Friday, August 30, 2024

అసామాన్య శిష్యుడు

 అసామాన్య శిష్యుడు

(శృ౦గేరి శారదా పీఠం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత విశేషం)

గురువు సమక్షంలో శిష్యుడు ఏ విధంగా ప్రవర్తించాలో గురుగీతలో చెప్పబదివుంది. “శిష్యుడు గురువుగారి పవిత్రమైన పాదుకలు, ఆసనము, ఇతర వస్తువులను భక్తితో పూజించాలి. గురువు నడిచి వెళ్ళేటప్పుడు ఆయన వెనుకనే నడవాలి, ఆయన నీడ దాటకూడదు” జగద్గురువులు ఇద్దరు ఒక చోట వున్నప్పుడు చూసే అదృష్టం ఉన్నవాళ్ళు శ్రీ సన్నిధానం తమ గురువుల సన్నిధిలో ఎలా ప్రవర్తించేవారో, ఎంత భక్తితో వుండేవారో చూసి తన్మయులైపోయేవారు. ప్రతిరోజు అనుష్టానం పూర్తి చేసుకున్నాక గురువు (అభినవ విద్యాతీర్థ స్వామి) గారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి తరువాత తమ దైనిక కార్యక్రమం ప్రారంభించేవారు భారతీ తీర్థ స్వామివారు. ఆయన మాటను, ఆయనను ఎన్నడూ దాటలేదు. ఇద్దరూ కూర్చోవలసి వస్తే ముందుగా గురువుగారు కూర్చునేంతవరకు నిలబడి తరువాత ఆసనం స్వీకరించేవారు. గురువుగారి సన్నిధిలో తాము ఏ నియమాలు పాటించాలో వాటిని పాటిస్తూ ఇతరులు ఎలా ప్రవర్తించాలో బోధిస్తుండేవారు.

ఒకసారి ఒక పిల్లవాడు వచ్చి సన్నిధానం వారిని మంత్రోపదేశం చెయ్యమని అడిగాడు. అతనికి గురువును ఎలా అడగాలో సవివరంగా చెప్పి శ్రీచరణుల వారి వద్దకు పంపారు. ఆయన దగ్గర సరిగ్గా ప్రవర్తన లేకపోయినా ఉపేక్షించారు గానీ తమ గురువుల దగ్గర సాంప్రదాయం పాటింపచేసారు. 

ఒకసారి శబరిమల యాత్రలో ఒక భక్తుడు ఒక రమణీయమైన ప్రదేశం చూపి ఇక్కడ గురువుగారిని విశ్రమించవలసిందిగా ప్రార్ధిస్తే బావుండును అని సన్నిధానం వారికి విన్నవిస్తే ఆయన “గురువుగారిని ఏమైనా చేయమని చెప్పడానికి మనం ఎవరు? వారికన్నీ తెలుసు. మన పని వారి ఆజ్ఞను పాటించడం మాత్రమే” అని సున్నితంగా మందలించారు భారతీ తీర్థ స్వామివారు. ఒకరికి ఒకరు దూరంగా ఉన్నప్పుడు పరస్పరం లేఖలు వ్రాసుకునేవారు. శ్రీ మహాసన్నిధానం లేఖలలో ఉదాత్తత, ప్రేమ కనబడేది. శ్రీ సన్నిధానం వారి లేఖలలో మర్యాద, భక్తి, కావ్యసౌన్దర్యం తొణికిసలాడేవి.

భారతీ తీర్థులు గురువుగారిని విడిచి వెళ్ళవలసి వచ్చినప్పుడు పక్కవారు వారి బాధను స్వయంగా చూసి ఆశ్చర్యపోయేవారు. శ్రీ సన్నిధానం వారు గురుదేవులను సమీపించి మోకరిల్లి వారి పాదాలు స్పృశించి నమస్కరించేవారు. ఎడబాటుని సహించలేకున్నారని స్పష్టంగా తెలుస్తూవున్నది. తల్లి తన బిడ్డను బుజ్జగించినట్లు శ్రీ మహాసన్నిధానం వారు ఆయనను ఓదార్చారు. రెండు నెలల తరువాత గురుదర్శనం చేసుకోబోతున్నామన్న ఆనందం వారి మాటలలో, చేతలలో స్పష్టంగా కనబడింది. వీరి మధ్యనున్న సంబంధాన్ని ప్రశంసిస్తూ  డా. మండవ మిశ్ర అనే ఒక సంస్కృత పండితుడు “నేను ఎంతోమందిని చూసివున్నాను. శ్రీ శంకరాచార్యుల శిష్యులు ఎలా వుండేవారో అనుకునేవాడిని? వీరిని చూసాక స్పష్టమయ్యింది.” అని అన్నారు.

#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

No comments:

Post a Comment