Sunday, August 25, 2024

 మనకు దేహం వచ్చిన తరువాత ఏదో ఒక కర్మ చేయక తప్పదు. ఆ కర్మకు ఫలం రాక తప్పదు. ఆ కర్మఫలం ఒకప్పుడు సుఖంగా పరిణమిస్తుంది. ఒకప్పుడు దుఃఖంగా పరిణమిస్తుంది. మరొకప్పుడు సుఖం, దుఃఖం రెండూ కలుగుతాయి.
ఈ కర్మఫలాలు బతికి ఉండగాకానీ, మరణానంతరం కానీ అనుభవించక తప్పదు. కాని కర్మఫలాలను త్యాగం చేసిన వాడికి ఈ సుఖదుఃఖాలు ఉండవు.

ఉదాహరణకు పెళ్లి భోజనానికి వెళ్ళాం, 90 ఐటమ్స్ అక్కడ ఉన్నాయి. అన్నీ నోరూరించేవే. తింటేసుఖంగా, సంతోషంగా తృప్తిగా ఉంటాయి. అన్నీ తినేసాము. అజీర్తి పట్టుకుంది. డాక్టరుకు 500 మందులు 1000 మొత్తం 1500 ఖర్చు. వారం రోజులు శారీరక బాధ, ఇదే సుఖదుఃఖాల కలయిక. సాత్వికుడు తన ఎదుట ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నా, రోజూ తాను ఎంత తిని జీర్ణం చేసుకోగలడో అంతే తింటాడు. సుఖంగా ఉంటాడు. రాజస, తామస ప్రవృత్తి కలవారు, ఇవన్నీ రేపు దొరుకుతాయా అనుకుంటూ అన్నీ ఇష్టంగా, సుఖంగా తినేస్తారు. తరువాత అజీర్ణంతో బాధపడతారు.

కాబట్టి ఈ కర్మల యొక్క ఫలాలు అన్నీ సుఖాలు, దుఃఖాలు, సుఖదుఃఖాలు కలిగిస్తాయి. ఈ జన్మలో అన్నీ అనుభవించలేం కదా. కొన్ని సుఖాలు, కొన్ని దుఃఖాలు మిగిలిపోతాయి. వాటిని అనుభవించడానికి మరొక దేహం కావాలి. అందుకని, ఇవి మరుజన్మకు కారణం అవుతాయి. ఇంకో జన్మ ఎత్తి, మరొక దేహం పొంది ఈ సుఖదుఃఖాలను, పాపపుణ్యాలను అనుభవించాలి. అందుకే పల్లెటూళ్లలో ఏమీ తెలియని వాళ్లు కూడా *"ఏ జన్మలో ఏం చేసాడో.... ఏనాటి పాపఫలమో... ఈ నాడు, ఈ జన్మలో అనుభవిస్తున్నాడు"* అని చక్కని వేదాంతం చెబుతారు.

అందుకే ఈ కర్మఫలములను ఇక్కడే ఎప్పటికప్పుడు, కృష్ణార్పణం అంటూ త్యాగం చేస్తే ఎటువంటి బంధనములు ఉండవు. సుఖంగా ఉంటాడు. మరుజన్మ అంటూ లేకుండా జన్మరాహిత్యం పొందుతాడు. కాబట్టి నిష్కామంగా, ఎటువంటి ఫలాపేక్షలేకుండా కర్మలు చేయడం, ఆ కర్మఫలములను పరమాత్మకు అర్పించడం, మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, అన్నిటి కంటే ఉత్తమం.

 🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

No comments:

Post a Comment