Tuesday, April 16, 2024

చదువును నిర్లక్ష్యం చేసే కుర్రాళ్ళు చాలా మంది ఉంటారు కదా

 


(copied post)
అమ్మ నాన్నలు బండి కొనలేదనో, పాకెట్ మనీ ఇవ్వడం లేదనో, అడిగినవన్నీ సమకూర్చడం లేదనో చదువును నిర్లక్ష్యం చేసే కుర్రాళ్ళు చాలా మంది ఉంటారు కదా

మీకు ఓ అరుదైన మొక్కను పరిచయం చేస్తున్నాం ఇప్పుడు. ఈ అబ్బాయికి బండి కొనివ్వడానికి అమ్మానాన్నలు లేరు. చిన్నప్పుడే చనిపోయారు. పాకెట్ మనీ ఇవ్వడానికి బంధువులు లేరు. అడిగినవన్నీ సమకూర్చడానికి నాఅన్న వాళ్లు ఎవరూ లేరు. కానీ ఈ అరుదైన మొక్క మొలకెత్తింది, వికసించింది. ఇప్పుడు ఫలాలు అందిస్తుంది. యువతకు ఇన్స్పిరేషన్ గా విరాట్ కోహ్లీనో, సింధు నో చూపించాల్సిన అవసరం లేదు దాబాలో పనిచేస్తూ ఇంటర్ లో 918 మార్కులు సాధించిన పల్లే జాన్ ను చూపించినా సరిపోతుంది.

జాన్ ఒక అనాథ..ఇలా చెప్పడం కూడా కొంచెం కష్టంగా ఉంది కానీ చెప్పడం తప్పడం లేదు. అమ్మానాన్నలను చిన్నప్పుడే పోగొట్టుకున్న ఈ అబ్బాయికి తల్లితండ్రి అయ్యింది తుని నాసా సంస్థ.

పదో తరగతి వరకు ఆశ్రయం కల్పించడమే కాకుండా చదివించింది. పదో తరగతి పూర్తయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఇక చదువు ఆపేయాలి అనుకున్నాడు. తుని జ్యోతి నగర్ లో ఉన్న పెద్దమ్మ ఒక్కరే జాన్ కు దిక్కు. 

ఎవరినీ పోషించాల్సిన అవసరం లేకున్నా తను బతకాలి కదా, అందుకే పొట్ట కూటి కోసం తుని డీమార్ట్ దగ్గర ఉన్న  హవేలీ దాబా లో పనికి చేరాడు. ఒకరోజు ఈ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ చూసిన దాబా యాజమానులు ఇంత చక్కగా రాస్తున్నావు కదా ఎందుకు చదువు ఆపేసావు అని ప్రశ్నించారు. అప్పుడు జాన్ తన కష్టాలనే కాదు తన లక్ష్యాలను కూడా వివరించాడు. జాన్ చెప్పిన విషయాలతో మనసు కరిగిపోయింది యజమానులకు. 

కాకపోతే జాన్ ను ఇంటర్ లో జాయిన్ చేయడానికి అప్పటికే రెండు నెలలు లేట్ అయిపోయింది. తెలుసున్న ఓ మాస్టారు ద్వారా ఎలోగాలా తుని రాజా జూనియర్ కళాశాలలో చేర్పించారు. ఉదయం అంతా తరగతులకు హాజరవడం, సాయంత్రం దాబాలో పనిచేయడం. రాత్రికి ఓ చిన్న షెడ్డులో పడుకోవడం ఇదే జాన్ దినచర్య. 

"శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది" అంటారు కదా, అది నిజమని జాన్ విషయంలో నిరూపితమైంది. శుక్రవారం వచ్చిన ఇంటర్ ఫలితాల్లో 918 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్య పరిచాడు జాన్. 

దాబాలో ప్లేట్లు అందిస్తూ పనులు చేస్తున్న ఓ యువకుడు సాధించిన గొప్ప విజయం ఇది..మనం ఎక్కడ మొదలు పెట్టాము అని కాదు ఎక్కడికి చేరుకున్నాం అనేది ముఖ్యం. సివిల్ ఇంజనీరింగ్ చేయాలనేది జాన్ కల. దాబాలో పనిచేసిన కుర్రాడు భవిష్యత్తులో పెద్దపెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ కు ప్లాన్స్ ఇచ్చే స్థితికి చేరుకోవాలి.

జాన్ చేరుకుంటాడు ఎందుకంటే 
జాన్ కు అమ్మానాన్నలు తోడున్నారు
ఆ అమ్మానాన్నలు ఎవరో తెలుసా
కృషి, పట్టుదల..
Congratulations John
TUNI

No comments:

Post a Comment