దైవ ప్రార్థన
ఓ కరుణామూర్తియగు సర్వేశ్వరా ! మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందును నీ పాదారవిందములందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి యుండునట్లు అనుగ్రహింపుము.
పరమ దయానిధీ ! ప్రాత:కాలమున నిద్రలేచినది మొదలు మరల పరుండువఱకును మనో వాక్కాయములచే మా వలన ఎవరికిని అపకారము కలుగకుండునట్లును ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయులాగున సద్బుద్ధిని దయచేయుము.
సచ్చిదానందమూర్తీ ! నిర్మలాత్మా ! మా యంత:కరణమునందు ఎన్నడును ఏ విధమైన దుష్టసంకల్పము గాని, విషయ వాసనగాని, అజ్ఞానవృత్తిగాని జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము.
వేదాస్తవేద్యా ! అభయ స్వరూపా ! మా యందు భక్తి జ్ఞానవైరాగ్య బీజములంకురించి శీఘ్రముగా ప్రవృద్ధములగునట్లు ఆశీర్వదింపుము. మఱియు ఈ జన్మము నందే కడతేరి నీసాన్నిధ్యమున కేతెంచుటకు కావలసిన శక్తిసామర్యములను కరుణతో నొసంగుము.
దేవా ! నీవు భక్తవత్సలుడవు. దీనులపాలిటి కల్పవృక్షస్వరూపుడవు. నీవు తప్ప మాకింకెవరు దిక్కు నిన్ను ఆశ్రయించితిమి. అసత్తు నుండి సత్తునకు గొనిపొమ్ము. తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొనిపొమ్ము. మృత్యువు నుండి అమృతత్వమును పొందింప జేయుము. ఇదే మా వినతి. అనుగ్రహించుము. నీ దరిజేర్చుకొనుము.
పాహిమాం , పాహిమాం , పాహిమాం పాహి !
No comments:
Post a Comment