Tuesday, August 27, 2024

 ఒకసారి సుందర్ పిచాయ్ స్నేహితులతో కలిసి ఒక హోటల్ లో కూర్చున్నాడు. ఆ పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చున్నారు.

 ఎవరి సరదాల్లో వారుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక బొద్దింక ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకామె మీదకు ఎగిరింది. అంతే! హోటల్ దద్దరిల్లేలా అరిచి, గోల చేసి, ఎగిరి.. ఎలాగైతేనేం బొద్దింకను విదిల్చి కొట్టింది. అది కాస్తా వెళ్లి రెండో అమ్మాయి మీద పడింది. ఆవిడ కూడా అదే స్థాయిలో గగ్గోలు పెట్టింది.

ఆ గందరగోళం లోనే దాన్ని విదిల్చేసరికి అది వెళ్ళి ఒక సర్వర్ మీద పడింది. అతను చాలా ప్రశాంతంగా ఆ బొద్దింకను పట్టుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు విసిరేశాడు.

ఈ సంఘటన విన్నాక మీకేమనిపించింది? ఒక పది సెకన్లు ఆలోచించి మీకు ఏదో ఒకటి అనిపించాక ఇది చదవండి.

మీలాగే ఈ దృశ్యాన్ని చూసిన సుందర్ పిచాయ్ కు కూడా కొన్ని ఆలోచనలు వచ్చాయి. మనకొచ్చిన ఆలోచనలకు, అతని ఆలోచనలకు తేడా ఏమిటో అతని మాటల్లోనే తెలుసుకుందాం.

కాఫీ తాగుతూ జరిగిందంతా చూసిన నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ గందరగోళం అంతటికీ కారణం ఏమిటి? ఆ అమ్మాయిలు అంత హిస్టీరిక్ గా మారిపోడానికి కారణం ఏమిటి?

 బొద్దింకా? అలా అయితే ఆ సర్వర్ మీద పడింది కూడా అదే బొద్దింక కదా! 
అతనెందుకు వీళ్ళలా డిస్టర్బ్ కాలేదు?
అంటే కారణం బొద్దింక కాదు. బొద్దింక వలన కలిగిన ఇబ్బందిని ఆ ఇద్దరమ్మాయిలూ ఒకలా, అతనొకలా స్వీకరించారు.

అప్పుడు నాకర్థమైంది... ఇంట్లో మా నాన్న లేదా ఆఫీసులో బాస్ లేదా భార్య నా మీద అరిచినప్పుడు నాకు కలిగే చిరాకుకు కారణం ఏంటో? దానికి కారణం వాళ్ళ అరుపులు కాదు. వాళ్ళ అరుపుల వల్ల నాలో చిరాకు పుట్టకుండా నన్ను నేను అదుపు చేసుకోలేక పోతున్నాను.

రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే నాకు కలిగే అసహనానికి కారణం ట్రాఫిక్ కాదు, అలాంటి పరిస్థితిలో అసహనానికి గురవ్వకుండా నన్ను నేను నియంత్రించుకోలేక పోతున్నానన్న మాట.

సమస్య కంటే ఆ సమస్యకు నేను స్పందిస్తున్న తీరువల్లే జీవితం గందరగోళంగా తయారవుతోంది. బొద్దింక ఘటన వల్ల నాకు అర్థమైంది ఏంటంటే...
సమస్యల పట్ల స్పందించడం కన్నా, సమస్యను అధిగమించడం ముఖ్యం.

బొద్దింక రూపంలో వచ్చిన సమస్యకు ఆ అమ్మాయిలు అతిగా స్పందించారు. కానీ ఆ సర్వర్ స్పందించకుండా, సమస్యను అధిగమించాడు.

స్పందనలు ఎప్పుడూ ఉద్రేకాలతో కూడుకుని ఉంటాయి. సమస్యను అధిగమించడం అనేది మాత్రం ఆలోచనలతో కూడుకుని ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే జీవితం అందంగా అనిపిస్తుంది.

ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే కారణం అతని జీవితంలో అన్నీ అతనికి అనుకూలంగా జరిగాయని కాదు. తన జీవితంలో అతనికి ఎదురైన మంచి చెడులన్నిటి పట్లా అతను సరైన వైఖరితో ఉన్నాడని అర్థం.''

No comments:

Post a Comment