Thursday, November 23, 2023

యాక్ తూ (జానపద వ్యంగ్య కథ)

 *యాక్ తూ  (జానపద వ్యంగ్య కథ)*
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒకూర్లో ఒక పెద్ద మూర్ఖుడు వుండేటోడు. వానికి మూఢనమ్మకాలు చానా ఎక్కువ. ఎప్పుడూ పిచ్చి పిచ్చి పూజలు, జపాలు చేస్తా వుండేటోడు. అయినదానికీ కానిదానికీ వూకూకెనే భయపడేటోడు. 

ఒకసారి ఆయన పెండ్లాం వంట చేస్తా చేస్తా ఆకలేస్తా వుంటే ఒక కొబ్బరిముక్క తీసుకోని తినసాగింది. అంతలో పక్కింటామె తోడు కోసమని వచ్చి ఆమెని పిలిచింది. ఆమె తింటా వున్న ఆ కొబ్బరిముక్కను ఆన్నే గూట్లో పెట్టి బైటికి పోయింది. అప్పుడే వాడు స్నానం చేసి బైటికి వచ్చినాడు. ముందు రోజంతా ఉపవాసం వుండటంతో బాగా ఆకలేయసాగింది. దాంతో తట్టుకోలేక ఏమన్నా దొరుకుతుందేమోనని వంటగదిలోనికి పోయినాడు. ఆడ గూట్లో కొబ్బరిముక్క కనబడింది. అది పెండ్లాం కొరికినేదని వానికి తెలీదు... దాంతో ఆ ముక్కను నోట్లో వేసుకోని నమలసాగినాడు.

కాసేపటికి వాని పెండ్లాం ఆడికి వచ్చింది. కొబ్బరిముక్క కోసం గూట్లో వెదకసాగింది. అది చూసి వాడు ''ఏందే... వెదుకుతా వున్నావు. ఏం కావాల'' అనడిగినాడు. దానికామె ''ఇందాక తింటా తింటా కొబ్బరిముక్క ఒకటి ఈడపెట్టి పోయినా. దాని కోసం వెదుకుతా వున్నా'' అనింది. ఆ మాటింటానే వాడు అదిరిపోయినాడు.

''ఏందీ... ఆ కొబ్బరిముక్క నువ్వు ఎంగిలి చేసినేదా... ఎంత అపచారం. నీ ఎంగిలి తిన్నాను'' అంటూ నోట్లో నీళ్ళు పోసుకోని మళ్ళా... మళ్ళా... కడుక్కోసాగినాడు. అది చూసి ఆమె ''ఏందండీ మీరు మరీనూ... మొగుడూ పెండ్లాల నడుమ ఎంగిలేంది'' అనింది. దానికి వాడు కోపంగా ఆమెని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ''నీకేం తెలుసే శాస్త్రాలు. ఆచారమంటే ఆచారమే. ఇంతవరకూ నేను చేసిన పుణ్యమంతా సర్వనాశనం చేసి పెట్టినావు గదా'' అని నెత్తీ నోరు కొట్టుకుంటా ఆ వూర్లోని పెద్ద పండితుని దగ్గరికి పోయినాడు. ఆయనకి జరిగిందంతా చెప్పినాడు.

ఆ పండితుడు వాని దగ్గర ఐదొందలు తీసుకోని, పెద్దపెద్ద పుస్తకాలన్నీ తిరగేసి, అరగంటసేపు గాల్లో చూస్తా ఏవేవో లెక్కలేసి ''చూడు నాయనా... నువ్వు ఎవరయినా ఒక మహా పతివ్రత చేతి వంట తింటే చాలు. నీ పాపం పోతుంది'' అని చెప్పినాడు. దానికా మూర్ఖుడు ''అట్లాంటి పతివ్రత యాడుందో కాస్త చెప్పండి సామీ'' అన్నాడు. పండితుడు కాసేపు ఆలోచించి ''పక్కూర్లో శేషమ్మ అని ఒక గొప్ప పతివ్రత వుంది. ఆడికి పో'' అని చెప్పినాడు. వాడు తర్వాత రోజు పొద్దున్నే తలస్నానం చేసి పక్కూరికి బైలుదేరినాడు. శేషమ్మ ఇంటికి చేరుకోని తాను వచ్చిన పని చెప్పినాడు. దానికామె ''సర్లే నాయనా... దానికేముందిలే... కాసేపు కూచో... వంట చేసి పిలుస్తా'' అంటూ అతన్ని కూచోబెట్టి వంట పనిలో పడింది.

వంట పూర్తి కాగానే కోడలిని పిలిచి ఆ మూర్ఖునికి వడ్డించమనింది. ఆమె ఆయనకు అన్నం, పప్పు అన్నీ వడ్డించి ఆఖరున ఇంట్లో వున్న పాయసమంతా ఆయనకే వడ్డించింది. అది చూసి అత్త కోడలిని లోపలికి పిలిచి ''ఏమే... పాయసమంతా ఆయనకే వడ్డించినావు. కొంచం గూడా మనకి వుంచకుండా'' అనింది. దానికామె గొంతు తగ్గించి ''ఏమీ లేదత్తా... ఇందాక మనం పని చేసుకుంటా వున్నప్పుడు పక్కింటి గజ్జికుక్క వచ్చి సగం పాయసం లొడలొడలొడ తాగేసింది. అందుకే దాన్ని పారబోయడం ఎందుకని అంతా ఆయనకే పోసేసినా'' అనింది. అప్పుడే చేయి కడుక్కోడానికని అటువైపు వచ్చిన ఆ మూర్ఖునికి ఆ మాటలన్నీ వినబన్నాయి. ''థూ... థూ... ఇంతసేపూ నేను తిన్నది కుక్క ఎంగిలా'' అనుకుంటా ఆ అత్తాకోడళ్ళని తిట్టిన తిట్టు తిట్టకుండా బాగా తిట్టి వురుక్కుంటా ఇంటి బైటికొచ్చి తిన్నదంతా యాక్కు యాక్కుమని చెయ్యి నోట్లో పెట్టుకుని కక్కుకున్నాడు. నెమ్మదిగా తిరిగి ఇంటికి బైలుదేరినాడు. కొంచం దూరం నడిచేసరికి బాగా అలసిపోయినాడు. ఒక ఇంటి ముందు కూలబన్నాడు.

కొంచం ఆకూవక్కా వేసుకుందామని బొడ్లోంచి సంచి తీసినాడు. అందులో ఆకులు, సున్నం వున్నాయి గానీ వక్క లేదు. దాంతో ఇంటామెని పిలిచి ''అమా... ఏమీ అనుకోకుండా ఒక వక్క వుంటే ఇవ్వమ్మా... నీకు పుణ్యమొస్తాది'' అన్నాడు. దానికామె ''దానికేముందిలే నాయనా... వక్కనే గదా... తెస్తానుండు'' అంటూ లోపలికి పోయి ఒక వక్క తెచ్చి ఇచ్చింది.

వాడు ఆ వక్కను నోట్లో వేసుకోని క్షణంలో పటపటపటమని ముక్కలు చేసి నమలసాగినాడు. అది చూసి ఆ ఇంటామె ''అబ్బ... నీవి అల్లాటప్పా మామూలు పండ్లు కాదు నాయనా... ఇనుపగుండ్లు'' అంటూ ముక్కున వేలేసుకోనింది. ఆ మాటలకా మూర్ఖుడు ''ఏమయిందమ్మా... ఎందుకట్లా మెచ్చుకుంటా వున్నావు'' అనడిగినాడు. దానికామె ''ఏమీ లేదు నాయనా... ఆ వక్కను నేను కొరికినా... నా మొగుడు కొరికినాడు.. నా కొడుకు కొరికినాడు... నా కోడలు కొరికింది... ఆఖరికి ఇంటికొచ్చిన బంధువులంతా కొరికినారు. ఐనా అది ఒక్క రవ్వ గూడా పగలలేదు. అట్లాంటిది అంత గట్టి వక్కను నువ్వు క్షణంలో పటపటలాడించినావు. అందుకే అట్లా మెచ్చుకున్నా'' అనింది. ఆ మాటలింటానే ఆ మూర్ఖుడు అదిరిపోయినాడు.

''ఏందీ... ఇప్పుడు నేను నములుతా వున్న వక్క ఇంతమంది ఎంగిలి చేసినేదా'' అంటూ ఆమెని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ''థూ...'' అంటూ నోట్లోదంతా వుమ్మేసినాడు. నోరు కడుక్కుందామని చుట్టూ చూస్తే ఒక ఇంటి ముందు కుండలో నీళ్ళు కనబన్నాయి. వాడు వురుక్కుంటా పోయి ఆ నీళ్ళు నోట్లో పోసుకోని నోరంతా పుక్కిలించసాగినాడు.

అంతలో ఆ ఇంటామె అది చూసి బెరబెరా బైటికొచ్చి ''ఏంది నాయనా... నీళ్ళు కావాలంటే అడిగి తీసుకోవచ్చు గదా... అట్లా పందులు మూతి పెట్టిన నీళ్ళతో కడుక్కునే బదులు'' అనింది. ఆ మాటింటానే వాడు అదిరిపడి ''ఏందీ ఇవి పంది ముట్టిన నీళ్ళా'' అంటూ మరోసారి లోపలున్నదంతా భలుక్కు భలుక్కుమని కక్కుకున్నాడు.

''పెండ్లాం ఎంగిలే కదా అని మట్టసంగా ఇంట్లో పడి వుండక దోషం... దోషం... అనుకుంటా వచ్చినందుకు తగిన శాస్తే జరిగింది'' అనుకుంటా గమ్మున ఇంటిదారి పట్టినాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

No comments:

Post a Comment