Sunday, June 30, 2024

 *శ్రీరమణీయభాగవత కథలు- 12*
( బాపు-రమణ )
జరిగిన కథ:

శుక మహర్షి, పరీక్షిత్తునకు జీవన రహస్యములు తెలుపుతున్నాడు

ఇక చదవండి:
*****

శుక:
ధర్మానికి హాని కలిగినప్పుడెల్లా ఆ జగన్నాధుడు కాపాడతాడు. ఇందులో చిన్న పెద్దా అన్న తేడా వుండదు. 

చీమనించి బ్రహ్మాండం వరకూ ఎక్కడ కష్టం వచ్చినా ఆయన అవతరిస్తాడు. 

ఒకసారి కల్పాంతాన బ్రహ్మ నిదురిస్తూండగా సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను ఆపహరించాడు.

పరీ:
ఎందుకోసం?

శుక:
సృష్టిలో జీవకోటిని నడిపే ధర్మసూత్రాలు వేదాలు. వాటిని నాశనం చేసి అరాచకం తేవాలన్నదే రాక్షసుల కోరిక... అప్పుడు విష్ణువు మత్స్యరూపం దాల్చి రాక్షసుని చంపి వేదాలు తిరిగి బ్రహ్మకి అప్పచెప్పాడు. ఇదే మత్స్యావతారం

పరీ:
శుకదేవా! ప్రపంచంలో ప్రాణులందరినీ పుట్టించిన వాడు ఆ పరమాత్ముడే కదా? అందరూ మంచి వాళ్లుగా పుట్టకుండా కొందరు రాక్షసులుగా ఎందుకు పుట్టారు? ఈ దేవదానవుల యుద్ధా లెందుకు? దేవుడు చేపగా తాబేలుగా రాముడుగా ఇలా ఇన్ని అవతారాలెత్తి చెడ్డ వాళ్లని చంపడం ఏమిటి? అయినా ఆ రాక్షసులు కూడా ఆయన బిడ్డలే కదా?

శుక:
దేవుడు రాక్షసులను కావాలని సృష్టించలేదు. మనుషులను మాత్రమే సృష్టించాడు. 

జంతువులకివ్వని బుద్ధి జ్ఞానం ప్రసాదించాడు. అందరూ సుఖంగా వుండాలని చేసేవి మంచి పనులనీ, తామొక్కరూ బావుంటే చాలని చేసేవి చెడ్డ పనులనీ వేదాలద్వారా చక్కగా తేట తెల్లంగా చెప్పించాడు. 'మంచి' మేలు చేస్తుందనీ 'చెడు' కీడు చేస్తుందనీ హెచ్చరించాడు.
   
పరీ : అయినపుడు ఆ కొందరూ చెడు మార్గంలో ఎందుకు వెళ్లారు?

శుక: 

నువ్వు మంచి వాడివే కదా? ధర్మమార్గంలో అరవై ఏళ్లు చల్లగా దేశాన్ని పాలించిన రాజువి. అయినా మొన్న ఒక ముని నీకు బదులు పలుక లేదని కోపం వచ్చి ఆయన మీద చచ్చిన పాముని విసిరేశావు. ఆ చెడు చేయమని దేవుడు చెప్పాడా? నీకే తోచిందా?

పరీక్షిత్తు తల వంచుకున్నాడు.

శుక : రాజా! చీకటిని పోగొట్టడానికి ప్రమిద వెలిగిస్తే దాని కిందనే చిన్న చీకటి దాగి వుంటుంది. ఆ విధంగా నీ ఒక్కడిలోనే ఇద్దరున్నారు.

పరీ: (తన రొమ్ము మీద చేయి వేసుకుని నవ్వి) దేవదానవులు

శుక:
(మందహాసం చేసి) అందువలన ఆ రెండోవాడు దానవుడి గురించి నువ్వే జాగ్రత్త పడాలి. 

పరీ : ఇపుడు కొత్త సందేహం కలిగింది. దేవుడు మానవులనే సృష్టించమని కశ్యప ప్రజాపతికి చెప్పాడు కదా -మరి ఆయన భార్యలు అదితికి ఆదిత్యులూ దీతికి దైత్యులూ ఎలా జన్మించారు? క్షేత్రాలు వేరైనా బీజం ఒకటేకదా. తండ్రి ఒకడే కదా?

శుక:
అదికూడా దైవేచ్ఛకాదు. మానవ దౌర్బల్యం, ప్రకృతి ధర్మం.

రాజా, ఒక వానచినుకు సముద్రంలో పడితే ఆ నీటిలో కలిపి నామరూపాలు లేకుండా పోతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే అది చక్కని ముత్యమై వెలుగుతుంది. 

కశ్యపుడి భార్యలు ఇద్దరిలో ఇదే జరిగింది. మంచి బుద్ధి వల్ల మంచి దారిలో సంతానం కోరిన అదితికి లోకపాలకులైన దేవతలు జన్మించారు.

తనకింకా సంతానం లేదనీ - అక్క పిల్లలు బావున్నారనీ అసూయపడి, చీకటి దారిలో కూడని పని చేసిన దితికి పుట్టకూడని పిల్లలే పుట్టారు.

పరీ:
అంటే పుట్టుకతోనే చెడ్డవాళ్లుగా పుట్టారా?

శుక: అవును. వెలుగును చీకటి చంపేసే సంజవేళ చీకటికి పిల్లలుగానే పుట్టారు. అదొక చిత్రమైన కథ. 

భయం వేసే కథ, కనబోయే బిడ్డలకే హాని చేసిన కన్నతల్లి కథ. ఆవిడ పేరే దితి.

దక్షప్రజాపతి పదముగ్గురు కుమార్తెలను కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. వాళ్ల ద్వారానే లోకంలోని మానవులూ జంతువులూ పక్షులూ పాములూ వృక్షాలూ సకలజీవకోటీ జన్మించాయి. 

కొంతకాలం వరకు దితికి పిల్లలు పుట్టలేదు. అసూయ పిశాచిలా చెలరేగింది. ఒక నాడు సాయంకాలం....

*అడవి - నదీతీరం*

సూర్యుడు అస్తమిస్తున్నాడు. నీటిలో నిలచిన కశ్యపుడు అర్ఘ్యం సమర్పించి గట్టుమీదకు వచ్చి ఆశ్రమం వైపు నడుస్తువాడు.

ఎదురుగా ఒక చెట్టు చాటు నుంచి మనిషి కనబడకుండా ఒక తల వంగి తొంగి చూసింది. నల్లని వత్తయిన పెద్ద జుట్టు - మధ్య చిక్కగా కాటుక దిద్దిన పెద్ద పెద్ద కళ్లు, వాటి మధ్య ఎర్రని దీప కళికలా బొట్టు.

కశ్యపుడు స్తోత్రం చదువుకుంటూ నడుస్తున్నాడు.

ఆ చెట్టు దాటుతుండగా ఒక సుకుమారమయిన గాజుల చేయి ముందుకువచ్చి అతడి పంచెపై కట్టుకున్న ధట్టి కొస పట్టుకుంది. 

అతడు ఉలికి పడి ఆగాడు. వెనక్కి చూశాడు.
చెంగు పట్టి లాగుతూ వయ్యారంగా నిలచిన సుందరి. ఆమెకళ్ళలో కామం. ఆమె నవ్వులో కోరికల ఉమ్మెత్త పువ్వులు.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)


No comments:

Post a Comment