Thursday, February 27, 2020

మనసు - అవరోధాలు

🍁మనసు - అవరోధాలు🍁

🌿మనసు ఉన్న వాళ్ళం కాబట్టి మనల్ని ‘మనుషులు’ అంటారు.

🌿మనిషి సుఖ దుఃఖాలకూ, ఆవేశకావేశాలకూ, శాంతి అశాంతులకూ మనసే మూలం, మనసే కారణం. మనిషిని అతని మనోస్థితుల్ని బట్టే బుద్ధుడు విశ్లేషించాడు.

👉మనసుకు మొదటి అవరోధం కోరిక . ఈ వాంఛ అల్లుకొని ఉన్న మనసు రంగులు కలిపిన నీటిలాంటిది. రంగుల వల్ల నీటిలో మన ప్రతిబింబాన్ని మనం స్పష్టంగా చూడలేం.

👉అలాగే రెండో అవరోధం ఈర్ష్య. దీనివల్ల మనస్సు కుతకుతా ఉడికిపోతుంది. తెర్లిపోతుంది (సలసల పొంగుతుంది). ఇలాంటి అవరోధం ఉన్న వారి మనసు తెర్లే నీటి లాంటిది. వేడెక్కి తెర్లుతున్న నీటిలో మనం ప్రతిబింబాన్ని మనం చూడలేం కదా!

👉ఇక మనసును ఆవరించే మూడో అవరోధం సోమరితనం. ఈ సోమరితనం ఉన్నవాడు ‘రాజకుంభి’ అనే పురుగులాంటివాడు. ఆ పురుగు రోజంతా కదిలినా రెండంగుళాల దూరమైనా వెళ్ళలేదు. వానపాము కన్నా, నత్త కన్నా సోమరి రాజకుంభి.

🌿ఒకరోజు వేగంగా కదిలే కాళ్ళజెర్రి... రాజకుంభితో ‘‘మిత్రమా! రాజకుంభీ! నీ నడక చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఇంత నెమ్మదిగా నడుస్తున్నావ్‌! ఎప్పుడైనా అడవి అంటుకుంటే ఏం చేస్తావు? ఏమైపోతావు?’’ అని అడిగింది.

‘‘మిత్రమా జెర్రి! నీ అంత కంగారు నేను పడను. అడవి అంటుకుంటే.. ఆ మంటలు నా దాకా వస్తే గదా భయం. గుట్టలు దాటి, నెర్రలు దాటి, చెట్ల గుబుర్లు దాటి వచ్చే లోపే ఆ మంటలు ఎక్కడో ఒక చోట ఆరిపోక చస్తాయా! అవన్నీ దాటుకొని నా దగ్గరకు వచ్చేదెప్పుడు? నన్ను చంపేదెప్పుడు!’’ అని పరిహాసం చేస్తూ తన బద్ధకాన్ని చాటుకుంది. అలాగే సోమరితనం ఆవరించినవాడు కూడా ‘ఆఁ! ఇది జరుగుతుందా? పాడా?’ అంటూ ప్రతిదాన్నీ తేలికగా లెక్కించుకుంటాడు.

🌿అందుకే ఇలాంటివారి మనస్సును పాచిపట్టిన నీటితో పోల్చాడు బుద్ధుడు. నెమ్మదిగా, కదిలీ కదలకుండా ఉండే నీటిలో పాచి పట్టి పేరుకుపోతుంది. ప్రవాహంలో పాచి ఉండదు.

👉మనసును ఆవరించే నాలుగో అవరోధం విశ్రాంతి లేకపోవడం. అవిశ్రాంతంగా మనసుతో పని చేయించడం. శ్రమకు తగిన విశ్రాంతి కావాలంటాడు బుద్ధుడు. ఇలాంటి వాడి మనసు ఎప్పుడూ కల్లోలంగా ఉంటుంది. అందుకే దీన్ని నీటి అలలతో పోల్చాడు. నిరంతరం కదిలే నీటిలో కూడా మన ప్రతిబింబాన్ని చూడలేం. 

👉ఇక, అయిదో అవరోధం శంక. అనుమానించడం. ప్రతిదాన్నీ శంకించడం వల్ల మనసు ఎప్పుడూ చెడు భావనలతోనే నిండిపోయి ఉంటుంది. అలాంటి వారు తాము సుఖపడరు, ఎదుటివారిని సుఖపడనీయరు.

🌿 శంకతో పండంటి జీవితాలను పండుటాకుల్లా రాల్చేసుకున్నవారు ఎందరో! ‘‘ఇలాంటి ‘శంక’ అనే అవరోధం ఆవరించినవారి మనసు బురద కలిసిన నీరులాంటిది!’’ అన్నాడు బుద్ధుడు. బురద నీటిలో కూడా మన ప్రతిబింబాన్ని సరిగ్గా చూసుకోలేం.

🌿ఈ అయిదు అవరోధాల నుంచి బయటపడితే మన మనసు తేట నీరులా ఉంటుంది. ఆ నీటిలో మన ప్రతిబింబాన్ని చూసుకోగలం. అలాగే... అలాంటి తేట మనసు ఉంటే మనలోకి మనం చూసుకోగలం.🍁

No comments:

Post a Comment