Friday, September 17, 2021

శ్రీమతి M.S.సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా ---శ్రీ చాగంటి వారి మాట

శ్రీమతి M.S.సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా

-----శ్రీ చాగంటి వారి మాట

ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి ఎన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...

2017 మే లో కాకినాడలోని శ్రీమతి ఆకొండి లక్ష్మి స్మారక గోశాలలో "శ్రీ చాగంటి సత్సంగము" ఆధ్వర్యములో పూజ్య గురువులు "వ్యక్తిత్వ వికాసము" అను అంశముపై విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగములో శ్రీమతి M.S.సుబ్బులక్ష్మి గారి దీక్షాదక్షత, దానశీలము గురించిన విశేషములు, ఆ మాహా గాయిని జయంతి సందర్భముగా…

శ్రీమతి M.S.సుబ్బులక్ష్మి గారు గంధర్వ గాయిని. ఆవిడ పాట పాడితే ఈ దేశమునకు చెందిన వారు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తముగా ఎందరో పరవశించేవారు. చూపు, వినికిడి లేని హెలెన్ కెల్లర్ అనే ఒక విదేశీ వనితకి ఒక గొప్ప శక్తి ఉండేది. కళ్ళు లేకపోయినా, ఆవిడ ఎవరినైనా కొద్దిసేపు ముట్టుకుని ఆ వ్యక్తి లోని బలము, బలహీనత అన్నీచెప్పేసేవారు. ఈ విషయము విని, ఆశ్చర్యపోయి, హెలెన్ కెల్లర్ భారత దేశము వచ్చినప్పుడు అప్పటి ప్రధాని శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆవిడను పిలిపించుకుని, తనను ముట్టుకొమ్మన్నారు. హెలెన్ కెల్లర్ నెహ్రూ గారిని ముట్టుకుని, ఆయన బలాలు, బలహీనతలు, ఆయన జీవితము, అన్నీ చెప్పేసారు. అటువంటి హెలెన్ కెల్లర్ సుబ్బులక్ష్మి గారు పాట పాడుతూఉంటే, తాను వినలేను కాబట్టి, వేదిక పైనే కూర్చుని పాట పాడుతున్న సుబ్బులక్ష్మి గారి కంఠము మీద చెయ్యి పెడతాను అని అడిగారు. సుబ్బులక్ష్మి గారు అందుకు అంగీకరించారు. "కురై ఒండ్రుం ఇల్లై" అనే కీర్తన సుబ్బులక్ష్మి గారు పాడుతూ ఉన్నప్పుడు ఆవిడ కంఠం కింద వేలు పెట్టి, వల వలా ఏడిచేసి, "ఈమె కేవలము ఒక మామూలు గాయకురాలు కాదు. ఈమె గంధర్వ కాంత. ఈమె పాడిన తీరు దేవతలు పాడిన తీరుగా ఉంది. మనుష్యులు పాడగలిగినది కాదు" అని పరవశించారు హెలెన్.

ఇంత ఘనత సాధించిన సుబ్బులక్ష్మి గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఆవిడ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆవిడ తన చిన్నతనములో కటిక పేదరికము అనుభవించారు. తల్లిగారైన షణ్ముఖ వడిగు గారు అంత పేదరికములోనూ కూడా సుబ్బులక్ష్మి గారు గొప్ప విద్వాంసురాలు కావాలి అని ఎంతో కష్టపడి ఆవిడను పెంచారు. ఒకరోజు ఆవిడ సుబ్బులక్ష్మి గారికి అన్నము పెట్టడానికి కూరలు ఏమీ లేకపోతే, మజ్జిగలో నీళ్ళు పోసి, మరింత పల్చగా చేసి పెట్టారు. కాని ఆ సమయానికే పక్కనున్నవారి ఇంటిలోనుంచి మంచి వంటల ఘుమఘుమల వాసనలు రావటముతో, చిన్న పిల్ల అయిన సుబ్బులక్ష్మి గారు అటువంటి కూరలు తనకు కూడా కావాలి అని హటము చేసారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు పక్కంటివారిని ప్రార్థించి, కూర తెచ్చి, సుబ్బులక్ష్మి గారికి పెట్టారు. కూర తినటానికి కూడా లేనంత దారిద్ర్యము అనుభవించిన తల్లి, తన దీక్షాదక్షతలతో, పట్టుదలతో, సంగీత సాధన చేసి, గంధర్వగానము చేసి, ప్రపంచవ్యాప్తముగా ప్రఖ్యాతిగాంచారు.

తరువాతి కాలములో తాను కోట్లకు పడగెత్తినా, ఎన్నడూ ఆవిడకు దానిపై వ్యామోహము లేదు. తృణప్రాయముగా ధనమును దానము చేసిన మహా దాత సుబ్బులక్ష్మి గారు. సుబ్బులక్ష్మి గారి దానశీలము, దీక్ష, పట్టుదల చిరంతరముగా స్ఫూర్తిదాయకములు.

🌷🌷🌷🌷🌷

సేకరణ

No comments:

Post a Comment