Sunday, August 28, 2022

మానవులు చేసే రెండు ముఖ్యమైన తప్పిదములు. మొదటిది ఆత్మస్తుతి రెండవది పరనింద.

మానవులు చేసే రెండు ముఖ్యమైన తప్పిదములు.

ప్రతి మానవుడు కూడా తన జీవితం లో, రెండు తప్పులు ఎప్పుడూ చేయకూడదు...సాధారణంగా మనిషి రెండు తప్పులను చేస్తుంటాడు...

మొదటిది ఆత్మస్తుతి
రెండవది పరనింద.

...రెండూ తప్పులే, మనిషి తానెంత గొప్పవాడైనా తనను ఇతరులు పొగడాలి కానీ తనను తాను పొగుడుకోకూడదు.

"ఇన్ద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః"

దేవతల అధిపతి ఆయన దేవేంద్రుడు కూడా తన గొప్పతనాన్ని తానే ప్రస్తుతించుకుంటే చాలా చులకన అవుతాడని చెప్తారు. అందువలన ఎట్టి పరిస్థితుల లోను మానవుడు ఆత్మస్తుతి చేసుకోకూడదు.

ఇతరులను నిందించటమూ పెద్ద పాపమే. ఒక మనిషిని హత్య చేసిన దానికంటే ఇది ఎక్కువ పాపం.
ఇందుకు మహాభారతంలో ఒక ఉదాహరణ ఉంది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణునితో యుద్ధం చేయటం ధర్మరాజుకు చాలా కష్టమైంది. ఆ కష్టానికి తట్టుకోలేక ధర్మరాజు యుద్దభూమి నుండి వెనుదిరిగి శిబిరానికి వెళ్ళిపోయాడు.యుద్ధభూమిలో ధర్మరాజు కనపడక అర్జునుడు చాలా చింతించాడు. అతని కోసం వెదికి వెదికి చివరికి శిబిరంలో కనుగొన్నాడు.
ధర్మరాజు వెంటనే 'కర్ణుని చంపావా లేదా..' అని అర్జునుడిని ప్రశ్నించాడు. లేదు అని అర్జునుడు సమాధానం మిచ్చాడు. తాను ధర్మరాజును వెతుకుతూ అక్కడికి వచ్చానని చెప్పాడు. అప్పుడు కోపంతో ధర్మరాజు ఇలా అన్నాడు.'కర్ణుని చంపలేకపోతే నీకు గాండీవమెందుకు.. దండగ.. దానిని ఎవరికైన దానం చేయి'..

ఆ మాటలు వినగానే అర్జునుడి మనస్సు గాయపడింది. అతడు శ్రీ కృష్ణుని ఇలా ప్రశ్నించాడు. 'నా గాండీవాన్ని త్యజించమన్న వారిని చంపుతానని నేను శపధం పట్టాను, అందువలన నేను ధర్మరాజుని చంపాలి, కానీ ఆయన నా అగ్రజుడు. ఇప్పుడు నా శపథాన్ని నెరవేర్చు కొనడమెలా..'

అర్జునుని ప్రశ్నకు శ్రీ కృష్ణుడు ఇలా సమాధానం మిచ్చాడు.
'ధర్మరాజు వంటి మహా పురుషుని చంపాలను కోవటమే మహాపాపం, కానీ నీ శపథాన్ని నెరవేర్చక తప్పదంటున్నావు. నీవు ధర్మరాజును ఎటువంటి కారణం లేకుండానే నిందించు. అలా నిందించటమే హత్య చేసినట్లు' అని..

దీని నుండి ఒక వ్యక్తిని నిందించటం అంటే అతనిని హత్య చేయటం కంటే ఘోరమైన పాపమని మనకు తెలుస్తుంది. అందువలన మనల్ని మనం పొగుడుకోవటం, ఇతరులను నిందించటం మనం చేయకూడని పనులు. మన జీవితంలో ఆ రెండు తప్పులు ఎప్పుడూ చేయకూడదు.

యదీచ్చసి వశే కుర్తం జగదేకేన కర్మణా |
పరాపవాద సస్యేభ్య: గాశ్చరన్తీర్నివారయ ||

ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం మానివేస్తే ప్రతియొక్కడు నీవాడవుతాడు...

శ్రీ కృష్ణుడు చెప్పిన విధంగా అర్జునుడు , తన శపథం తీర్చుకునే క్రమంలో ధర్మరాజు వద్దకు వెళ్లి పరుష పదాలతో నిందిస్తాడు.. తాము పడుతున్న సకల కష్టాలకు , జూదంపై ధర్మరాజుకు ఉన్న ఆసక్తే కారణమని అంటాడు...భార్య, సోదరులను జూదంలో తాకట్టు పెట్టిన వాడివని నిందిస్తాడు.
ఎన్నడూ తమ్ముని నోటివెంట అటువంటి పరుష పదాలను వినని ధర్మరాజు హతాశుడై నిశ్చేష్టుడౌతాడు.

అర్జునుడు కూడా ఆవేశంలో పలికిన తన పరుషపదాలకు ఆవేదన చెందుతాడు....పితృ సమానుడైన తన అన్నను, అనరాని మాటలు తన నోటివెంట అనిపించిన శ్రీకృష్ణునిపై పట్టరాని కోపం వస్తుంది...శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి 'నీ మాటలు విని పితృ సమానుడైన అన్నను అనరాని మాటలు అన్నాను..నా పాపానికి నిష్కృతి లేదు.నాకు మరణమే మార్గం నేను ప్రాయోపవేశం చేస్తాను ' అంటాడు..

అప్పుడు శ్రీకృష్ణుడు వారించి ' దీనికీ ఒక మార్గమున్నది..పరనింద ఎలాగో ఆత్మస్తుతి కూడా మరణంతో సమానం అనే అంటారు...అందుకని, నీ గురించి నువ్వు పొగడుకుంటే మరణించినట్టే..దానికిది సరిపోతుంది ' అని అంటాడు... అప్పుడు మళ్లీ అర్జునుడు తేరుకుని సోదరుల వద్దకు చేరుకుని' పాండవులు అందరిలో నేనే గొప్పవాడిని..నేను లేకుంటే పాండవులకు మనుగడనే లేదు. నా గాండీవం , నా విలువిద్య వీటి వల్లనే పాండవులకు రక్షణ కలుగుతున్నది.అసలు నేను లేకపోతే పాండవులకు దిక్కులేదు ' అని ప్రగల్భాలు పలుకుతాడు.. సకల చరాచార సృష్టికర్త, సకల భువన సంచాలకుడు అయిన జగన్నాథుడు శ్రీకృష్ణుడు మాత్రం ,అన్నీ వింటూ చిరునవ్వులు చిందిస్తాడు..

నానాటికి విలువలు తగ్గుతున్న వర్తమాన సామాజిక పరిస్థితులలో , ప్రభాతవేళ ఇటువంటి సందేశాలు , కొంతవరకైనా ప్రభావితం చేస్తాయని ఆశిద్దాం...

No comments:

Post a Comment