Thursday, November 19, 2020

'విశేష' మంటే

ఏ వస్తువైనా సరే, ఉన్నది ఉన్నట్లే దాని స్వరూపంతోనే కనబడటం సామాన్య విషయమే. అందులో విశేషమేమీ లేదు. కానీ ఉన్నవస్తువు తనకు ఉన్న స్వరూపంతో గాక, మరొక రూపంతో కనబడటమే 'విశేష' మంటే. బంగారం ఉన్నదనుకోండి. అది బంగారంగా కనబడటంలో విశేషమేమీ లేదు. అది సామాన్య విషయమే. ఆ బంగారమే ఒక నగ యొక్క ఆకారాన్ని పొంది, ఒక ప్రత్యేకమైన పేరుతో గోచరించడం 'విశేష' మవుతుంది. అప్పుడు దాన్ని కంకణమనో, కంఠహారమనో అంటారే కాని, బంగారమని అనరు.

ఈ దృష్టితో చూసినట్లయితే బ్రహ్మమనండి, భగవంతుడనండి - బ్రహ్మంగాను, భగవంతుడిగాను కనబడితే అది సామాన్య విషయమే. నటుడు నటుడుగా కనిపించడం సామాన్యమనీ, ఏదో పాత్ర రూపంగా కనిపించడం విశేషమనీ ఈ సందర్భంలో గ్రహించాలి.
అలాగే "బ్రహ్మము" ప్రకృతి మహదాది పరిణామరూప జగత్తుగా తోచడమే విశేషము. "విశేషేణ వర్తతే ఇతి వివర్తమ్" అనేదాని ప్రకారం ఉన్న వస్తువు మరొకటిగా తోచటమే "వివర్త" శబ్ధానికర్థము.

అయితే ఇక్కడ వివర్తావస్థలో పూర్వరూప పరిత్యాగం ఉండదని అద్వైత సిద్ధాంతం అంటుంది. అనగా విశేషంగా కనిపించినా కూడా తన పూర్వపు సామాన్యరూపానికి భంగమేమీ వాటిల్లక అది అలాగే ఉంటుంది. దానికేమీ లోటుండదు. అయితే పూర్వరూప పరిత్యాగం కలిగిందా లేదా అనే విషయం అనుభవజ్ఞులకు మాత్రమే తెలుస్తుంది గాని, అజ్ఞానులకు, అనుభవశూన్యులకు తెలియదు.

ఈ సందర్భంలో అనేక ఉపమానాలను మనం శాస్త్రాలలో చూస్తున్నాం. నీరు ఉన్నదనుకోండి. అది ఒక్కటే తరంగాలుగా, బుడగలుగా, నురుగులుగా, సుడిగుండాలుగా గోచరిస్తున్నది. ఎన్ని రీతులుగా వివర్తించినా, అవి అన్నీ "నీరే" కాని భిన్నం కాదు. జగద్బ్రహ్మలను గూర్చి కూడా సాధకులు ఇలాగే భావించాలి. మట్టి- దానితో తయారైన వస్తువులు, లోహం - దానితో చేసిన వస్తువులు ఇలాంటివన్నీ ఇక్కడ ఉదాహరణలే!

"విపరీతేన వర్తతే ఇతి వివర్తం" అనే దానిని బట్టి చూస్తే సత్తు, చిత్తు, ఆనందమే స్వరూపంగా గల బ్రహ్మము తనకు విపరీతమైన అసత్తుగాను, జడముగాను, దుఃఖముగాను గోచరించడం వివర్తం. ఈ 'అసజ్జడ దుఃఖములు' మూడునూ బ్రహ్మ స్వరూపానికి విపరీతరూపములు. ఇవి జగత్తు యొక్క రూపములు గనుక అప్పుడిది కూడ వివర్త మవుతుంది.

కనబడే జగమునందు ఇలాంటి విపరీత బుద్ధి నశించి, సచ్చిదానందాత్మక భావన నిలవడమే "బ్రాహ్మీస్థితి" అన్నారు పెద్దలు. కొందరేమో జగత్తునందు మిథ్యాత్వ బుద్ధి కలగాలంటారు. మరికొందరు జగత్తుమీద బ్రహ్మభావన కలగటమే "బ్రాహ్మీస్థితి" అని భావించారు. ఆ పక్షంలో "బ్రహ్మసత్యం - జగన్మిథ్యా" కాక "జగద్బ్రహ్మ" అవుతుంది.

నీకు జీవభావమున్నంత వరకు, జగత్తు అనేది ఉండనే ఉంటుంది. నీ జీవభావము శమిస్తే జగము కూడ శమిస్తుంది. అయితే ఇక్కడ 'జీవభావ' మంటే ఏమిటో తెలుసుకోవాలి. జీవభావమంటే కేవలమైన చిత్తు, ప్రకృతితో - అంటే మనస్సు ( అహంకారముతో ) కలవడమన్నమాట. అంటే చిత్తు మనస్సులో ప్రతిబింబించి మనోధర్మాలన్నీ తనవే అని భ్రాంతి పడడమన్నమాట! దానికే "అధ్యాస" అని కూడ పేరు. చిత్తును చిత్తుగా మాత్రమే చూసేవారికి జగదధ్యాస, జగద్బ్రాంతి ఉండదు. వారు కేవలము చిన్మయమూర్తులే!

అయితే కేవల చిత్తుకు అచిత్తయిన మనస్సుతో సంబంధం ఎలా కలిగిందని ఒక సందేహం కదూ!
'సమ్యగ్ దృష్టితోను' ప్రగాఢమైన అనుభూతితోను చూస్తే 'చిదచిత్తు" లనేవి రెండూ లేనేలేవు. 'చిత్తు' అనేది ఉండవలసినంత గట్టిగా లేక చ్యుతం చెంది, ద్రవీభించమే ( పలుచబడటమే ) 'అచిత్తు' కావడమంటే. నీవు చిద్ఘనత్వమును భావించి, దాని స్వరూపం కాగలిగితే, అప్పుడు "అచిత్తు" ( అంటే మహదాది వికారాలు ) కలుగనే కలుగవు. అవ్యక్త మహదాకాశాదులే లేనప్పుడు, ఇక వాటి పరిణామమైన జగమనేది ఎక్కడి నుండి వస్తుంది!

'జగత్త' నేది పుట్టనూ లేదు, నశించనూ నశించదు. పుట్టితేనే కదా నశించటం. దీన్ని "అజాత" వాద మంటారు. ఒకవేళ జగత్తనేది నీకు ఉన్నట్లు తోచినా, దానివల్ల నీకు బాధ లేకపోతే నీవు ధన్యుడవే అనుకో! జగత్తును బ్రహ్మముగా చూసే తెలివి ( జ్ఞానము ) కలిగితే, దానివల్ల నీకు ఏ బాధా ఉండదు. ఇప్పటివరకు ఉన్న జ్ఞానులందరూ జగము వల్ల తమకు బాధ లేకుండా చేసుకున్నవారే. అయితే జగము వల్ల కలిగే బాధలు ఏమిటని మీరడగవచ్చు. అవి సుఖ, దుఃఖ, జనన జరామరణాదులే!

పంచభూతముల సత్వగుణాంశలతో ఏర్పడినట్టిది "అంతఃకరణ" మని వేదాంతం చెబుతున్నది. ఆ అంతఃకరణములో ప్రతిబింబించిన, ఆత్మచైతన్యానికే "జీవుడు - చిదాభాసుడు" అని పేర్లు. అంతఃకరణము నశిస్తే, చిదాభాసుడు తనకు కారణమైన ఆత్మలోనికే చేరుకుంటాడు. ఈ 'చిదాభాసు' డనే ప్రతిబింబానికి ఆధారమైన బింబమే 'ఆత్మ' అంటే. అతనిని వేదాంత పరిభాషలో "ప్రత్యగాత్ముడు, కూటస్థుడు, కేవలాత్ముడు" అని తెలుసుకోవాలి. ఆ ఆత్మయే తన స్వరూపంకాని, బిదాభాసుడు తన స్వరూపం కాదని జ్ఞాని యొక్క నిశ్చయం.
🔺🔺🔺🔺🔺🔺🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment