Tuesday, October 24, 2023

వైఫల్యాలకు ఏడు కారణాలు!

 *వైఫల్యాలకు ఏడు కారణాలు!*

*1.మనిషికి మనసే వరం ఆ మనసే శాపం అంటారు:*
*మనసు మనిషిని నడిపించే డ్రైవర్ లాంటిది. మంచి మార్గంలో నడిపిస్తే త్వరగా గమ్యం చేరుకుంటాము. అలాకాకుండా దారి మల్లిస్తే ప్రయాణం సాగదు. ఒక్కోసారి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ దారినే అలవాటు అంటారు. మన అలవాటును బట్టే  స్థితి, గతి, గమ్యం ఆధారపడి ఉంటాయి. మంచి అలవాట్లను  అభిరుచి అంటే, చెడు అలవాట్లను వ్యసనంగా భావించాలి. గతంలో సప్త వ్యసనాలు తప్పని చెప్పేవారు. అవి పరస్త్రీ వ్యామోహం, జూదం, మద్యపానం, వేట, పరుషంగా మాట్లాడటం, కఠినంగా దండించడం, దొంగతనం సప్త వ్యసనాలు. అయితే ఖాళీ సమయాల్లో మనం అలవాటుగా చేసే పనులు ఆచరించే వ్యవహారాలను కూడా హానికరంగా భావించాలి అంటారు సైకాలజిస్టులు. వాటిని  సప్త ప్రతికూల అలవాట్లు అంటారు. ఈ అలవాట్లు ఉన్న వారు ఎందులోనూ విజేతలు కారని చెపుతారు. అడుగడుగునా విఫలం ఎదురై పరాజితులుగా మిగిలిపోతారు. వాటిని గూర్చి తెలుసుకుని జాగ్రత్త పడాలి.*

*2.నిందలు మోపి ఆనంద పడటం:*
*ఆడలేని వారు మద్దెల ఓడు అంటారని సామెత. అలాగే కవి కాలేని వారు విమర్శకులు అవుతారని అంటారు. కొందరు ఖాళీ దొరికితే ఎవరో ఒకరిని నిందించి ఆనంద పడుతుంటారు. వారికి అదో తృప్తి నిస్తుంది. వాస్తవాలు తెలుసు కోకుండా నిందలు మోపే వారు సమాజంలో విశ్వసనీయత కోల్పోతారు. అందరిలో చులకనగా చూడబడుతారు. పరాజితులుగా మిగిలి పోతారు.*

 *3.స్వీయ అభివృద్ధి పట్టించుకోరు:*
*కొందరు తమ అభివృద్ధి గూర్చి ఏ మాత్రం పట్టించుకోరు. పరులను చూసి ఈర్ష్య, ద్వేషం పెంచుకుని విష ప్రచారం చేస్తుంటారు. కుట్రలు కుతంత్రాలు  పన్ని కాలం వృధా చేస్తుంటారు. దీని వల్ల తమ పనులు కుంటుపడుతాయి. ఉత్పాదకత దెబ్బతింటుంది. ఆఖరికి నష్ట జాతకుల జాబితాలో చేరిపోతారు. అప్పుల పాలవుతారు.*

*4. వాయిదాల మనస్తత్వం:*
*విజేతలు ఎప్పటి పని అప్పుడు చేస్తారు. పరాజితులు అన్నింటినీ వాయిదా వేస్తారు అన్నది నానుడి. రేపటి పనిని ఈ రోజే చేయాలి. ఈ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి అంటారు మహాత్మా గాంధి. కొందరు పనులను వాయిదా వేస్తుంటారు. తక్షణం నిర్ణయాలు తీసుకోవాలి అంటే భయపడి పక్కన పెడుతుంటారు. అలాంటి వారు ఆఖరికి ఇబ్బందులను ఎదుర్కొని వైఫల్యం మూట కట్టుకుంటారు.*

*5.తాత్కాలిక ఆనందం పొందడం:*
*కొంత మంది తాత్కాలిక సంతోషం, ఆనందం కోసం వెంపర్లాడటం చూస్తుంటాము. కుడుమిస్తే పండుగ అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. చేయవలసిన పనులు వదిలేసి సంతోషం కోసం వెదకడం అలవాటుగా మార్చుకుంటారు. పరీక్షలకు చదవడం మాని సినిమాకు వెళ్ళడం, అత్యవరస పనులను విస్మరించి చాటింగ్ చేయడం లాంటివి ఈ కోవలోకి వస్తాయి.*

*6.చెడు స్నేహాలు చేయడం:*
*మనం చేసే స్నేహాలు మన మీద ప్రభావం చూపుతాయి. జులాయి వ్యక్తులు, మూర్ఖులు, స్వార్థపరులు, అసాంఘిక శక్తులు, వ్యసన పరుల స్నేహం ప్రమాదకరం అన్నది గుర్తించరు. ఇలాంటి స్నేహాలు వల్ల సమాజంలో విలువ తగ్గడమే కాకుండా, నష్టాలు సంభవిస్తాయి.*

*7.సామాజిక మాధ్యమ వ్యసనం:*
*ఇప్పుడు సామాజిక మాధ్యమం కొందరి విషయంలో అష్టమ వ్యసనంగా మారింది. పనికి రాని పోస్టింగులు పెట్టడం, చూడటం, కామెంట్లు పెట్టడం, భూతులు తిట్టడం, తిట్టించు కోవడం అలవాటుగా మార్చుకుంటున్నారు. తెలివైన వారు సోషల్ మీడియాను తమ అభివృద్ధికి, ప్రచారానికి వాడుకుంటుంటే అమాయకులు వారికి ఉపయోగపడుతుంటారు. దీనివల్ల వారి ఉత్పాదక శక్తి క్షీణించి పోతుంది. సరైన లక్ష్యం ఉండదు, లక్ష్యం లేని వారు నిరంతరం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. అలాగే ప్రణాళిక లేకుండా పని చేస్తుంటారు. ఇలాంటి వారు జీవితంలో ఎలాంటి ఎదుగుదల సాధించ లేరు. ఒక్కో సారి కన్న వారికి, కట్టుకున్న వారికి కూడా భారంగా మారుతారు. అన్నింటిలో విఫలం చెందుతూ, సిద్ధాంతాలు వల్లిస్తూ కాలం గడిపేస్తుంటారు.*
🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

No comments:

Post a Comment