Tuesday, July 4, 2023

నులక మంచం : శర్మగారి కాలక్షేపం కబుర్లు.

 నులక మంచం : శర్మగారి కాలక్షేపం కబుర్లు.

పూర్వకాలం లో నులక మంచమని ఉండేది. దీనికి నిలువు పట్టెలు అడ్డపట్టెలు ఎగుడు దిగుడుగా ఉండేవి. ఆ మంచం తడ కర్ర, చండ్ర, కొండిశ కర్రలతో చేసేవారు. ఈ మంచానికి “నులక” అని పేనే వారు. ఇది కిత్త (ఏపి)నారతో కాని, గోగునారతో కాని తయారు చేసేవారు. ఇది పురిపెట్టి ఉండేది., గట్టిగానూ ఉండేది. తల్లీ పిల్లా పడుకున్నా ఆగేది.  ఈ మంచానికి నులక నెయ్యడం(అల్లడం)కూడా ఒక కళ. దీనిని అందరూ నెయ్యలేరు కూడా. దీనికి తల దిక్కు కాళ్ళ దిక్కు అని వేరు వేరుగా ఉండేవి. కాళ్ళదిక్కున నులక నేసి ఉండదు. మంచంలో రెండు వంతులు నేస్తారు. ఈ నేసిన నులక చివరినుంచి తాడు ఎదురు పట్టెకు కట్టుకుంటూ వస్తారు. మంచం వాడకంలో గొయ్యి అయిపోతే మళ్ళీ దానిని ఈ తాడు బిగింపుతో సరి చేసేవారు. నులక మంచానికి ఎన్ని ఉపయోగాలో! పురటాలుకి వేసేవారు, ముసలి వారికి ఇదే గతి. పక్క తడిపే పిల్లలికి కూడా ఇదే మంచం వేసేవారు. ఈ మంచం తడిపేవారు శుభ్రం చేయడానికి. అప్పుడు ఈ మంచం బలే సొగసుగా ఉండేది.తడిసిన నులక బిగిసిపోతే ఒక కోడు పైకి ఒకటి కిందికి ఎదుడు దిగుడుగా అంద వికారంగా ఉండేది. అందుకే తడిసిపోయిన నులకమంచమంటాం.
నులక మంచాన్ని ఇంత పొగుడుతున్నారు దాని ఉపయోగమేంటంటారా! పురటాలికి వేస్తే చలికాలంలో మంచం కింద వేడికి, ఒక పగిలిన కుండలో ఊకపోసి అంటించి పెట్టేవారు. చక్కగా వేడిగా ఉండేది. తల్లీ పిల్లా వెచ్చగా పడుకునేవారు. ఒకవేళ పిల్లలు పక్క తడిపినా, కిందికిపోయేది. ముసలాళ్ళకి కూడా లేవలేనివారికి ఇదే వేసేవారు. ఆ తరవాత వారిని లేపి వేరే పడుకోబెట్టి శుభ్రం చేసుకునేవారు. వేసవి కాలమయితే కిందనుంచి కూడా గాలి ఆడి హాయిగా ఉండేది. లేవలేని ముసలివారికి ఈ మంచం వేయడం మూలంగా బెడ్ సోర్స్ నుంచి రక్షణ ఉండేది, గాలి బాగా ప్రసరించడంతో. ఇదిగో ఇంతుంది నులకమంచం చరిత్ర

No comments:

Post a Comment