Tuesday, August 27, 2024

**** "వేదవిజ్ఞాన వీచికలు" - 3వ భాగము.

 "వేదవిజ్ఞాన వీచికలు" - 3వ భాగము.
- శాస్త్రి ఆత్రేయ
సనాతనధర్మం ప్రకారం కర్మ సృష్టిధర్మం. ప్రకృతిగుణాల వలన కర్మలు నిర్వహించబడతాయి. కర్మలకు దోషం వున్నప్పటికీ జీవులు కర్మబద్దులు. కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు. కర్మ చేయకపోతే జీవయాత్ర జరగదు. జీవులు కర్మచేయకుండా ఒక్క క్షణమైనా వుండలేరు. 
అయితే కర్మలవలన ఫలం తప్పదు కాబట్టి సత్కర్మలు చెయ్యాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మఫలాన్ని దైవానికి అర్పించడం ద్వారా జీవుడు క్రమేణా జన్మరాహిత్యాన్ని పొందగలడని తీర్మానం చేసింది సనాతనధర్మం. 
అజ్ఞానులు కర్మలో ములిగీ ఎలా పని చేస్తారో, జ్ఞానులు కూడా లోకశ్రేయస్సు కోరుతూ అలాగే కర్మలు చెయ్యాలి. 
కర్మలలో మునిగిపోయిన వారిని ఆక్షేపించకుండా, వారు సత్కర్మలు ఆచరించేలా జ్ఞానులు ప్రోత్సహించాలి. అహంకారం వలన తానే అన్నింటికీ కర్తనని అనుకుంటాడు అజ్ఞాని. కానీ గుణకర్మల యొక్క తత్వం తెలిసిన జ్ఞాని ఆ చట్రంలో చిక్కుకోడు. 
కర్మఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ధూపదీపనైవేద్యాలతో ఆరాధిస్తారు. ఆరాధనలో తమ కోరికలను నెరవేర్చమని వేడుకుంటారు. కొన్ని కోరికలు తీరిన తరువాత ఆరాధనలో కొంత ఆడంబరం పెంచుతాడు. పదిమందికి తన ఆడంబరత చూపెట్టే ప్రయత్నం చేస్తాడు. దేవుడు నావాడే అని భావిస్తాడు. కొన్ని జరగకపోతే దేవుణ్ణి నిందించడం ప్రారంభిస్తాడు. మెల్లిగా అహం చోటుచేసుకుంటుంది. మెల్లగా నమ్ముకున్న దైవాన్ని మారుస్తాడు. వేరే దైవాన్ని ఆశ్రయిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే!!
అంటే తాము చేస్తున్న కర్మలవలన మనుజుల గుణము బయటపడుతోంది! వ్యక్తిలో దాగివున్న సత్వ, రజో, తమో గుణములు కర్మలరూపంలో తేటతెల్లమవుతున్నాయి. ఎంత కపటమును ప్రదర్శించినా అవి ఒకానొకప్పుడు బయటపడక తప్పదు.
కర్మలు శాశ్వతము కావు, ఎందుచేతనంటే కాలానుగుణంగా కర్మలు మారుతూవుంటాయి. కాబట్టీ వాటి ఫలితాలు కూడా తాత్కాలికములే. అంటే మనుజులు కర్మలు చేయడంగానీ, చేయకపోవడంగాని ముఖ్యంకాదని, తమ మనస్సునందు మాలిన్యము తొలగించడమే ప్రధానమని తెలుస్తుంది. ఆ మాలిన్యాన్ని మనసా, వాచా తొలగించకుండా, చేసే ఏ కర్మ అయినా నిరుపయోగమే! 
అజ్ఞాని, నేను చేస్తున్నానని భావించి(కర్తృత్యము), ఫలితముల యందు ఆసక్తితో కర్మలను చేసి, వాటి ఫలితాన్ని అనుభవించుటకు ఈ జన్మ చాలకపోతే ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి వుంటుంది. దానినే ప్రారబ్ధకర్మ అంటారు. జ్ఞానులు ఆత్మస్థితిలో వుండి ఏ ఫలితములను ఆశించకుండా, దైవబుద్ధితో కర్మలు చేస్తాడు. అది యజ్ఞంగా, యోగంగా మారి బంధమును కలిగించదు. సాధనతో ఆత్మజ్ఞానము పొంది బంధంనుండి విముక్తి పొందుతాడు. 
అంటే అనాసక్తితో, ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి కోరికలేక, అహమనే భావాన్ని త్యజించి చేసే ఏ కర్మ అయినా "కర్మయోగము"గా మారిపోతుంది. కర్మయోగము వలన బంధము కలుగదు.
జ్ఞానము పరిపక్వతజెంది సమాధి స్థితి కలిగినప్పుడు కర్మలతో పనిలేదు. కొందరు లోకకల్యాణం కొరకు కర్మలు చేస్తారు, కొందరు చేయరు. వారు కర్మని అకర్మగా, అకర్మని కర్మగా భావిస్తారు. అంటే వారు చేసే కర్మలు అసంగముగా చేస్తారు కావునా కర్మబంధము యుండదు.
మానవులు పరమాత్మను చేరుటకు కర్మ-జ్ఞానములు తప్పక అవసరము. ఇక్కడ "కర్మ అంటే నిష్కామకర్మ" అనే భావించాలి. దానివలనే జ్ఞానము ఉదయిస్తుంది.
తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము.

No comments:

Post a Comment