Sunday, February 23, 2020

పక్కలో బల్లేలు

పక్కలో బల్లేలు

‘మంచి మనసులేని అందం, వాసన లేని పువ్వు, క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, ఆచరణ లేని మాటలు... ఎదుటివారికే కాదు, ఎవరికైనా కీడు చేస్తాయి’ అంటారు స్వామి వివేకానంద. సంస్కారవంతమైన హృదయంలో చెడు తలపులు రావు. చెడ్డతనమే అరిషడ్వర్గాలను ప్రేరేపిస్తుంది. ఇవి బయట ఎక్కడో కనిపించేవి కావు. మన(లోపలి) అంతశ్శత్రువులు. అవే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. వీటిలో ఏ ఒక్కటైనా చాలు మనిషిని సర్వనాశనం చేయడానికి! సప్త వ్యసనాలకు బానిస అయ్యాడంటే మనిషిని ఏదో ఒక దుర్లక్షణం ప్రభావితం చేస్తోందనే అర్థం.

పరస్త్రీ వ్యామోహం, జూదం, వేటాడి వన్య మృగాలను సంహరించడం, మద్యపానం, వాక్పారుష్యం, ఉగ్రదండనం (చేసిన తప్పిదానికి మించి శిక్ష విధించడం), అర్థదుర్వినియోగం అనే ఈ సప్త వ్యసనాలకు మనిషిని ప్రేరేపించేది కామక్రోధాది అంతశ్శత్రువులే. మనిషి తన వ్యసనాలను, బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి అనేక విధాలుగా సమర్థించుకుంటూ ఉంటాడు. అనేక సాకులు చెబుతుంటాడు. అసత్యం కంటే మించిన పాపం లేదని, సత్యాన్ని మించిన ధర్మం లేదని వైఖానస ధర్మసూత్రం వివరించింది. సత్యవాక్కు మాత్రమే మనిషికి తేజస్సును, కీర్తిని ఇస్తుందని ఛాందోగ్యోపనిషత్తు చెబుతోంది. అపసవ్య మార్గాన భోగవాసనలను అనుభవించాలన్న కోరికకు మూలం కామం. దాన్ని వదిలివేయడంలో గల చిదానందానుభూతిని మహోపనిషత్తు పేర్కొంది. మనో వికారాలన్నీ హృదయంలో నింపుకొని పుణ్యతీర్థ యాత్రలెన్ని చేస్తే మాత్రం ఏం లాభం అని ‘దుర్జన పద్ధతి’లో భర్తృహరి ప్రశ్నిస్తాడు. అజ్ఞానం, అవిద్య వల్లనే అహంకారం అంకురిస్తుందని విదురుడు అంటాడు.

మద మాత్సర్యాల వల్ల మనిషిలో ప్రతికూల ఆలోచనలు పెల్లుబుకుతాయి. ఆ ప్రతికూల ఆలోచనలే విజయానికి అవరోధాలవుతాయి. నిరహంకారి పలికే మంచి మాట దానం లాంటిది. ప్రతిఫలంగా సత్ఫలితాన్నే ఇస్తుంది. చెడ్డమాట అప్పు లాంటిది. ప్రతిగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. తనకు తెలియనిది ఎంతో ఉందన్న సత్యాన్ని తెలుసుకోవడానికి మనిషి దీర్ఘాయుష్మంతుడై ఉండాలి. మన ప్రవర్తనే మనకు శత్రువుల్ని, మిత్రుల్ని తెచ్చిపెడుతుంది. మనసులోని మంచీ చెడు భావాలకు ప్రవర్తనే ప్రత్యక్ష దర్పణం.
దుర్మార్గం వీడనివాడు, సంయమనం లేనివాడు, ధ్యాన తత్పరత లేనివాడు, చిత్తశుద్ధి లేనివాడు ఆత్మజ్ఞానం పొందలేడని కఠోపనిషత్తు కథనం. ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం నిరంతరం సాధన చేసే సాధకుణ్ని అరిషడ్వర్గాలేమీ చేయలేవు. బ్రహ్మహత్య చేసినవాడికి, సురాపానం చేసేవాడికి, చోరుడికి, వ్రతభంగం చేసేవాడికి ప్రాయశ్చిత్తమనేది ఉంటుందని; కృతఘ్నుడికి మాత్రం నిష్కృతే లేదని మనుస్మృతి చెబుతోంది.


పరిమళభరితమైన కస్తూరిని తన నాభిలోనే ఉంచుకొని, అది ఎక్కడ ఉందోనని అంతటా అన్వేషించే లేడి వంటివాడు మనిషి. తనలోనే ఉన్న దైవాన్ని అంతర్‌దృష్టితో చూడలేక అరిషడ్వర్గాలను పక్కలో బల్లేలుగా ఉంచుకుంటాడు. ఐహిక వాంఛలకు దాసుడైన మానవుడు సత్యాన్ని, స్వీయ దౌర్బల్యాన్ని అవగాహన చేసుకుని, జితేంద్రియత్వం సాధించే దిశగా ప్రయాణిస్తే ఏనాటికైనా మోక్షార్హత పొందగలడు. ఆధ్యాత్మిక దృష్టితో మనిషి తనను తాను మలచుకొని రాగద్వేషాలకు అతీతంగా జీవనయాత్ర కొనసాగించడమే మనిషి పరమావధి!

No comments:

Post a Comment