Saturday, September 11, 2021

మనిషిని నేనూ..మాయదారి మనిషిని నేనూ

🌹━❀꧁ మనిషిని నేనూ..మాయదారి మనిషిని నేనూ ꧂❀━🌹

విశ్వం నాకోసమే విస్తరించి ఉందనీ,
పుడమి నాకోసమే పుట్టిందనీ,
సమస్త జీవరాశులూ నా బానిసలనీ,
నిశ్చయంగా నమ్మిన మనిషిని నేనూ...

అవనిని అమ్మంటాను నేనూ,
ఆదిత్యుడిని నాన్నంటాను నేనూ,
నడక వచ్చేదాకే అణిగిమనిగి ఉంటాను,
నేను ఎగిరితే మేఘం అడ్డురాకూడదన్నాను...

అడుగేస్తే అడవి దారి విడాలన్నానూ,
పడవెక్కితే అలలు తలొంచాలన్నాను.
అమ్మ కడుపులో బంగారం ఉందని తొలిచేశాను,
సాగరగర్భంలో చమురుందని చిలికేశానూ,
మరి రేపటికో అంటే నేనుండనుగా అని నవ్వేశానూ..

నేలమీద గీతలు గీసీ - నీదీ,నాదనీ పంచేసుకున్నానూ..
నా ముందు,నా తరువాతనీ కాలన్ని విడగొట్టానూ,
నేనే రాజునన్నానూ,తక్కినదంతా నా రాజ్యమన్నాను.
నా కొట్లాటలు చరిత్రన్నాను.ఋజువు కోసం రాళ్లు పాతాను.

నేను చెప్పినట్లు నడిచే,నేను చెక్కినట్లు కనిపించే నాలాగే ఉండే దేవుణ్ణి సృష్టించుకున్నాను.
నను నడిపేదీ వాడేనని నమ్మబలికాను.ఏడంటే అడుగో అని చేతులు పైకెత్తాను.

దాన్నీ,దీన్ని చంపుకు తిన్నాను.వింతరోగమంటించుకొని ఊరంతా ఏగాను.
గండం గడిచేదాకా గమ్ముగుంటానన్నాను.గుమ్మం దాటనన్నాను

నే స్వాగతం పాడకపోతే వసంతమాగిపోయిందా?
నా స్వాగతం వినబడకపోతే ఆమని పాటాపిందా?..
నే చతికిలపడగానే భూబ్రమణం నిలిచిందా?...
నా సందడి లేదే అని అంబరం ఊడిపడిందా?..

రాజు కాదు,బూజు కాదు కిరాయికి నేనుంటున్నాను.
బతికుంటే చాలని గోలగోల పెట్టాను.
నీ మాటే వింటానని మట్టిముట్టుకున్నాను.
బుద్దేదో వచ్చినట్టు వినయమొలకబోశాను.

మందో,మాకో దొరకంగానే,మళ్ళీ గద్దెనెక్కుతాను.
ఒళ్లు చక్కబడంగానే నువ్వెంతని అంటాను.
నాకేదీ సాటి రాదంటూ,మళ్ళీ మొదటికొస్తాను.
మనిషిని నేనూ,మాయదారి మనిషిని నేనూ...

Source - Whatsapp Message

No comments:

Post a Comment