Tuesday, July 4, 2023

ముళ్ళపూడి వెంకట రమణ గారి జోకులు .

 ఈరోజు వ్యంగ్య కథా రచయిత, సినీ రచయిత *ముళ్ళపూడి వెంకటరమణ* జన్మదినోత్సవం సందర్భంగా.  వారికి నివాళులు అర్పిస్తూ.... 

జననం 28 జూన్ 1931
మరణం 21 ఫిబ్రవరి 2011

ఈ రమణ మరణించడు..! మరో రమణ జన్మించడు..!

తెలుగు సినిమా మాట నేర్చిన యేడాదే ముళ్ళపూడి వెంకట రమణ పుట్టారు. కాబట్టే అంత మాటకారి అయ్యారనిపిస్తుంది ఒకోసారి. 1931 లో తెలుగు నాట ‘భక్తప్రహ్లద’ పుట్టాడు. అదే యేడాది జూన్ 28న తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ముళ్ళపూడి వెంకటరావు పుట్టారు. రవణ (షార్ట్ కట్ లో ఇలానే అంటారుస్మీ) పుట్టినప్పుడు ఏం జరిగిందనే ఆసక్తి అందరికీ ఉండటం సహజం. దానికీ రవణే ఇలా సమాధానం చెప్పుకున్నారు.

గోదారి కెడాపెడాగా నేను తూగోజీలో, బాపు పగోజీలో పుట్టాం – ట. అప్పుడు ప్రపంచంలో పూలవాన కురవలేదు. ప్రళయాలు రాలేదు. గంధర్వులు పాడలేదు. కోకిలల్ని ‘కుహూ’ అనమంటే ‘ఊహూ’ అన్నాయని గిట్టని వారి ప్రచారం – అచ్చరలాడలేదు (దుబాయి టూరు వెళ్ళాయిట) – పేపర్లు సప్లిమెంట్లు వేయలేదు. టీవీ యాంకర్లు ‘హలో బాపూ అండీ హలోవ్ రవణాంకుల్’ అని గ్రీటింగ్సులు చెప్పలేదు. భూచక్రంలో భూమండలంలో ఆ రోజు తెల్లారగానే సూర్యుడు మామ్మూలూగానే ఉదయించాడు. ఆ రాత్రి చంద్రుడు కూడ అలవాటు ప్రకారం వెన్నెలే కాశాడు. చుక్కలు తళుకు తళుకు మన్నాయి. కొబ్బరాకులు మిలమిలమన్నాయి. పువ్వులు పూశాయి…” ఈ విధంగా తన జననాన్ని గురించి స్వయంగా ప్రకటించిన రవణ తన మరణం గురించి ఏం ఊహించారో తెలియదు..."


ముళ్ళపూడి వెంకట రమణ గారి జోకులు .

ముళ్ళపూడి వారి  జోకులు

@ " మీ పిక్చర్ కామెడియా? ట్రాజెడీయా?'
"డబ్బొస్తే కామెడి, రాకపోతే ట్రాజెడీ".

@"నేడే చూడండి" అని ప్రతి సినిమా ప్రకటనలో వేస్తారు కదా! అంత కొంప మునిగిపోయే అర్జంటేమిటి?"
"రేపుండదని హెచ్చరిక" 

@కమల: ఈ మగవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో?
విమల: ఆడవాళ్ళు మాట్టాడుకునేవే మాట్లాడుతారనుకుంటా."
కమల: చి చి అసయ్యం.

@"రేపు ఎలక్షనుకు నిలబడే అభ్యర్దులిద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటోయ్?"
" ఇద్దర్లో ఎవడో ఒకడే గెలుస్తాడని ఆనందంగా ఉన్నది."

@"నాతో నేనే మాట్లాడుకోడం మహా అలవాటైపోయింది డాక్టర్ గారూ. కాస్త మందేమైనా ఇస్తే-"
"దాంతో ఇబ్బందేముంటుంది? మందెందుకు?"
" అబ్బే వెధవ సోదండీ . విసుగొస్తుంది వాగాలేకా-వినాలేకా".

"ఏమండీ, ఈ కవర్ మీద పది పైసలు స్టాంపులు ఎక్కువ అంటించారు.'
" అయ్యో చూడు నాయనా. అది రాజమండ్రిదాకానే వెళ్ళాలి. బిళ్ళలెక్కువున్నాయని విశాఖపట్నం లో మా వియ్యపురాలింటికి తోలీకుండా చూడు."

@"ఇక లాభం లేదు, ఓ గంటకన్న ప్రాణం నిలబడదు. చెప్పదలుచుకున్నదేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి" అని   పెదవి విరిచాడు.
"ఆ ఉంది...ఇంకో డాక్టర్ను పిలిపించండి చప్పున" న్నాడు రోగి నీరసంగా.

@"డాక్టర్ గారూ.భోజనానికి సరైన వేళాపాళా ఏదంటారూ ?"
"లేనివాడికి దొరికినప్పుడు...ఉన్నవాడికి అరిగినప్పుడు"

@ ఒక రోగి ఆ"పరేషన్" బల్ల ఎక్కుతూ 
"మరే ప్రమాదం లేదుగా డాక్టర్ గారూ?" 
"చాల్చాల్లెవయ్యా, నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషన్ ఎవడు చేస్తాడు. భలేవాడివిలే..అని వ్యంగ్యంగా జోకులేసేవారు..😀

No comments:

Post a Comment