Thursday, January 14, 2021

త్యజించు - జయించు

త్యజించు - జయించు

మనిషి ఎదిగే క్రమంలో జీవితానికి సరిపడా అలవాట్లు నేర్చుకుంటాడు. పుట్టుకతోనే స్వాభావికంగా ఏడవడం, బోర్లాపడటం, పాకడం, నవ్వడం, పరుగెత్తడం వంటి భౌతికపరమైన అలవాట్లు వస్తాయి.
తల్లిదండ్రుల దగ్గర నుంచి మాటలు, చేతలు, నడక, నడతలతో మానసిక ఎదుగుదల ఆరంభమవుతుంది. క్రమంగా మంచి, చెడుల వ్యత్యాసం తెలుస్తుంది.
ప్రకృతి- మనిషికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అనుక్షణం బోధిస్తూనే ఉంటుంది. బోధి వృక్షం కింద తపస్సు చేసిన బుద్ధుడికీ జ్ఞానం ప్రసాదించింది.
ఆపిల్‌ చెట్టు కింద కూచున్న న్యూటన్‌ తలపైన పడిన పండు, పైకి వెళ్ళకుండా ఎందుకు కింద జారిపడిందన్న జిజ్ఞాసను రేకెత్తించింది. అదే అతడిలో గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొనే ప్రక్రియకు పునాదులు వేసి, విజ్ఞాన ద్వారాలు తెరిచింది. చరిత్ర నేర్పే పాఠాల్లో... ముఖ్యంగా రామాయణం రాముడి ద్వారా సద్గుణ సంపదలను అందిస్తే- మహాభారతం పాండవుల ద్వారా సహనం, నైతికత, నిజాయతీలను బోధించింది.
మనలో ఎన్ని సుగుణాలున్నా ఒక్క చెడ్డ గుణం ఉంటే చాలు, అది పతనానికి నాంది పలుకుతుంది. రావణుడిలోని పరస్త్రీ వ్యామోహం, కౌరవుల  అసూయ, జూదవ్యసనాలు యుద్ధాల వరకు తీసుకెళ్ళాయి. ఫలితాలు లోక విదితమే. కుటుంబం, సంస్కృతి, సంప్రదాయాలు మనిషి ఎలా జీవించాలో నిర్దేశిస్తాయి. ముఖ్యంగా కట్టుబాట్లు, విలువలు, మానవ సంబంధాల్ని నేర్పుతాయి.
ఇవన్నీ అనుక్షణం మనిషికి ఏదో ఒక కొత్త పాఠం నేర్పుతూనే ఉంటాయి. దాన్ని ఆకళింపు చేసుకుంటే అదే అలవాటుగా మారుతుంది. అలవాటు ఒక తాడు లాంటిది. ప్రతిరోజూ సద్భావనలతో ఒక్కో పోగూ పేనుతూ పోతే ఆయుర్దాయం పెంచే దృఢమైన తాడు తయారవుతుంది. అవి చెడు భావనలైతే బలహీనమైన అల్పాయుష్షు గల తాడులా జీవితం మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దేన్నైనా స్వీకరించడం తెలిసినప్పుడు త్యజించడమూ తెలియాలి. కాశీ వరకు వెళ్ళి గంగలో కాకరకాయో, పొట్లకాయో వదిలేశామని గర్వంగా చెప్పుకొంటాం. కానీ మనలోని మలినాలను, దుర్గుణాలను, త్యజించామని ధైర్యంగా ప్రకటించలేం.
మనిషికి ఎంత కాలమైనా జీవించాలన్న ఇచ్ఛే తప్ప, ఏదో ఒక రోజు శరీరాన్ని త్యజించడం తథ్యమనే స్పృహ ఉండదు. తాత్కాలిక సౌఖ్యం ఇచ్చే ఏ అంశాన్నీ వదులుకోవడానికి మనిషి ఇష్టపడడు.
శరీరాన్ని, బుద్ధిని, ఆధ్యాత్మికతను నిర్వీర్యం చేసే దేన్నయినా సరే విషంలా భావించి, త్యజించాలి అన్నారు స్వామి వివేకానంద. త్యజించడం అంటే అవాంఛనీయ అలవాటును వదిలేసి దాని స్థానంలో, మంచి అలవాటును స్వీకరించేందుకు, కొనసాగించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇది ఒక్కసారిగా ప్రవర్తనలో మార్పుతో వచ్చేది కాదు. పరిణతి చెందే కొద్దీ, మనలోని పాత అలవాట్లను, ఎప్పటికప్పుడు కొత్త అలవాట్లతో ప్రక్షాళన చేసుకునే నిరంతర ప్రక్రియ.
విజయానికి అడ్డుపడే చెడు అలవాట్లను త్యజించాలంటే, ముందు కొత్త అలవాట్లను స్వీకరించడానికి భయపెట్టే అంశాలను అడ్డు తొలగించుకోవాలి.
కొన్ని అలవాట్లు మంచివే అయినా నియంత్రణ లేకపోతే అధోగతి పాలు చేస్తాయి. ఏదైనా సరే- అలవాటుగా ఉండాలే కానీ, వ్యసనంగా మారకూడదు. హిందువుల పండుగల్లో ముఖ్యమైనది, మూడు రోజులు జరుపుకొనే పెద్ద పండుగలో... తొలి రోజున లౌకికంగా ఉండే వ్యర్థ పదార్థాలను మంటల్లో వేస్తాం. అంటే చెడును త్యజించి విజయాన్ని ఇచ్చే మంచిని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతంగా దీన్ని భావిస్తాం. సంక్రమణం అంటే మారడానికి సిద్ధపడటమే!
👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment