Tuesday, January 24, 2023

కర్మ సిద్ధాంతం చిన్న అవగాహన

 కర్మ సిద్ధాంతం చిన్న అవగాహన

"చీమ స్వార్థంబు కల్గిన జీవి కాదు
పెక్కు చీమలు గుమిగూడి మెక్కుచుండ
దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు
కలుగదేటికి చిత్ర మీ కలియుగమున!!"

సంఘసేవ చేస్తున్నామంటారు, అది మీ కర్తవ్యం, సంఘ క్షేమమే మీ క్షేమం, సృష్టిలో పశు పక్షి మృగాలు సహితం గుంపులుగుంపులుగా పరస్పర సంక్షేమాన్ని ఆశిస్తూ సహజీవనం సాగిస్తాయి. చివరకు చీమలు కూడా నిస్వార్ధంగా జీవిస్తూ సంఘ జీవిత ఆదర్శాన్ని నిరూపిస్తాయి...
అలాగే విచక్షణా జ్ఞానం ఉన్న మానవుడు కూడా సంఘ సేవ తన సహజ ధర్మంగా గుర్తించి వర్తించాలి, కానీ కలియుగ ప్రభావం వల్ల మానవునిలో ఈ జ్ఞానం ఉండటం లేదు...

" జ్ఞానేన శూన్యః పశుభిస్సమానః ".....
కేవలం మనుషుల యొక్క చేరికయే సంఘం అని భావిస్తారు,కానీ అలాంటి గుంపు సంఘం కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తింప చేయునది సంఘము. అనగా అందరూ పరస్పర సహాయ సహకారాలతో వారి వారి కర్తవ్య కర్మల నాచరిస్తూ ఆ ఫలితాన్ని ఏకాత్మ భావంతో అనుభవించుటయే సంఘ జీవన పరమావధి. స్థూలంగా చెప్పాలంటే నిద్రాణంగా ఉన్న ఏకాత్మ భావనని, దైవత్వాన్ని మేల్కొల్పడమే సంఘసేవ.

స్వార్థ సంకుచితత్వంములతో జీవించువాడు మానవుడు కాడు, దానవుడు, ఇక్కడ దానవుడు అంటే బొమ్మలలో చూపినట్టు భయంకర రూపంతో, పెద్ద పొట్ట, నోటిలో భయంకరమైన కోరలతో అత్యంత భీతి కలిగించేలా ఉంటాడని కాదు. మానవునికి దానవునికి వ్యత్యాసం గుణములో మాత్రమే గాని రూపంలో కాదు.
మానవ సేవ కొన్ని రోజులో సంవత్సరాలో కాదు, జీవితాంతం కొనసాగాలి, అది కర్మ మార్గం. ఇది మరింత సులభంగా అర్థం చేసుకోవటానికి చిన్న ఉదాహరణ చూద్దాం, మనము బస్సులో మట్టి రోడ్డు మీద ప్రయాణం చేయడంతో పోల్చవచ్చు...
దుమ్ము దూళితో ఉన్న రోడ్డు మీద బస్సు ప్రయాణిస్తూ, ఎక్కడైనా బస్సు ఆగితే రోడ్డు మీద ఉన్న మట్టి అంతా లేచి కెరటం లాగా బస్సు మీద పడుతుంది. ఇది కర్మ మార్గం,దుమ్మూ దూళీ భవబంధాలు. తర్వాత కర్మ మార్గం నుండి ఉపాసన మార్గంలోకి ప్రవేశించాలి, ఇది కంకర రోడ్డు వంటిది...
ఇక్కడ మట్టి తక్కువ,దుమ్మూ ధూళి కొంతవరకు మాత్రమే పడుతుంది,బంధాలు అశాశ్వతమైనవని ఎరుకలోకి వస్తుంది, దాని తర్వాత ఉపాసన మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి, అది తారు రోడ్డు వంటిది, దానిమీద మట్టి ఉండదు.ఇక్కడ బంధాలు ఉంటాయి కానీ మనల్ని బంధించి ఉంచలేవు అన్నమాట. ఈ విధంగా కర్మ మార్గం నుండి ఉపాసన మార్గం వైపు ప్రయాణమైపోతుంటే, కర్మయే జ్ఞానంగా మారిపోతుంది.

కర్మ పుష్పం, ఉపాసన కాయ, జ్ఞానం పండు...ఈ మూడు ఒకటే... ఇవి ఆధ్యాత్మిక సాధన క్రమం యొక్క పరిణామ దశలు, సమాజ సేవకు మించిన ఆధ్యాత్మిక సాధన లేదు. పూజలు, జపాలు, ధ్యానాలు, యాత్రల కంటే కూడా మానవ సేవ ఉత్తమమైన ఆధ్యాత్మిక సాధన...

18 పురాణాల సారాంశం -
"పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం"
అంటే పరులకు ఉపకారం చేయడం పుణ్యం...
పరులకి అపకారం చెయ్యడం పాపం...
పరులు పరులు కాదు, పరమేశ్వర స్వరూపాలే.

No comments:

Post a Comment