కర్మసిద్ధాంతం - 07
పుణ్యం సుఖం ఇస్తుందని, పాపం దుఃఖకారకమని పాపపుణ్యాల గురించి ప్రస్తావించుకున్నాం కదా. వ్యక్తికి మరణం సంభవించిన తర్వాత, అతడి ఖాతాలో జమ అయిన పాపపుణ్యాలను అనుసరించి అతడికి తదుపరి జన్మ ఉంటుంది.
పుణ్యం ఎక్కువగా చేసుకున్న జీవాత్మలు ఊర్ధ్వలోకాలకు అనగా స్వర్గం మొదలైన దేవతాలోకాలకు వెళ్ళి, దేవతాజన్మలు పొంది, అక్కడ సుఖాలు అనుభవిస్తారు. చేసుకున్న పుణ్యాన్ని అనుసరించి బ్రహ్మ, ఇంద్ర, వరుణ, వాయు ఇత్యాది ఎన్నో పదవులు వస్తాయి. ఇంద్రుడు అంటాము కదా, ఇంద్ర అనేది పదవి. బాగా పుణ్యం చేసుకున్న జీవుడు ఇంద్రపదవిలో కూర్చుంటాడు. ఆ పదవి పొందిన ఎవరినైనా ఇంద్రుడనే అంటారు. అలా చేసుకున్న పుణ్యాన్ని అనుసరించి, అతడికి దేవ, గంధర్వ, కింపురుష.... ఇలా చెప్పబడ్డ ఎన్నో రకాల ఊర్ధ్వలోక జీవులకు చెందిన ఒక పదవి అప్పజెప్పబడుతుంది. అక్కడ సుఖం అనుభవించిన తర్వాత, అనగా పుణ్యం క్షయం అవ్వగానే, ఇంకా కొంత పుణ్యం మిగిలి ఉండగానే అతడిని మరలా భూలోకానికి పంపిస్తారు. అదే భగవద్గీతలో 'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి' అని శ్రీ కృష్ణపరమాత్మ వివరిస్తాడు. కొంత పుణ్యం అతని ఖాతాలో ఉంటుంది కనుక అతని సదాచార సంపన్నుల ఇంట, మానుష జన్మ పొందుతాడు.
మరణానంతరం జీవుని ఖాతాలో పాపం ఎక్కువగా ఉంటే, అతడు పశు, క్రిమి, కీటకాదులు, జంతువులు, పక్షులు, చెట్లు మొదలైన జన్మలు పొందుతాడు. మన ధర్మం ప్రకారం ఈ భూమి మీద మొత్తం 84 లక్షల 'రకాల' జీవరాశి ఉంది. అందులో మానవజన్మ తప్పించి, మిగితా వాటిలో అంటే, 83,99,999 రకాల జీవుల్లో ఏదో ఒక జన్మ పొంది, చేసిన పాపానికి తగిన శిక్షలు అనుభవిస్తాడు- బాధలు పడతాడు, హింసించబడతాడు, చీదరించబడతాడు.
పాపపుణ్యాలు సమానంగా ఉన్న జీవులు మాత్రమే మానుష జన్మ పొందుతారు. సమానం అంటే సరిగ్గా సమానమని కాదు, కాస్త అటుఇటుగా. అందులో కూడా అతడి పాపపుణ్యాలను అనుసరించి, ధనవంతుల ఇంట పుట్టడమా, లేక పేదవారి ఇంట పుట్టడమా అనేది ఉంటుంది. ఒక వైద్యశాలకు వెళ్ళినప్పుడు, అక్కడ ఎంతో మంది జన్మిస్తూ ఉంటారు. అందులో కొందరు అత్యధిక సంపన్నులకు పుట్టి, పుట్టగానే భోగాల మధ్య పెరుగుతారు. కొందరు ఏమీలేని వారి ఇంట పుట్టి, చిన్నవయసు నుంచే పస్తులుంటారు. కొందరు డబ్బు లేనివారి ఇంట పుట్టినా, సదాచార సంపన్నుల ఇంట పుడతారు.
ఈ మూడు జన్మలకు మధ్య వ్యత్యాసం కూడా ఉంది. దేవతాదిలోకాలు భోగభూములు. అక్కడ కర్మ చేసే అధికారం లేదు. మనస్సు, బుద్ధి మొదలైన అంతఃకరణాలు ఉంటాయే గానీ, స్థూలశరీరం ఉండదు. కనుక కర్మ చేసేందుకు అవకాశం లేదు. కాబట్టి సంపాదించుకున్న పుణ్యం వ్యయం (ఖర్చు) చేయడానికి మాత్రమే ఆ జన్మ పనికివస్తుంది. జంతుజన్మలో మనస్సు ఉంటుంది, స్థూలశరీరం ఉంటుంది, కానీ బుద్ధి ఉండదు. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం ఉండదు. జంతువులు, పక్షులు, చెట్లు పని చేసినట్లు, స్పందించినట్లు కనిపిస్తాయి కాని అవి ప్రకృతి ప్రేరణతో పని చేస్తాయి. వాటికి స్వతంత్రేచ్ఛ ఉండదు (అంటే తమంతట తాము ఒకటి నిర్ణయించుకుని చేయడమన్నమాట). మానవజన్మలో జీవుడికి కావలసిన అన్ని సదుపాయాలను దైవం సమకూర్చారు. తాను తన భవిష్యత్తును, తదుపరి జన్మలను నిర్ణయించుకునే స్వేచ్ఛను అతనికి ప్రసాదించారు. అందుకే ఆదిశంకరాచార్యులు మొదలైనవారు 'జంతూనాం నరజన్మ దుర్లభం' అన్నారు. మానవజన్మ పొందటం అత్యంత దుర్లభమైనది. దానికి దైవానుగ్రహం పుష్కలంగా ఉండాలి.
అయితే ఇక్కడొక విషయం గుర్తించుకోవాలి. జంతుజన్మలు తక్కువ అని చెప్పినంత మాత్రంచేత, కనిపించే ప్రతి జీవి పాపం కారణంగానే అలా పుట్టిందని, వాటికి జ్ఞానం లేదని నిర్ధారించకూడదు. ఒక మహాజ్ఞానిని, జీవన్ముక్తుడిని మనుష్యులకంటే ముందుగా గుర్తించేది ప్రకృతియే, పశుపక్ష్యాదులు, వృక్షాదులే. భగవాన్ రమణ మహర్షి, త్రైలింగ స్వామి, ఇంకా ఈ దేశంలో నడయాడిన ఎందరో మహానుభావుల చరిత్రలకు మనకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జంతువులుగా పుట్టిన ఏనుగు, సాలెపురుగు, పాము సైతం ఈశ్వరుడిని సేవించి, మోక్షం పొందిన క్షేత్రం శ్రీ కాళహస్తి. అనగా వాటిలో కూడా చైతన్యం మెండుగా ఉందని గుర్తించాలి. కానీ మనిషిగా పుట్టినవాడికి ఇది ఓ గొప్ప సువర్ణావకాశం అని చెప్పడమే గురువుల లక్ష్యం.
అలాగే ఋషులు మొదలైన తపస్సంపన్నులు సైతం కొన్ని సార్లు, లోకకల్యాణ నిమిత్తం, దైవాదేశానుసారం వృక్షాలుగా, పశుపక్ష్యాదులుగా జన్మలెత్తిన సందర్భాలు సనాతన ధర్మ వాజ్ఞమయంలో కోకొల్లలు. తిరుమల, అహోబిలం, శ్రీ శైలం, అరుణాచలం మొదలైన పవిత్ర క్షేత్రాల్లో, దేవతలు, ఋషులు రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, పశుపక్ష్యాదుల రూపాలను స్వీకరించి, సంచరిస్తుంటారని, తపమాచరిస్తారని పురాణ వచనం.
To be continued ..
No comments:
Post a Comment