్లు చేద్దామని గట్టి ప్రయత్నం చేసి, అది సాధ్యం కాకపోగా ఒక్క కంటికి మాత్రం దృష్టి వచ్చేట్లు చేయగలిగారట. శ్రీ రమణులు చెప్పినదంతా వింటూ మారుపలక్కుండా వుండిపోయారు. ఈ విషయంలో తనకేమీ సంబంధం లేనట్లు కూచున్నారు.

రమణుని సమక్షంలో అడపాదడపా ఇలాంటి మహిమాన్వితమైన సంఘటనలు జరుగుతుండేవి. కానీ రమణుడు ప్రతిపాదించిన నిశితతత్వ విచారణ ముందు ఈ వచ్చిపోయే అనుభవాల ప్రాధాన్యమేపాటిది?” అని ముగిస్తాడు శ్రీ రామస్వామి పిళ్ళె.

బొంబాయి నగరంలో జీవించి తరించిన నిసర్గ దత్త మహరాజ్ సమక్షంలో కూడా మనుషులకు 'మంచి' జరుగుతుండేది. ఆయన చెంత వచ్చి కూర్చున్న వారు అక్కడ జరిగే సంభాషణలు విన్నందువల్ల చిత్తశాంతిని పొందేవారు; జ్ఞానం సముపార్జించు కునేవారు. వారి వారి ప్రాప్తాన్ననుసరించి లౌకికంగా కూడా కొంత మేలు జరుగు తుండేది.

అందుకే ఆయన ఒక వ్యక్తి ప్రశ్నకు సమాధానమిస్తూ “నీవు నీ లక్ష్యాన్ని అందుకున్నందువల్ల నీకు స్వస్వరూప జ్ఞానం ఉదయించగానే, భూమిపై నీ ఉనికే మనుష్యుల కొక మహాదీవెనగా పరిణమిస్తుంది. 

ఆ విషయం నీవు ఎరుగకపోవచ్చు; ఒక్కోమారు 
లోకానికి కూడా తెలియకపోవచ్చును. అయినప్పటికీ నీ నుండి సహాయం నాలుగు వైపులా విస్తరిల్లనారంభిస్తుంది. లోకంలోని రాజకీయవేత్తలు, ధర్మదాతలు అందరూ కలిసి చేయగలిగిన మేలుకన్నా, ఎక్కువ లోకోపకారం చేసే సాధు పురుషు లున్నారు. 

ఏ విజ్ఞానమూ లేని వారైనప్పటికీ, ఉద్దేశ రహితంగా ఇలాంటి సజ్జనులు, దశదిశలా వెలుతురును ప్రసరింపచేస్తుంటారు. ఇటువంటి పుణ్య పురుషులు చేసిన ‘మహిమలను' గురించి ఎవరైనా వారికి వెళ్ళి చెప్పినప్పుడు, అందరితోబాటు వారు కూడా ఆశ్చర్యపడుతుంటారు. కానీ ఇవేవీ తమ స్వంతమనుకోరు. కాబట్టి, వారికి గర్వమూ ఉదయించదు. పేరు ప్రతిష్ఠలకై పాకులాడే ప్రసక్తి లేదు. వారు తమ కోసం తాము కోరేదంటూ ఏదీ వుండదు; ఆఖరికి మరొకరికి సహాయ పడుతున్నామనే ఆనందం కూడా వారికి అక్కర లేదు.

 అన్నిటికీ ఆ భగవంతుడి దయే కారణమని పూర్తిగా ఎరిగి ఉన్నవారు కాబట్టి, వారి హృదయమెప్పుడూ శాంతంగానే ఉంటుంది" అంటారు శ్రీ నిసర్గదత్త మహరాజ్.

No comments:

Post a Comment