Thursday, February 20, 2020

18 ఫిబ్రవరి శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి

18 ఫిబ్రవరి శ్రీ  రామకృష్ణ పరమహంస జయంతి

అధునాతన సమాజంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టి, హేతువాదిగా ఉన్న నరేంద్రుని దృష్టికోణం మార్చి వివేకానందునిగా ఈలోకానికి అందించిన మహాప్రవక్త, పరమ ఋషి రామకృష్ణపరమహంస. ఆధ్యాత్మ చింతనకే జీవితాన్ని అంకితం చేసిన వాడు, కాళిమాత చరణారవింద సంసేవనా భాగ్యోపేతుడు రామకృష్ణ. ఆలిలోనూ అమ్మను చూడగలిగిన పరమభక్తి పరిపూర్ణుడు రామకృష్ణ.

19వ శతాబ్దంలో పశ్చిమబెంగాల్‌ లో జరిగిన సాంస్కృతిక పునరుజ్జీవనం పైనే కాదు యావత్‌ ప్రపంచం పైనా తన ప్రభావాన్ని బలంగా వేసిన రామకృష్ణ పరమహంస  గొప్ప సర్వమత సమతా వాది. పార లౌకికచింతన లో నిత్యం తన్మయమై ఉన్నా ఆయన బోధనలలో లౌకికవాద సారం తొణికిస లాడుతుంటుంది. ఆయన భావనలు నిత్యాలు- వాక్కులు సార్వకాలిక సత్యాలు.

ఈయన 1836 ఫిబ్రవరి18న పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీజిల్లా కామార్పుకూర్‌లో జన్మించారు. తండ్రి కుదీరా, తల్లి చంద్రమణి. తల్లిదండ్రులు ఈయనకు గదాధర్‌ ఛటోపాధ్యాయ నామకరణం చేసారు.  అలౌకిక జీవనం గడిపేందుకువచ్చిన రామకృష్ణునికి బడిచదువులు వంట పట్టలేదు. వడుగుచేసుకుంటే ప్రథమ భిక్షను ఒక శూద్ర యువతి నుంచి అందుకుని సంచలనంరేపిన సంఘ సంస్కర్త. హిందూమతం లోతులు తెలుసుకునేందుకు ఇతర మతాలనూ  క్షుణ్ణంగా అధ్యయనం చేసిన విశాల హృదయుడు రామకృష్ణపరమహంస. తెలుసుకునే కొద్దీ తెలుస్తుంది మనకు తెలియనిదేమిటో అన్న నానుడిని నిజం చేసిన వాడు, అందరికీ అన్ని మతాల హృదయం అందేలా అనుగ్రహభాషణలు చేసినవాడు రామకృష్ణ పరమహంస.

ధార్మిక గురువులు తోతాపురి నుంచి నిర్వి కల్పసమాధిస్థితిని, భైరవి బ్రాహ్మణినుంచి భక్తిభావంలో భగవత్‌సాక్షాత్కారం పొందే విధానాన్ని గ్రహించినా ఆయనలోని ధార్మిక దాహం అంతటితో చల్లారలేదు. క్రైస్తవం, ఇస్లాం మతాల సారాన్ని మనసునిండా గ్రోలే వరకు ఆయన శోధన ఆగలేదు.

కామార్కపూర్‌లో పుట్టినా కామాది విరహితమైన ఆత్మస్థితి పట్టువడింది. అయిదేళ్ళ వయసులోనే రామకృష్ణుని జీవితభాగస్వామి గా వచ్చిన శారదను బాలాత్రిపురసుందరి అవతారంగా భావించి ఆరాధించి ఆలిహోదా నుంచి అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళాడు. అందుకే వారి వైవాహిక జీవితంలో శరీరాపేక్ష ప్రసక్తే ఉత్పన్నం కాలేదు. వారి కాపురం రెండు మనసుల సహవాసంగా సాగిందే తప్ప రెండు శరీరాల సహజీవనంగా సాగలేదు.

భారతదేశానికి ఒక ఆకారమిచ్చి దేశమాతను అమ్మ వారితో సమానమని వర్ణించిన ఘనత రామకృష్ణులకే దక్కుతుంది. జాతీయోద్యమంలో భారతమాత బ్రిటిష్‌ వారి ఉక్కుపాదాలకింద నలిగిపోతోంది, పరాయిమూక లకు దాస్యం చేస్తోందన్న ఆలోచన ఆ తరం వారిని ఉడికించింది. రక్తం మరిగించింది. రామకృష్ణ పరమ హంస బోధనల్లో సామాజికాంశలు, మానవతా విలువలు, సంఘ సంస్కరణ ధోరణులుంటాయి.  కనుకనే ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన అధ్యాత్మ యోగి అయినా ఆయనపై కులం, మతం ప్రభావం ఏ మాత్రం పడలేదు.

శరీర విసర్జనకు ఏదో ఒక కారణం కావాలి కనుక క్యాన్సర్‌ ఒక కారణంగా ఆయన శరీరంలోకి ప్రవేశిం చింది. 1885 డిసెంబర్‌ 11న రామకృష్ణునికి తీవ్రమైన గొంతునొప్పి వచ్చింది. అదే క్రమంగా క్యాన్సర్‌గా బైట పడింది. ఆయనకు చికిత్స చేసేందుకు శ్యాంపుకూర్‌లో పెద్దపెద్ద వైద్యులంతా ప్రయత్నించి విఫలమయ్యారు. 1885 డిసెంబర్‌11న ఆయనను కాసిపూర్‌కు వైద్యాల యానికి మార్చారు. శిష్యులు, ఆయన సతీమణి శారదా దేవి సపర్యలు చేశారు.

గొంతు క్యాన్సర్‌ ముదిరి రామ కృష్ణులు విపరీతంగా బాధపడు తుండేవారు. ఎట్టిపరిస్థితి లోనూ ఎవ్వరితో మట్లాడ వద్దని వైద్యులు సలహా ఇచ్చారు. అయినా రామ కృష్ణులు మాట్లాడ్డం మానలేదు. తన వద్దకు వచ్చిన వారికి హితవు చెప్పకుండా ఉండనూ లేదు.

ఆఖరిరోజులు సమీపించిన సమయంలో వివేకానందుని పిలిచి తన ఆధ్యాత్మశక్తిని ఆయనలో నిక్షిప్తంచేశారు. తన తరువాత వివేకానందుడు తన ఆలోచనా సంవిధానాన్ని కొనసాగిస్తాడని, అంతా ఆయనకు సహకరించాలని కోరారు. శిష్యులను జాగ్రత్తగా చూడాలని, తన బోధనలను భవిష్యత్తు లోనూ వారికి వినిపిస్తూ నిరంతరచైతన్యమూర్తులుగా వారిని తీర్చిదిద్దాలని కోరారు.

 కాశీపూర్‌తోట గృహంలో వివేకా నందకు అధికార పగ్గాలు అప్పగించి 1886 ఆగస్ట్‌ 16 తెల్లవారుఝూమున బ్రహ్మైక్యం చెందారు. రామ కృష్ణులు మహాసమాధిలోకి వెళ్లారని ఆయన శిష్యులు విశ్వసిస్తారు.

ఆగస్ట్‌ 16న దివ్యసమాధి చెందిన రామకృష్ణ పరమ హంసకు వివేకానందుడుకాక 16 మంది శిష్యులు ఉండే వారు. గంగానది ఒడ్డున గల బారానగర్‌లో సగంసగం కూలిన పాతకాలపు ఇంట్లో రామకృష్ణుని వారసునిగా వివేకానంద తన కార్యకలాపాలు ప్రారంభించాడు. ఆయనకు ఆ ఇంటాయన, మరికొందరు శిష్యులు ఆర్థిక సాయం అందించారు. రామకృష్ణుని పేరిట తొలి ఆశ్రమం ఇదే! ఆ తరువాత రామకృష్ణుల విచారధార విశ్వవ్యాప్తమయ్యే కొద్దీ శాఖోపశాఖలుగా విస్తరించింది. నిస్వార్థ సేవకు, నిరంతర నైతిక విలువల ప్రబోధలకు రామకృష్ణుని ఆశ్రమాలు పెట్టింది పేరు.

రామకృష్ణుని బోధనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు రామకృష్ణ మిషన్‌, రామకృష్ణులు ప్రారంభించిన సన్యాసి జీవన విధానాన్ని కొనసాగించేందుకు రామకృష్ణమఠం ప్రారంభించాడు. రామకృష్ణుల పేరుతో సంస్థలుస్థాపించి వివేకానందుడు తన నిస్వార్థబుద్ధిని చాటుకున్నాడు.

No comments:

Post a Comment