Tuesday, November 29, 2022

శారదమ్మ గారు ... జీవుడు శరీరాన్ని విడిచేటపుడు ...?

 [11/28, 12:17] +91 73963 92086: హరిః  ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏

శారదమ్మ గారు ... జీవుడు శరీరాన్ని విడిచేటపుడు ...?

గురుదేవులు ..... జీవునికి శరీరం భోగసాధనం. ఆ భోగ సాధనాన్ని యోగదృష్టితో అనుభవించాలి. అలా యోగం చే శరీరాన్ని వదిలి పెట్టగల నైపుణ్యాన్ని సంపాదించాలి జీవుడు. భోగమైనా యోగమైనా రెండూ జీవుడికే, ఆత్మకేమీ సంబంధం లేదు. అందుకని జీవాత్మ అంటాము. జీవుడికి ఆ శక్తి ఎక్కడి నుండి లభించింది? భోగించగలిగే శక్తి కానీ యోగించ గలిగే శక్తి కానీ ఆత్మచైతన్యం వలన జీవుడికి లభించింది. జీవుని యొక్క వాస్తవ ఉనికి ఆత్మ చైతన్యం. అది జ్ఞానం. అది స్వరూపం. కానీ అది వ్యవహారంలో భోగం కానీ యోగంగా కానీ ఉంది. భోగం వరకే ఉన్న జీవుడు వదలలేక వదలలేక వెళతాడు. కాబట్టి మనిషి భోగిగా జీవించాడా? యోగిగా జీవించాడా? అనేది చివరికాలంలో తెలియబడుతుంది అంటాము. 

అయితే ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. మానవుడు భగవంతుని ధ్యానం చేస్తూ ... అర్చన చేస్తూ .. అభిషేకాలు అడిగేది ఏమిటి? వినా దైన్యేన జీవనం ... అనాయేసేన మరణం .... దేహాంతే తవ సాయుజ్యం ... ఇది ద్వైతభావనలో ఉన్న కోరిక. జీవుడు వేరే, దేవుడు వేరే అన్న లక్షణాలతో భోగిగా ఉన్నట్టి వ్యక్తి అడిగే కోరిక. దీంట్లో మోక్షమనే కోరిక 'దేహాంతే తవ సాయుజ్యం' అని అడుగుతున్నాడు. అంటే విదేహముక్తిని అడుగుతున్నాడే కానీ జీవన్ముక్తిని అడగటం లేదు. 

జాగ్రత్తగా శరీరాన్ని తృణప్రాయంగా చూడగల స్థాయికి రావాలి. మొట్టమొదట త్యాగమనే బుద్ధి రావాలి. ఆ త్యాగమనే బుద్ధి రాదు ఎవరికీ కూడా. ఎందుకనీ? శరీరం భోగసాధనం. అది సుఖానికైనా దు:ఖానికైనా... శరీరం అనేది లేకపోతే అనుభవించలేడు. నా జీవితంలో దు:ఖాలన్నీ అయిపోయినాయి. నా జీవితంలో సుఖాలన్నీ అయిపోయినాయి. అదయిపోయింది, ఇదయిపోయింది అని ఎలా అనుకుంటున్నాడో, నా జీవితంలో ఇది కాలేదు. అది అవలేదు అనేది చిత్తంలో ఉండిపోతుంది. అవే చిత్తంలో ఉన్న వాసనామయ బీజాలు. ఈ వాసనామయ బీజాలతోనే సూక్ష్మశరీరం మరో స్థూలశరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఆ సూక్ష్మశరీరానికి అధిష్టానమే జీవుడు. ఆ కారణశరీర స్థితిలో ఉండి అవిద్యామయంగా స్వరూపజ్ఞానం లేకపోవటం చేత ఇంకా నేనిది పొందాలనే భోగ అపేక్ష కల్గి ఉంటాడు. కాబట్టి వాడిని జీవుడని అంటున్నాము. ఆ భోగ అపేక్ష కలిగిన జీవుడు ఈ శరీరాన్ని పనిముట్టుగా వాడుకుంటూ ఉంటాడు. 
ఎంతోమంది ఇంకా మంచంలో తీసుకుని తీసుకుని ఎంతోకాలం ఉండిపోవటానికి కారణం .... ఈ భోగం నాకు ఇంకా పూర్తవలేదు అనే రెండు లక్షణాలతో శరీరమనే పనిముట్టు తో సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఈ భోగము, యోగము స్వరూపజ్ఞానం వచ్చేప్పటికి పూర్తయిపోతాయి. అందుకే యోగానికి లక్ష్యం ఆత్మసాక్షాత్కార జ్ఞానం. అదొచ్చే సరికి యోగం దశ పూర్తయి పోయి జ్ఞానిగా మారిపోతాడు. 

జ్ఞానిగా మారిపోయినవాడు శరీరంలోనే విడిపోయినటువంటి శరీరిగా ఉంటాడు. ఆ శరీరి జ్ఞానానుభవం వచ్చేప్పటికి అశరీరిగా మారిపోతాడు. బ్రహ్మానుభవం అంటాము. జీవన్ముక్తానుభవం ... ఈ జీవన్ముక్తుడు జన్మరాహిత్య స్థితిని పొందేప్పటికి అశరీరి అవుతాడు. జీవన్ముక్తుడుగా ఉన్నప్పుడు శరీరిగా ఉంటాడు. ఇది స్థాయీ భేధం. శరీరమే నేనుగా ఉన్నప్పుడు భోగిగా ఉంటాడు. శరీరి నేనుగా ఉన్నప్పుడు జ్ఞానిగా మారుతాడు. అందుకే భవద్గీత రెండు మార్గాలే చెపుతుంది. సాంఖ్య యోగమనీ అలాగే ఉపాసనా యోగమనీ రెండే యోగాలు. అంటే అర్చన, అభిషేకం, ధ్యానం, యోగం ఈ నవవిధ భక్తి మార్గాలు ఈ మొత్తం ఉపాసనా మార్గమనీ, కర్మకాండ అనీ, రెండవది స్వరూప జ్ఞానానికి సంబంధించిన సాంఖ్య- తారక - అమనస్క విచారణతో కూడిన జ్ఞానమార్గమనీ ఈ రెండు మార్గాలు సగం సగంగా కలిపితే యోగమార్గం అవుతుంది. 

కర్మమార్గంలో కొంతభాగం, జ్ఞానమార్గంలో కొంతభాగం కలిసి భక్తిమార్గం అవుతుంది లేదా యోగమార్గం అవుతుంది. కాబట్టి కర్మ యోగమని, భక్తి యోగమనీ, జ్ఞాన యోగమనీ యోగమనే లక్షణం అన్నిటిలో చేరుతుంది. దాని అర్ధం ఏమిటి అంటే నీవు శరీరివి అనే నిర్ణయాన్ని ఎప్పుడూ పొంది ఉండాలి. ప్రతిక్షణం పొంది ఉండాలి. ప్రతిక్షణం శరీరంతో శరీరి విడిపోయి ఉంటాడు. ఆ విడిపోయి ఉన్నవాడికి మాత్రమే అనాయాస మరణం సాధ్యమవుతుంది. వాడికి సమిష్ట్యానుభవమైన కర్మానుభవం కూడా పూర్తయిపోతుంది శరీరికి. 
అదే శరీరమే నేనుగా ఉన్నవాడికి వ్యష్టానుభవం అయిన కర్మానుభవం దగ్గరే వాడి పరిణామం ఆగిపోతుంది. వ్యష్టానుభవం దగ్గరే కర్మానుభవం ఆగిపోయినవాడు అంత తొందరగా శరీరం వదిలి పెట్టలేడు, అది అకాల మరణమైనా సకాలమరణమైనా. 
సహజ మరణంగా కనపడే వాటిలో కూడా శరీరమే నేనుగా కనపడే లక్షణాలే ఉంటాయి. కాబట్టి అతని జీవితం ఎలా సాగింది. 
శరీరమే నేనుగా ఉన్నాడా? శరీరి నేనుగా ఉన్నాడా? ఆ నేను పోగొట్టుకొని అశరీరిగా ఉన్నాడా? 

అశరీరిగా ఉన్నటువంటివాడు ఎలా ఉంటాడయ్యా అంటే పండినటువంటి దోసకాయ ఎలా వదిలేస్తుందో అలా వదిలేస్తుంది. అదే మృత్యుంజయ మహామంత్రము సూచించేటటువంటి సూచన.
[11/28, 12:17] +91 73963 92086: శరీరి ఎలా ఉంటాడయ్యా అంటే హస్తామలకంగా ఉంటాడు. చేతిలో ఉసిరికాయలా ఉంటుంది వాడికి జీవితం. ఆ ఉసిరికాయ వదికిపెట్టడానికి ఎంతో సమయం పట్టదు. అలా వదిలేయ గలుగుతాడు. అదే శరీరమే నేనుగా ఉన్నవాడు గుమ్మడికాయలా ఉంటాడు. గుమ్మడికాయ అంత తొందరగా వదిలిపెట్టదు కొయ్యాల్సిందే. కొయ్యకుండా గుమ్మడికాయ తొడిమ ఊడి పడదు. తప్పనిసరిగా కొయ్యాల్సిందే. లేదంటే ఆ పండు అలా తొడిమని అంటుకునే ఉండి వడిలిపోతుంది తప్ప తొడిమ ఊడదు. అందుకని గుమ్మడికాయను చూపిస్తుంటారు. గృహప్రవేశం అపుడు గుమ్మడికాయ ఎందుకు కొడతారంటే నాయనా! ప్రయత్నం చేసి నువ్వు జీవ భావాన్ని విడవాలి. గుమ్మడికాయ జీవుడికి  గుర్తు. మనిషికి గుర్తు. అహానికి గుర్తు. అది వదిలి పెట్టదు. 
తొడిమ జీవితకాలంలో ఎప్పుడూ గుమ్మడికాయని.. ఎండి ఎండి వడిలి రాలిపోయినా అది అలాగే ఉంటుంది. వదిలిపెట్టదు. అదొక గుర్తు. 
రెండవ గుర్తు హస్తామలకం. జ్ఞానం ఎలా ఉండాలయ్యా? చేతిలో ఉసిరికాయలాగ ఉండాలి. శరీరికి స్వరూపజ్ఞానం చేతిలో ఉసిరికాయలాగ ఉంటుంది. వాడు బ్రహ్మాండాన్ని చేతిలో ఉసిరికాయలాగ చూస్తూ ఉంటాడు. వాడి దృష్టి అది. వాడికి గుమ్మడి కాయతో పని లేదు. చేతిలో ఉసిరికాయలాగ ఉంటుంది వాడి జ్ఞానం. వాడు ప్రయత్నించి పగలగొట్టేది, విరగ గొట్టేది, వదిలేసేది ఏమీ ఉండదు. చేతిలో ఉసిరికాయ కిందపడాలంటే ఊరికే చెయ్యి తిప్పితే చాలు పడిపోతుంది. అంత రెప్పపాటు ప్రయత్నంతో శరీరం పడిపోతుంది. శరీరం ఉసిరికాయ లాంటిది. బ్రహ్మాండమైనా ... పిండాండమైనా ఉసిరికాయే. 

అశరీరి .... అతడేమో పండిన దోసపండులాంటివాడు. దోసకాయ వదిలి పెట్టడానికి అసలు ప్రయత్నమే ఉండదు. సహజంగా పడిపోతుంది. ఆ సహజంగా పడిపోవటమనే శరీరం పడిపోవటాన్ని మనం అనేకరకాలుగా 'అనాయాసేన మరణం' అనే సూచనతో చూపిస్తున్నాం. కానీ 'అనాయాసేన మరణం' ఎవరికి సాధ్యమవుతుంది అంటే అశరీరికి సాధ్యం అవుతుంది. ఇప్పటికే ఆయాసం ఉంటుంది. దానంతటఅది అతనిని శరీరం వదిలేస్తుంది. అతడు శరీరాన్ని వదిలిపెట్టటం కాదు. అశరీరిస్థితిలో శరీరమే అతడిని వదిలి పెట్టేస్తుంది అంటే అర్ధం ఏమిటి? ఒక పండు పండింది, ఎండింది, చెట్టు నుంచి రాలింది. చెట్టు వదిలేసిందా? పండు వదిలేసిందా? అంటే పండే వదిలేసింది. అలా వదిలేస్తుంది శరీరం. అశరీరి అయినటువంటివాడు నిత్య వ్యాపకమైనటువంటివాడు. విశ్వ వ్యాపకమైనటువంటి వాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటివాడు అశరీరి. 

అదే బ్రహ్మానుభవం వరకే జ్ఞానం ఉండి జీవన్ముక్తానుభవం ఉన్నది అన్నవాడు ఒకనిశ్వాసతో వదిలేస్తాడు. ఒక ఊపిరి వదలటానికి ఎంత శ్రమ కావాలి? ఎంతో శ్రమ అవసరం లేదు. ఊరికే ఒక నిశ్వాస వదిలిపెడితే ఎలా శరీరం పడిపోతుందో అలా శరీరం పడిపోతుంది. అలా సులభంగా పడిపోయేటటువంటి స్థితిలో ఉన్నవాడు శరీరి. ఎంతో బ్రహ్మప్రయత్నముతో శరీరం వదిలిపెట్టేవాడేమో గుమ్మడికాయ లాంటివాడు.  వాడు శరీరమే నేనుగా ఉన్నటువంటి వాడు. 
 
ఇక వీటన్నిటికీ కూడా ఆధారం ఏమిటయ్యా అంటే అహంకారం అనేటటువంటి కొబ్బరి పీచు. అందుకని ప్రతిచోట అర్చనలలో అభిషేకాలలో అన్నింటిలో కూడా కొబ్బరికాయను కొడుతూ ఉంటారు. ఆ కొబ్బరికాయ అహానికి గుర్తు అన్నమాట. ఎంత బాగా ఎన్ని దెబ్బలు కొడితే పగులుతుంది అనేది చెప్పలేము. ఒక్కొక్కటి ఒక్క దెబ్బకే పగిలిపోతుంది. ఒక్కోటి పదిదెబ్బలు కొట్టినా పగలదు. అలా మానవునిలో అహంకారానికి గుర్తు కొబ్బయికాయ.. ఈ రకంగా మానవ జీవితాన్ని సులభంగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయటమే జ్ఞానమార్గం.

శ్రీ విద్యా సాగర్ స్వామి వారు 
26-11-2022

జై గురుదేవ 🙏

No comments:

Post a Comment