Tuesday, August 27, 2024

 *కంసుడి చావు* 

తలిదండ్రులు గల చెరసాల నుండి తప్పించుకొని కృష్ణుడు బృందావనంలో యశోద ఇంట పెరుగుతున్నాడు. కృష్ణుడిని చంపేందుకు అనేకమంది రాక్షసులను మాయవేషాలతో పంపాడు కంసుడు. కాని వారెవరికీ కృష్ణుడిని చంపేందుకు సాధ్యపడకపోగా వారే చావువాత పడ్డారు. దాంతో కంసుడికి కృష్ణుడిపై ద్వేషం మరింత ఎక్కువ అయింది.

తన నమ్మిన బంటు, అతి సమర్ధుడు అయిన కేసి అనే అతడిని ఈసారి కంసుడు కృష్ణుడి పై ప్రయోగించాడు. వాడు గుర్రం రూపంతో రేపల్లె వైపు పరిగెత్తాడు. మామూలు గుర్రాల కంటె అది చాలా ఎత్తుగా బలంగా ధృఢంగా వుంది. దిక్కులు మారుమోగేలా డెక్కల చప్పుడు చేసుకొంటూ పరిగెట్టుకు వచ్చింది. భయంకరంగా సకిలించింది.

బాగా దూరంగా వుండగానే దానిని గమనించి, అది ఏమిటో తెలుసుకున్నా డు కృష్ణుడు. దాని దారికి అడ్డంగా నిలబడ్డాడు. అది వస్తూనే నోరు బాగా తెరిచి కృష్ణుడి మీద పడింది. అతడి చుట్టూ తిరిగి వెనక కాళ్ళతో అతడిని తన్నబోయింది. కాని కృష్ణుడు తెలివిగా తప్పించుకొని ఎగిరి దాని వెనక కాళ్ళు రెండూ గట్టిగా పట్టాడు. గిరగిర తిప్పి దాన్ని గిరాటు వేశాడు.

అది అల్లంత దూరంలో పడింది గాని వెంటనే కృష్ణుడిని మింగేద్దామని నోరు బాగా తెరచి అతడి పైకి దూకింది. దగ్గరకు రాగానే కృష్ణుడు తన చెయ్యి అమాంతం దాని నోటిలోకి దూర్చేశాడు. దాని నోటిలోకి వెళ్ళాక కణకణ మండే ఇనప వూచలా మారిపోయింది అతడి చేయి. అది దాని కడుపులోకి దూసుకు పోయింది. దాంతో అతి భయంకరమైన అరుపు అరిచి క్రింద పడి చచ్చిపోయింది ఆ గుర్రం.

ఈ సంగతి విని కంసుడు కుతకుత వుడికి పోయాడు. కృష్ణుడిని చంపితే గాని నిద్దురపోకూడదని నిశ్చయానికి వచ్చాడు. తన నగరానికే కృష్ణుడిని బలరాముడిని పిలిపించి, గుట్టుచప్పుడు కాకుండా వారిని హతమార్చాలని కొత్త పథకం తయారు చేశాడు. దాని ప్రకారం అక్రూరుడు అనే వాడిని కృష్ణబలరాముల వద్దకు పంపాడు. తాను ధనుర్యాగం చేస్తున్నట్టు బంధువులంతా వస్తున్నారు కాన మీరు కూడా రావాలని వారికి వర్తమానం పంపాడు.

అది విని కృష్ణుడు నవ్వుకున్నాడు. వస్తున్నామని చెప్పమని అక్రూరుడితో చెప్పాడు. ఇద్దరూ కలిసి కంసుడి నగర మైన మధురా నగరానికి వెళ్ళారు. రాచ వీధిలోంచి వెడుతుంటే వారికి రాజుగారి చాకలి ఎదురు అయ్యాడు. ఆతడు కంసుడి బట్టలు ఉతికి తీసుకువెడుతు న్నాడు. అది గ్రహించి బలరామకృష్ణులు అతడిని ఆపి, ఆ బట్టలు కావలన్నారు. అతడు వారిని ఎగాదిగా చూసి, 'మీది ఈ వూరు కాదా, ఇవి రాజుగారి బట్టలు, మళ్ళీ ఇటువంటి హాస్యాలు ఆడకండి' అంటూ ముందుకు పోబోయాడు.

బలరాముడు అతడిని వెంబడించి అతడి చేతి లోంచి బట్టల మూట క్రిందకు తోసేశాడు. దాంతో అతడికి కోపం వచ్చి బలరాముడి మీద చేయి ఎత్తాడు. బలరాముడు వాడి చేయి పట్టుకొని, వాడి వీపు మీద బలంగా రెండు గుద్దులు గుద్దాడు. దాంతో వాడు చచ్చాడు. బట్టలన్నీ క్రింద పడేసి, తమకు నచ్చినవి అక్కడే తొడుక్కొని ముందుకుపోయారు వారు.

యాగం కోసం పెద్ద విల్లు ఒకటి చేయించాడు కంసుడు. అది ఆదిశేషు వులా భయంకరంగా వుంది. పదిమంది అయినా దానిని ఎత్తలేరు. దానిని యాగ శాలలో పెట్టి బలమైన కాపలా పెట్టాడు అతడు. నేరుగా కృష్ణుడు, బలరాముడు అక్కడికే వెళ్ళారు. కాపలావాళ్ళు వీరిని గమనించలేదు. తిన్నగా ధనుస్సు దగ్గరకు వెళ్ళాడు కృష్ణుడు. చటాలున ధనుస్సు పైకెత్తాడు. 

ఇంతలో “ఆగు, ఆగు” అంటూ భటులు అరుస్తూ పరిగెట్టుకు వచ్చారు. అప్పటికే కృష్ణుడు ధనస్సు పైకేత్తేశాడు. ఆది రెండు ముక్కలయింది.

జమాజెట్టీ ల్లాంటి కావలివాళ్ళంతా కత్తులు కటార్లు పట్టుకొని కృష్ణుడి మీదకు వచ్చారు. విరిగిన వింటి ముక్కలు చేతుల్లోకి తీసుకొని కృష్ణ బలరాములు వాళ్ళందరిని చితకగొట్టారు.

ఈ సంగతి తెలిసిన కంసుడి గుండెల్లో రాయి పడింది. లోక ప్రసిద్ధులయిన మల్లులు చాణూరునీ, ముష్టికుడినీ పిలిచాడు. “రేపు కృష్ణబలరాములిద్దరినీ ఎలాగయినా సరే చంపాలి" అంటూ ఆజ్ఞ ఇచ్చాడు. మహామాత్రుడు అనే మావాటి వాడిని పిలిచి ' రంగస్థల ద్వారం వద్దనే పట్టపుటేనుగును నడిపించి బలరామ కృష్ణులిద్దరినీ పచ్చడిగా తొక్కించేయి' అంటూ హుంకరించాడు. మల్లయుద్ధ పోటీలలో పాల్గొని తమ ప్రజలకు ఆనందం కలిగించమని బలరామకృష్ణు లకు అభ్యర్థన పంపించాడు కంసుడు. వారు దానికి అంగీకరించారు.

మర్నాడు మల్ల రంగస్థలం వద్ద అడ్డంగా వున్న ఏనుగు తొండం పట్టుకుని గిరగిర తిప్పి దాని కుంభ స్థలం మీద బలంగా రెండు గుద్దులు గుద్దాడు కృష్ణుడు. దాంతో అది గట్టిగా ఘీంకారం చేస్తూ పడి చచ్చింది. మల్ల యుద్ధంలో మల్లయోధు లిద్దర్నీ మట్టి కరిపించారు బలరామకృష్ణు లు. వాళ్ళిద్దరూ చావగానే వెంటనే కంసుడి దగ్గరకు పరుగుపెట్టారు.

కంగారుగా కత్తి దూశాడు కంసుడు. కృష్ణుడు ఎగిరి అతడి చేతిని పట్టుకుని రెండవ చేతితో బలంగా అతడి ముఖం మీద కొట్టాడు. దాంతో ఆతడి కిరీటం అల్లంత దూరం వెళ్ళి పడింది. ఎగిరి బలంగా గుండెల మీద తన్నాడు. దాంతో అతకు క్రింద పడ్డాడు. వెంటనే అతడి గుండెల మీద నించుని కసపిసా తొక్క సాగాడు. దాంతో అతడి ఛాతీ అంతా చితికి రక్తం కారిపోయి ప్రాణం విడిచాడు. 

జైలుకు వెళ్ళి తన తలిదండ్రులు అయిన దేవకీ వసుదేవులను విడిపించి వారికి పాదాభివందనం చేశాడు. కంసుడి బెడద వదిలినందుకు మధుర ప్రజలంతా కృష్ణుడి పాదాలకు మొక్కారు.

*సమాప్తం*

No comments:

Post a Comment