Tuesday, May 31, 2022

భేతాళ కథలు: వ్యర్థమైనవరం

💦భేతాళ కథలు💦
🌻వ్యర్థమైనవరం🌻

♦️పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, ఏ పట్టుదలకు సంతోషమేగా, హేమంతరాయుడి కుమార్తె మాలిని పొందిన వరం లాగే నీ ప్రయత్నం కూడా వృథా అయిపోతుందేమోనని నా అనుమానం. శ్రమతెలియకుండా నీకు హేమంతరాయుడి కూతుళ్ళ కథ చెబుతాను విను," అంటూ ఇలా చెప్పసాగాడు.

♦️జయంతనగరంలో హేమంతరాయు తనే ప్రభు వొకడుండేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్దది మాలిని, చిన్నది నళిని. మాలిని చాలా బుద్ధిమంతురాలు, సాత్విక స్వభావం కలది, కాని అంత అంద గత్తె కాదు. నళిని గొప్ప అందగత్తె, కాని ఆమె స్వభావం దుడుకైనది, గర్వాతిశయాలతో కూడినది.

♦️మాలినీ నళినీ కూడా యుక్తవయసు వచ్చి పెళ్ళికి సిద్ధమయారు. కాని వాళ్ళకు తగిన వరుళ్ళను చూడటం హేమంతరాయుడికి పెద్ద సమస్య అయిపోయింది. పిల్లలకు సంబంధాలు చాలా వచ్చాయి. కాని ప్రతి యువకుడూ నళినిని చేసుకుంటా ననేవాడే, మాలినిని చేసుకుంటానని ఒక్కడూ అన లేదు. పెద్దదాని పెళ్ళి చెయ్యకుండా, 'చిన్న దానికి ఎలా పెళ్ళిచెయ్యటం ?

♦️ఆ సమస్య అలా ఉంచి, రూపగర్విత అయిన నళినికి వచ్చిన సంబంధాలలో ఒక్కడూ నచ్చలేదు. అందుచేత హేమంత రాయుడు చిన్న కుమారికే పెళ్ళి చేసేద్దా మనుకున్నా అది పొసగే దారి కనబడలేదు.

♦️పరిస్థితి ఇలా ఉండగా ఒక సంఘటన జరిగింది. హేమంతరాయుడి చిన్ననాటి స్నేహితుడి కొడుకైన మాధవవర్మ అనే యువకుడు ప్రపంచం నాలుగు మూలలూ చూడాలనే ఉద్దేశంతో దేశసంచారం చేస్తూ జయంతనగరానికి వచ్చాడు.

♦️ఈ మాధవుడు చాలా అందగాడూ, మంచి మేధావీనూ, ఏ యువకుడి చేతా ఆకర్షించబడని నళినిని కూడా అతను బలంగా ఆకర్షించాడు. అతడు తన అందం చేత సమ్మోహితుడు కావాలని నళిని చాలా ప్రయాసపడింది. కాని నళిని అహంకార పూరితురాలని మాధవుడు గ్రహించాడు.

♦️మాధవుడు జయంతనగరంలో కొద్ది రోజులు గడిపి ముందుకు సాగిపోవటానికి ప్రయాణం కట్టేటప్పుడు హేమంత రాయుడు అతనితో తన మనసులోని మాటా బయట పెడుతూ, 'నాయనా, నీ తండ్రి నేనూ చిన్నతనంలో కట్టకట్టుకు తిరిగినవాళ్ళం. అందుచేత మన కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడటం కన్న నాకు కోర దగిన దేముంటుంది? నా కూతుళ్ళ నిద్దరినీ నువు ఇన్నాళ్ళూ చూశాపు గద. వారిద్దరికీ నీ పట్ల అపారమైన స్నేహభావం ఉన్నట్టు నేను కనిపెట్టాను. అందుచేత ఆ ఇద్దరిలో ఎవరిను నువు పెళ్ళాడ గోరినా నేను సంతోషిస్తాను," అన్నాడు.

♦️దానికి మాధవుడు, "మీ కోరిక చాలా ఉదోరమైనదే. నేనే ఒక నిశ్చయానికి రాలేకపోతున్నాను. దానికి కారణ మేమంటే, నేను నాకు కాబోయే భార్యలో సౌజన్యము, సౌందర్యమూ రెండూ కోరుతాను. దురదృష్టవశాత్తు, ఈ రెండు గుణాలూ మీ కుమార్తె లిద్దరిలోనూ ఉండి పోయాయి. మాలినిలో సౌజన్యం ఉన్నది, నళినిలో సౌందర్యం ఉన్నది. అయినా మరొక సంవత్సరం లోపుగా నా దేశయాత్ర ముగించుకుని మా దేశానికి తిరిగి పోయే టప్పుడు ఇటుగానే వస్తాను. ఈ లోపుగా నా మనను ఏ నిశ్చయానికైనా వచ్చిన పక్షంలో మీ కోరిక తప్పక నెరవేర్చగలను.

♦️ఈ సారికి నన్ను క్షమించండి." అన్నాడు. మాధవుడు వెళ్ళిపోయాక హేమంత రాయుడు తన కుమార్తెలతో అతనన్న మాటలు దాచకుండా చెప్పేశాడు. మాధవుడు తమను గురించి అన్న మాటలు విన్నాక మాలినిలోనూ, నళినిలోనూ కూడా వేరువేరు పరిణామాలు వచ్చాయి. నిజానికి ఆ ఇద్దరూ మాధవుణ్ణి పెళ్ళాడ గోరినవాళ్ళే.

♦️మాధవుడి మాటలకు మాలిని హతాశురాలు కాలేదు. తాను అందగత్తె కాదన్న సంగతి ఆమె ఎరుగును. కాని నళిని పూర్తిగా హతాశురాలై పోయింది. తన స్వభావం ఇతరులకు ఎలా కనిపించేది ఆమెకు తెలియదు. తెలిసినా లక్ష్యపెట్టలేదు. ఎందుకంటే తన సౌందర్యం ఎలాటి వాళ్ళనైనా జయిస్తుందని ఆమె పూర్తిగా నమ్మింది. మాధవుణ్ణి ఆ సౌందర్యం ఆకర్షించలేక పోయిందని, అందుకు తన స్వభావమే అడొచ్చిందని తెలియగానే ఆమె కుంగిపోయింది. ఆమెలోని గర్వమూ, అతి శయమూ క్రమంగా క్షీణించిపోయాయి.

♦️మాలిని హతాశురాలు కాకపోవటమే గాక, తాను ఏం చెయ్యాలో కూడా నిశ్చయించుకున్నది. తనలో లోపించినది అందం మాత్రమే. మాధవుడు తిరిగి వచ్చే లోగా తాను సౌందర్యవతి కాగలిగితే అతను తప్పక తననే పెళ్ళాడతాడు. అందుచేత ఆమె సౌందర్యం సాధించాలని నిశ్చయించుకున్నది.

♦️ఈ ఉద్దేశంతో మాలిని ఒక మంత్రో పాసకుణ్ణి వెతికించి పట్టుకుని, అతనితో తన కోరిక చెప్పింది. ఆరునెలల పాటు శ్వేతాంగి అనే యక్షిణిని అర్చించి, బలులు ఇచ్చినట్టయితే యక్షిణి ప్రత్యక్షమై మాలిని కోరిక తీర్చవచ్చుననీ, అర్చనానుష్ఠానాలు మాత్రం ఏ లోపమూ లేకుండా జరగాలని ఉపాసకుడు చెప్పాడు. ఎంత కఠోరమైన అనుష్ఠానమైనా అవలంబిస్తానని మాలిని చెప్పింది.

♦️ఆరునెలల పాటు అంతా సక్రమంగా జరిగింది. యక్షిణి ఉపాసకుడి పైన ఆవేశించి, "అమ్మాయీ, నీ నిష్టకు సంతో షించాను. నా వల్ల నీ కేమి సహాయం కావాలి అని అడిగింది.

♦️"తల్లి, నన్ను నా చెల్లెలి కన్న సౌందర్య పతిగా చెయ్యి. నా కింకేమీ అవసరం లేదు," అన్నది మాలిని.

♦️తథాస్తు!" అని యక్షిణి ఉపాసకుడి మీది నుంచి దిగిపోయింది.

♦️అటు తరవాత మాలినిలో కొంచెం కొంచెంగా మార్పు కలుగుతూ వచ్చింది.. ఆమె క్రమంగా అందగత్తె అవుతూండటం అందరికీ కానవచ్చింది. శరీరచ్ఛాయ హెచ్చుతున్నది. కళ్ళు విశాల మవుతున్నాయి, చెక్కిళ్ళు పూడి నునుపు తేలుతున్నాయి. ఒక దశలో హేమంతరాయుడు. తన ఇద్దరు కూతుళ్ళను చూసి, " మాలిని నళినికి ఏమీ తీసిపోయేటట్టు లేదే? ఏమిటి చిత్రం ?" అనుకున్నాడు.

♦️కాని త్వరలోనే ఆ అక్క చెల్లెళ్ళను, చూసినవాళ్ళు, "అందంలో నళిని కన్న మాలినే ఒక పెసరు హెచ్చు. ఏమీ సందేహం లేదు." అనసాగారు.

♦️"అక్క అదృష్టవంతురాలు. ఈ సారి మాధవుడు దాన్ని చూస్తే తప్పక పెళ్ళాడతాడు," అనుకున్నది నళిని,

♦️చెప్పిన ప్రకారం మాధవుడు తిరుగు ప్రయాణంలో జయంతనగరానికి వచ్చి, హేమంతరాయుడికి అతిథిగా ఉన్నాడు.

♦️పూర్వం లాగే మాలిని తోనూ, నళినితోనూ మాట్లాడి చూశాడు. రెండురోజులు గడిచాక అతను హేమంతరాయుడితో, "మీరు నన్ను మీ అమ్మాయిలలో ఎవరినైనా పెళ్ళాడమని ముందు అన్నారు. నా మనస్సులో నిర్ణయం జరిగితే మీకు చెబుతాను అన్నాను. నిర్ణయం జరిగింది. నేను మీ రెండో అమ్మాయి నళివిని పెళ్ళాడటానికి సిద్ధంగా వున్నాను.” అన్నాడు.

♦️హేమంతరాయుడు పరమానంద భరితుడయాడు. పెద్దపిల్ల అయిన మాలినిని ఇప్పుడు పెళ్ళాడటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. మాధవుడు తనను ఎన్నుకోనందుకు మాలినికి చాలా కోపం వచ్చింది. మాధవుడి కన్న పెద్ద స్థితిలో ఉన్నవాణ్ణి పెళ్ళాడతానని శపథం పట్టి, ఆమె అంతపనీ చేసింది. హేమంతరాయుడు. తన ఇద్దరు కుమార్తెలకూ ఒకేసారి పెళ్ళిళ్ళు చేసి, వారిని అత్తవారి ఇళ్ళకు పంపేశాడు.

♦️బేతాళుడు ఈ కథ చెప్పి, " రాజా, మాధవుడు మాలినిని ఎందుకు చేసుకోలేదు? ఆమె నళిని కన్న కూడా సౌందర్యవతి అయింది కదా? ఆమెలో మొదట ఉన్న లోపం యక్షిణి వరంతో తీరిపోయింది కద? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు.

♦️దానికి విక్రమార్కుడు, "మాలిని సౌందర్యవతి కావటం కోసం తన సౌజన్యాన్ని పోగొట్టుకున్నది. యక్షిణి వరం కోసం ఆమె ప్రయత్నించడంలో స్వార్థమూ, చెల్లెలి పట్ల అసూయా ఉన్నది. నళిని కూడా తన లోపాన్ని సరిదిద్దుకున్నది. ఆమె తన అహంకారాన్నీ, అతిశయాన్నీ విడిచిపుచ్చింది. అందుకు కారణం ఆమెకు మాధవుడి పైన ఉండిన గాఢమైన ప్రేమ మాత్రమే. మాధవుడు రెండోసారి వచ్చి మాలినితోనూ, వళినితోనూ మాట్లాడినప్పుడు, వారిలో ఎవరు తనను నిజంగా ప్రేమించేది తెలుసుకుని ఉంటాడు.

♦️తనకు కావలసిన సౌజన్య సౌందర్యాలు నళినిలోనే ఉన్నట్టు అతను గ్రహించి ఉంటాడు. ఆతను నళిని సౌందర్యంతో అదివరకే తృప్తిపడ్డాడు. అందుచేత అంతకన్న సౌందర్యవతి అయిన మాలిని కోసం ఆశ పడలేదు. మాధవుడు కేవలము సౌందర్య విమోహితుడే అయి ఉంటే మొదటనే నళినిని పెళ్ళాడి ఉండేవాడు." అన్నాడు.

♦️'రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

🌼🌼🍒🍒🍒🌻🍒🍒🍒🌼🌼

సేకరణ

No comments:

Post a Comment