Thursday, October 26, 2023

సంయమనం గొప్ప వరం*

 🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
     *సంయమనం గొప్ప వరం*

*విద్యాధికుడిగా, జ్ఞానిగా, ప్రజోపకారిగా, బంధుమిత్ర ప్రియతముడిగా మన్ననలు పొందినా ఒకే ఒక అవలక్షణం వల్ల ఘనతను కోల్పోతున్నాడు మనిషి. రెండక్షరాల ప్రేమ మనిషిని మహనీయుణ్ని చేస్తుంటే మరో రెండక్షరాల క్రోధం అతణ్ని మతిభ్రష్టుడిగా మార్చేస్తోంది. ప్రథమకోపం, క్షణికావేశం మనిషిని పశువును చేస్తాయి. ముక్కోపానికి దాసులైన ముని పుంగవులు సైతం విజ్ఞతను దిగజార్చుకొని తపశ్శక్తిని కోల్పోయారు. నిలువెల్లా క్రోధం ఆవరించినప్పుడు చీకట్లు కమ్మి విచక్షణ నశిస్తుంది. ఆర్జించుకొన్న సద్గుణాలు, గౌరవాభిమానాలు మంటగలిసిపోతాయి. తొందరపాటు చర్య వల్ల అనర్థాలు దాపురిస్తాయి. ఇదొక మానసిక బలహీనత. పూర్వాపరాలు ఆలోచించక క్షణికావేశానికి లోనై మూర్ఖంగా విధ్వంసానికి సైతం వెనుదీయని వైఖరి మనిషి అల్పత్వాన్ని సూచిస్తుంది. ఆపై తొందరపాటు చర్యకు వగచినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఆకర్షణలకు మొగ్గుచూపి కుటుంబ బంధాలను తెంచుకొని బలవన్మరణాలకు పాల్పడే అనాలోచిత చర్యలు బాధాకరం. తమ అనైతిక ప్రవర్తనంతో మానవత్వానికి మచ్చతెచ్చి చరిత్రహీనులుగా మిగిలి పోయేవారు ఇంకొందరు.*

*జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏవో కొన్ని సందర్భాల్లో మందలింపులు, అవమానాలు తప్పవు, భవితను దిద్దుకొనేందుకు వాటిని ఉపకరణాలుగా ఉపయోగించుకోవాలే తప్ప కోపంతో రగిలిపోకూడదు, కన్నవారు, గురువులు, మిత్రులు మన ఎదుగుదలకు ప్రధాన సూత్రధారులు. మెట్టు మెట్టునా మన ఉన్నతిని కాంక్షించేందుకు పడే తాపత్రయాన్ని గుర్తించాలి. గుండె నిండుగా వారిని గౌరవించాలే గాని ద్వేషం, పగతో శత్రుభావన పెంచుకోరాదు. యాగం జరుగు తున్న సమయంలో తన రాకను గౌరవించలేదని అల్లుడైన శివుడిపై కోపించాడు. దక్షప్రజాపతి. అనరాని మాటలతో అవమానించాడు. ఏ మాత్రం చలించలేదు శివుడు. దక్షుడి పట్ల కొంచెమైనా విరోధం లేకుండా కూడా స్తుతిగానే స్వీకరించాడు, దక్షయజ్ఞ కూర్చున్నాడు. ధ్వంసానంతరం బ్రహ్మాది దేవతలు రుద్రుణ్ని శరణువేడారు. దుష్టుల నిందవల్ల మహాత్ముల శోభ మరింత పెరుగుతుందే కాని అపకీర్తి కలగదని, అజ్ఞాని విమర్శల్ని పొగడ్తలుగా చిరునవ్వుతో స్వీకరిస్తానన్నాడు శివుడు*

*ప్రశాంత జీవనాన్ని అశాంతికి గురి చేసే కోపాన్ని తక్షణం నియంత్రించాలి, రగులుతున్న కోపాన్ని విజ్ఞతతో కట్టడిచేసి శాంతపడేవారే ధన్యులు. కోపాన్ని అదుపు చేసి కళ్లెలు బిగించేది మౌనం. సమస్య సరళతరం కావాలంటే అననుకూల వాతావరణం నుంచి మౌనంగా నిష్క్రమించాలి. ఆవేశపరులు రెచ్చిపోయినప్పుడు బుద్ధిమంతులు మౌనాన్ని ఆశ్రయించి వారిని చల్లబరుస్తారు. ఆవేశానికి అడ్డుకట్టవేసే శక్తి ఆలోచనది కూడా. ప్రశాంతంగా క్షణకాలం బుద్ధిని ప్రయోగించి ఆలోచిస్తే చేస్తున్నది తప్పో ఒప్పో అర్థమవుతుంది. ఈ శక్తిని సొంతం చేసుకొంటే అబలలపై ఆమ్లదాడులు, నడివీధిలో గొంతులు కోసే దారుణాల్లాంటివి సంభవించవు. ధ్యానం, యోగాభ్యాసం వల్ల ఈ శక్తి లభిస్తుంది. ప్రతి ప్రాణిలో భగవంతుడి చైతన్యాన్ని గుర్తించాలి, ఆవేశకావేషాలకు లోనైనప్పుడు, బుద్ధి వక్రమార్గం వైపు మరలినప్పుడూ స్థిర చిత్తంతో చేసే ఇష్టదేవతా స్మరణ, ప్రార్ధనలు ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించే మహోత్కృష్ట వరాలు.*

No comments:

Post a Comment