Tuesday, November 29, 2022

శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?* *ఆధ్యాత్మికులు - ఆర్గనైజర్లు:-

 *🧘‍♂️73 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*

*శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?*

*ఆధ్యాత్మికులు - ఆర్గనైజర్లు:-*

శంఖులో పోస్తే గానీ తీర్థం కాదన్నట్లు, సంస్కృత శ్లోకం ఉటంకిస్తేగానీ కొందరికి గురి కుదరదు కాబట్టి, ముందు శ్లోకం చెప్పి ఆ తర్వాత అర్థం వివరిస్తాను.

శ్లో: అసన్మానాత్తపోవృద్ధిః 
సన్మనాత్తవసః క్షయః !
అర్చితః ఆపూజితో విప్రో 
దుగ్ధా గొరివ సీదతి!!

ఇక మనందరికీ అర్థమయ్యేట్లు చెప్పుకోవాలంటే “జనులు గౌరవించని ఎడల బ్రహ్మజ్ఞానం వృద్ధి పొందుతుంది. గౌరవించిన పక్షంలో బ్రహ్మజ్ఞానం క్షీణిస్తుంది. కనుక లోకుల ప్రశంసలు పొంది భోజన వస్త్రాలంకార దానాలను పుచ్చుకునే ఆత్మ జ్ఞాని ఒట్టిపోయిన గోవువలె ప్రయోజనం లేనివాడై నశిస్తాడు. 
జనుల నుంచి అవమానమే తత్త్వజ్ఞాని కోరుకోదగినది”. ఇక దీని తాత్పర్యం ఒక్క ముక్కలో చెప్పాలంటే "జీవితాన్ని 
నిజంగా అర్థం చేసుకోదలచుకున్న వాడు సంఘం నుంచి సన్మాన సత్కారాలు ఆశించకూడదు.”

కాని నేటి కాలంలో, “నేను ఆధ్యాత్మిక సాధకుణ్ణి. సంఘం ఇప్పటి వరకూ నన్ను గుర్తించక పోవడం శోచనీయం. ఇకనైనా త్వరపడి గుర్తించడం శ్రేయస్కరం” అన్నట్లు తిరిగే వారే ఎక్కువగా కనిపిస్తారు. అయితే అది అధ్యాత్మికత అనిపించుకోదు; మిగతా అన్ని వృత్తులలో గుర్తింపును ఆశించినట్లే ఈ రంగంలో కూడా గుర్తింపు కోరుతున్నాడన్న మాట. గుర్తింపు వెనకాలే ధనాశా, కీర్తికాంక్షా,అహంకారమూ,  అహంభావమూ తొంగి చూస్తుంటాయి.

ఆధ్యాత్మికులు అజ్ఞాతంగానే బ్రతకాలని, ఎవరికంటా పడరాదని అనడం లేదు. తాము ఉండదలచుకున్న చోట ఉంటూ తమ వద్దకు వచ్చిన వారికి చెప్పగలిగింది ఏదైనా చెప్పవచ్చును.

 తమని ఎవరైనా ఆహ్వానించి తత్త్వం బోధించమని ప్రార్థిస్తే, 
పర్యటించినా తప్పులేదు కాని అవతలి వారు ఆహ్వానించేటట్లుగా పరిస్థితులు కల్పించడం, వెళ్ళిన చోట అమితమైన స్వాగత సత్కారాలు ఆశించడం, ఉపన్యాసకులకు, రాజకీయ నాయకులకు వేషగాళ్ళకు చెల్లుతుంది కాని, తత్త్వజ్ఞానికి మాత్రం పనికిరాదు. కాని ఈనాటి “జ్ఞానులు” సమాజంలోని నలుగురితోబాటు వేదికలెక్కి కూచుంటారు. అందరితో బాటు పూలమాలాలంకృతులవుతుంటారు. సంఘంలో వర్తకులకూ, నాయకులకూ, దాతలకూ దక్కే గౌరవం వీరికీ దక్కుతుంటుంది. అందరితోబాటు వీరు కూడా ఏవో కొన్ని నీతులు వల్లిస్తారు.

 ఇటువంటి ప్రసంగం శ్రోతకు కర్ణపేయంగా ఉండవచ్చునేమో కాని, అతడిలో మౌలికమైన మార్పు మాత్రం తీసుకురాదు.

మతాన్ని గురించిన ఉపన్యాసం వేరు, తత్వజ్ఞాన బోధ వేరు. మతాచరణ వేరు, స్వస్వరూప జ్ఞానం కొరకై లోతులు తవ్వడం వేరు. ఈ తేడా సరిగా తెలియని ఒక పెద్ద మనిషి, నేటి ఆధునిక స్వాములు ఊరేగుతున్న చందంగా అరుణాచల రమణుల వారిని కూడా దేశమంతా తిప్పి ఉపన్యాసాలు ఇప్పిద్దామని ప్రయత్నించాడు. శ్రీమతి సూరి నాగమ్మ గ్రంథంలో ఆ ఉదంతం వివరాలను శ్రీరమణుల భాషలోనే చదవండి.

 “కొన్నాళ్ళు రాజేశ్వరానందస్వామి ఇక్కడ ఉన్నారు కదూ.
 అప్పుడు ఇండియాలో ముఖ్యమైన ప్రదేశాలకంతా భగవాన్ దయచేసి ఉపన్యాసాలిచ్చి బోధ చేయాలని, అందుకు గాను ట్రెయినులో స్పెషల్ క్లాసు ఏర్పాటు చేస్తానని, ఆ ఊళ్ళో అన్ని రోజులు, ఈ ఊళ్ళో ఇన్ని రోజులు ఆగాలని చెపుతూ, ఏమో ప్లాన్లు వేస్తుండేవారు. పలక్కుండా విని ఊరుకునేవాణ్ణి. సమ్మతమేనని అనుకున్నారు. చివరకు ఒక రోజు స్పెషల్ క్లాసూ అదీ ఇదీ ఏర్పాటు చేసి వారి సామానంతా మూట కట్టి, "స్వామీ, బయలు దేరుదామా?” అన్నారు. "ఆహా, దానికేమి పోయిరండి” అన్నాను.

 “భగవానో?” అన్నారు. 'నేనా, ఎందుకు?” అన్నాను. "ఆధ్యాత్మ తత్త్వం  బోధించాలి స్వామీ" అన్నారు. “సరిసరి, చేసేదేమి? ఉండేదెక్కడ, పోయేదెక్కడికి? నాకెక్కడికి పోయేందుకూ స్థలం లేదే” అన్నాను వారు నిర్ఘాంతపోయారు.”

మరొక చోటికి వెళ్లడం సబబా కాదా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. అర్థశతాబ్దం పైగా రమణులు తిరువణ్ణామలైలో గడిపిన కాలంలో, ప్రత్యేకంగా ఉపన్యాసాలంటూ
ఏవీ ఇచ్చిన వారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే సందర్భానుసారంగా విషయాన్ని వివరించే వారు. సందేహ నివృత్తి చేసేవారు. ఎందరు శ్రద్ధాసక్తులతో ప్రశ్నించారు.

 ఎందరు వ్యర్థమైన ప్రశ్నలు వేసేవారు అనే మాట అటుంచి, ఎందరు ఆయన బోధను గ్రహించి, 
ఆచరించి తత్త్వం కనుగొన్నారు అనేదే ముఖ్యమైన ప్రశ్న.

 ఈ ప్రయత్నానికి పూనుకునే శక్తి చాలక, తాము తరించే మార్గం కనిపించక, ఇతరులను తరింపచేయడానికి మాత్రం స్వామి ఉపన్యాసాలిప్పిస్తామంటారు. ఇలా కేవలం "ఆర్గనైజ్" చేయబూనుకోవడం తమ ఆహాన్ని పెంచుకోడానికి ఉపకరిస్తుందేమోకాని, తనను ఏ నాటికీ ఉద్ధరించదు; తనని ఉద్ధరించుకోలేని వాడు మరొకరిని ఉద్ధరించనూలేడు.

*🧘‍♂️కర్మయోగం🧘‍♀️:-*

తాను కర్తననుకోకుండా కర్మచేయడమనేదే కర్మయోగం. కర్తృత్వ బుద్ధి లేకపోయినా కర్మలు వాటంతటవే జరిగిపోతాయి. ప్రతివాడూ ఏదో ఒక ప్రయోజనం నిమిత్తం జన్మ ఎత్తుతున్నాడు. తాను కర్తనని అనుకున్నా అనుకోక పోయినా ఆ ప్రయోజనం కొనసాగి తీరుతుంది 

No comments:

Post a Comment