Sunday, April 28, 2024

గోదావరి పుష్కరలు* 🌊 రచన : వి. పద్మప్రియ

 *గోదావరి పుష్కరలు* 
🌊

రచన : వి. పద్మప్రియ 


మాధవపురం గ్రామంలో రాజయ్య అనే పేద 
రైతు రెండెకరాల పొలం సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అతడి కొడుకు భీమన్న తెలివయినవాడు, కష్టపడి పని చేసే సుగుణం కలవాడూను. అయినా ఏం లాభం? తండ్రీ అతని కొడుకులు ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకు శ్రమపడ్డా, పంట సరిగ్గా పండేది కాదు. ఎందుకంటే అది బీడు పొలం. దాన్ని సరిగ్గా సాగులోకి తెచ్చి ఎక్కువ పంట పండేలా చేయాలంటే దాని మీద కనీసం పదివేలు అయినా పెట్టుబడి పెట్టాలి. అంత ధనం రాజయ్య వద్ద లేదు. అప్పు ఇచ్చే నాథుడు కూడా ఎవరూ లేరు. అందువల్ల చేసేదేం లేక అ రాజయ్య, భీమన్న ఆ బీడుపొలాన్నే సేద్యం చేసూ తినీ తినకా కాలక్షేపం చేస్తున్నారు.

ఇలా వుండగా ఒక రోజు రాజయ్య ఇంటి పెరట్లో పాదుల కోసమని గొయ్యి తప్వుతుండ గా గునపానికి ఏదో తగిలింది. రాజయ్య అత్రుతగా మట్టి పైకి తీసి, అదేమిటా అని చూశాడు. బాగా కిలుం పట్టిన ఇత్తడి బిందె ఒకటి కనిపించింది. దాని మీద ఉన్న మూతని తొలిగించాడు. బిందెనిండా బంగారు కాసులు. రాజయ్య కళ్ళు జిగేలుమన్నాయి. అతడి ఆనందానికి హద్దులేకుండా పోయింది. అయితే ఆ బిందెలో వున్న ఒక రాగి రేకు మీద ఇలా రాసి వుంది.

'ఈ నిథి దొరికినవారు దీన్ని వచ్చే 'గోదావరి పుష్కరాలు అయ్యాక వాడుకోవాలి. అంతకు ముందే తొందరపడి దీన్ని బయటకు తీసి వాడుకున్నా, లేక ఈ విషయం ఎవరికయినా చెప్పినా వారు, వారి కుటుంబం సర్వనాశనం ఆవుతారు.'

ఇది చదివిన రాజయ్య హతాశుడైపోయాడు.
గోదావరి పుష్కరాలు రావడానికి ఇంకా పదేళ్ళుంది. చేసేదేంలేక రాజయ్య ఆ బిందెని యథాస్థానంలో పెట్టి, మట్టి కప్పేసి ఇంట్లోకి వచ్చాడు.

భీమన్నకి ఆ నిధి విషయం చెప్పేయ్యాలని రాజయ్య ప్రాణం కొట్టుకులాడింది. కానీ శాసనం గుర్తుకొచ్చి తమాయించుకున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. పుష్కరాలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూసిన రాజయ్య పాపం ! అవి రాక మునుపే మరణిం
చాడు.

ఆ తర్వాత పుష్కరాలు రానూ వచ్చాయి, వెళ్ళనూ వెళ్ళాయి. ఆ తర్వాత రెండేళ్ళకి భీమన్న ఒక రోజున పెరట్లో తండ్రి తవ్విన చోటునే యథాలాపంగా తవ్వుతూ వుండగా నిధి దొరికింది.

అందులోని బంగారుకాసులు చూసి భీమన్న సంతోషంతో ఉప్పొంగిపోయి..

"ఏమేవ్ ఇలా రా” అంటూ భార్యని కేక వేసి పిలిచాడు. ఆమె లోపల్నింది వచ్చి జరిగినది చూసి తను కూడా ఆనందంతో మురిసిపోయింది.

ఇంతలో బిందెలో కాసులతో పాటు వున్న రాగి రేకు ఆమె కళ్ళబడింది. అది తీసి చదివిన ఆమె భయభ్రాంతురాలయి, “ఇది చూడండి” అని భర్తకు ఇచ్చింది. భీమన్న అది చదవగానే

భార్య "ఏమండీ అయితే మనకి ఇంకో పది సంవత్సరాల దాకా ఈ నిథి వాడుకునే అదృష్టం లేదంటారా?” అన్నది బాధగా.

అందుకు భీమన్న నవ్వి. "పిచ్చిదానా! ఇందులో ఉన్న చిన్న కిటుకు నీకు అర్థం కాలేదు.. పుష్కరాలు రావడానికి పదేళ్ళు గడువు ఉంది అని అనుకుంటున్నావేగానీ, పుష్కరాలు ఆయిపోయి రెండేళ్ళు అవు తోందన్న నిజాన్ని గ్రహించవేం? దీంట్లో వున్నదేమిటి ? 'పుష్కరాలు అయిపోయాక తీసుకోవాలి' అని కదా. ఆ శాసనం ప్రకారం పుష్కరాలు అయ్యాకనే తీసుకుంటున్నాం మనం. రెండేళ్ళ క్రితమే అయిపోయాయి కదా పుష్కరాలు? పుష్కరాలనేవి ప్రతి పన్నెండే ళ్ళకీ వస్తాయి. అంటే ఈ నిధి ఎప్పుడు దొరికినా అప్పటికి పుష్కరాలు అయిపోయే ఉంటాయి. కాబట్టి ఈ నిథి దొరికిన వెంటనే తీసుకుంటే ఎలాంటి ప్రమాదమూ వుండదు. తెలివితేటలున్న వారికి నిథి దొరికితే అది సద్వినియోగమవుతుందన్న ఉద్దేశంతో మా పూర్వీకులు ఎవరో ఇటువంటి తమాషా శాసనం రాసి ఉంటారు " అన్నాడు.

భర్త తెలివికి భీమన్న భార్య గర్వపడింది.
భీమన్న ఆ నిథితో తన బీడు పొలాన్ని సస్యశ్యామలం చేసుకోవడమే గాక, ఇంకో పదెకరాల పొలం కూడా కొనుక్కుని సంతోషంగా జీవించాడు.
🌊🌊

꧁☆•┉┅━•••❀❀•••━┅┉

No comments:

Post a Comment