Thursday, March 30, 2023

శ్రీ రమణీయం -4 🌹 👌మన ప్రతి అనుభవం ఆత్మదే👌

 [3/25, 18:25] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం -4 🌹
👌మన ప్రతి అనుభవం ఆత్మదే👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 4. మన ప్రతి అనుభవం ఆత్మదే 🌈

✳️ శరీరం, మనసు ప్రతి ఒక్కరికీ అనుభవంలోనివే. దేహానికి చూడటం, వినడం, మాట్లాడటం, రుచి తెలుసుకోవడం, స్పర్శ తెలియడం వంటి లక్షణాలు ఉన్నాయి. సునిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ 'మనసు'కి ఉన్న సామర్థ్యాలేనని తెలుస్తుంది. మనసే ఈ ఇంద్రియాల ద్వారా ఈ పనులు చేస్తుంది. ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ పనులన్నింటిలోనూ 'గ్రహించడం' అనే ఒకే లక్షణం అంతర్సూత్రంగా ఉందని మనకి అవగాహనలోకి వస్తుంది. కళ్ళద్వారా దృశ్యాన్ని, చెవులద్వారా శబ్దాన్ని, ముక్కుద్వారా వాసనను, చర్మంద్వారా స్పర్శను, నాలుకద్వారా రుచిని మనం గ్రహిస్తాం. ఈ గ్రహించడం అనే లక్షణమే మనకు అనుభవంగా మిగులుతుంది. ఈ గ్రహింపు లక్షణం మనసుకి ఎక్కడిది అని శోధిస్తే మనసుగా వ్యక్తమయ్యే 'ఆత్మశక్తి'దేనని బోధపడుతుంది. 

✳️ మన ప్రతి అనుభవం వెనుక ఆత్మశక్తి ఉంది. మనసు, ఇంద్రియాల ద్వారా మనం పొందే ప్రతి అనుభవం 'ఆత్మశక్తి'దేనని మనకి స్పష్టమౌతుంది. శ్రీరమణభగవాన్ చూపిన విచారణ మార్గంలో మన ప్రయత్నమంతా ఆ ఆత్మను తెలుసు కోవడానికే. అది ఈ దేహాత్మభావనతో సాధ్యంకాదు. ఒకసారి కలిసిపోయిన గంగా, యమునల నీటిని ఎలావేరు చేయలేమో మమేకమైఉన్న ఆత్మ, మనసులను కూడా బాహ్యంగా వేరు చేయలేకపోవడమే అందుకు కారణం. ఈ రెంటినీ వివేకంచేత భావనలో వేరుచేయడం తప్ప పదార్థాలుగా విభజించ లేము. దీపంనుండి వెలువడే వెలుతురులా ఆత్మనుండి వెలువడ్డ మనసును దాని ‘కిరణం'గానే గుర్తించాలి. మనకు అనుభవంలేని ఆత్మను ఊహించడం కన్నా అనుభవంలో ఉన్న మనసునే దైవంగా భావిస్తే సాధన సులువు అవుతుంది. 

✳️ మన మనసు భయం, దుఃఖం, సంతోషం వంటి రూపాలను పొందినట్లే పెద్దల మాటలపై విశ్వాసంతో ఆత్మగా భావనచేస్తే తన సహజ స్వరూపమైన ఆత్మస్థితిలోనే ఉంటుంది. అందుకు ఈ సృష్టి అంతా బ్రహ్మస్వరూపమేనన్న సమదృష్టి అలవర్చుకోవాలి. 

✳️ అందరిలోనూ, అంతటా దైవాన్ని భావించడమే భక్తి. మహాయోగినిగా పేరున్న 'తాడువాయిమాత' తన చివరిక్షణం వరకూ ప్రతివారిని శ్రీరామచంద్రునిగానే ఆరాధించారు. శ్రీరమణభగవాన్ కూడా ఆత్మజ్ఞానం కలిగేవరకూ మనోదేహాలనే బ్రహ్మ పదార్థంగా గుర్తించి అర్చించమన్నారు. సత్యం అర్థమైనరోజు మన ఆత్మకు, మనోదేహాలకు పత్తికి, వత్తికి ఉన్నంత సామ్యం కనిపిస్తుంది. 'పత్తి'ని వత్తితే 'వత్తి' అయినట్లే ఆత్మ జీవత్వంచేత మనసుగా మారింది. అదే బాహ్య ప్రకృతిలో ఈ శరీరరూపం దాల్చింది. ‘పత్తి-దారం-వస్త్రం' లో రూపభేదం ఉన్నా అంతర్గత పదార్థంలో భేదంలేనట్లే... ‘ఆత్మ-మనసు-దేహం’ వ్యక్తీకరణలో తేడాఉన్నా అన్నీ బ్రహ్మపదార్థాలే. ఈ విషయాన్ని అనుభవంగా తెలుసుకున్నవారే జ్ఞానులు. వారి బోధనల ద్వారా ఈ విషయాలు మనకి అవగాహనలోకి వచ్చినా అనుభవంలోకి వచ్చే వరకూ మనం అజ్ఞానులమే. అవగాహననే అనుభవంగా భ్రమచెంది సాధన పూర్తి అయిందనుకోవడం అజ్ఞానం. 

✳️ ఆత్మకు ప్రతిరూపమైన మనసు మనకు నిత్యం అనుభవంలోనే ఉన్నా మనకి ఆత్మానుభవం మాత్రం తెలియడంలేదు. మనసు శరీరభావనతో ఉండటమే అందుకు కారణం. మనసు ఆత్మశక్తితో ప్రాప్తించిన ఎరుకతో ఈ దేహాన్ని తెలుసుకుంటూ అదే 'నేను' అనుకుంటుంది. మనసు తన ఎరుకను (గ్రహింపుశక్తిని) తెలుసుకోగలిగితే అందుకు కారణమైన ఆత్మను తెలుసుకోగలుగుతుంది. టార్చిలైట్ నుండివచ్చే కాంతిని గమనించకుండా అది ప్రసరించిన వస్తువును తెలుసుకుంటున్నట్లే మనకి ఎరుకలోనికి వచ్చే విషయాలు తెలుస్తున్నాయిగానీ ఆ ఎరుకగానీ అందుకు కారణమైన ఆత్మగానీ తెలియడం లేదు. మనం మనిషిని అన్న భావనతో ఉన్నంత సహజంగా జ్ఞాని తాను ఆత్మననే సత్యంతో అనుసంధానం అయి ఉంటారు. అందుకే... 'అహంబ్రహ్మస్మి' అనే మాట, ఆత్మజ్ఞానిదిగానీ మనదికాదు. మనం మనోదేహాలు రెండింటినే అనుభవించగలం. జ్ఞాని ఆరెండింటికీ మూలమైన ఆత్మను కూడా నిత్యం అనుభవిస్తూనే ఉంటారు. 

✳️ వాస్తవానికి మనకి ఆత్మానుభవం రోజూ జరుగుతూనే ఉన్నా దాన్ని మనం గ్రహించ గలిగితేగానీ ఆత్మజ్ఞానంగా మనలో నిలిచిపోదు. దానికోసమే మన ఈ ఆత్మవిచారణ సాధన. మనకి శాంతినిచ్చేదే అసలైన సాధన. ఏమార్గంలోనైనా సరే అందులో శాంతిగా, ఆనందంగా వ్యక్తం అయ్యేది మన ఆత్మ స్వరూపమే. నిత్యం మనలో ఉండే ఆత్మానందానికి అడ్డుగా ఉన్న అహంకారం తొలిగిపోయిన లిప్తకాలం మనం శాంతినీ, సంతోషాన్ని అనుభవిస్తున్నాం. మనం నిత్యం భావించే 'నేను' ను పోగొట్టు కోవడమే ఇక్కడ జరిగే ప్రక్రియ. అందుకే భగవాన్ నిద్రానుభవాన్ని సాధించ మంటున్నారు. మన నిద్రానుభవం మనకు తెలియకపోయినా నిద్రించే ఎదుటి వారిని గమనిస్తే మనకి దాని తత్వం తెలుస్తుంది. అప్పటివరకూ ఎన్నో చికాకులతో ఉన్న వ్యక్తి నిద్రలో ఏ ఆలోచనాలేకుండా సుఖాన్ని, శాంతిని అనుభవించడం మనం చూస్తాం. అదే మన సహజస్థితి అన్న సత్యం అవగాహన లోకివస్తే రోజు జరిగే ఆత్మానుభవాన్ని గుర్తించడం సులభం అవుతుంది.
[3/25, 18:25] +91 73963 92086: ✳️ ఆత్మవిచారమంటే కేవలం కళ్ళుమూసుకునే చేసేది కాదు. మన మనసు పొందే వికారాలను గమనిస్తూఉంటే అవేవీ దాని సహజరూపాలు కాదని బోధపడుతుంది. ఈ గమనింపు తీవ్రం అయ్యేకొద్ది ఆ వికారాలు ఆకాశంలా అన్నింటిలో నిండిన ఆత్మను చూడమనే భోధనేఉందని శ్రీరమణ భగవాన్ చెప్తున్నారు. 

✳️ మనకి కనిపించని, మన అనుభవంలోలేని ఆత్మను నేరుగా భావన చేయలేము కనుక మంత్రజపం, రూపధ్యానాల ద్వారా ఆ స్థితిని పొందాలి. నోటితో ఉచ్చరించడం ద్వారా మొదలైన మంత్రజపం క్రమంగా మానసికజపంగా ఆ తర్వాత ధ్యానంగా పరిణమిస్తుంది. ధ్యానస్థితి అంటే బ్రహ్మపదార్థంతో అనుసంధానం కావడమే. కవిత్వం, పాట, భజన, సుందరదృశ్యాలు వంటివాటిలో నిమగ్నమైనప్పుడు కూడా ఈ ఆత్మానుసంధానమే జరుగుతుందని భగవాన్ స్పష్టంచేస్తున్నారు. 

✳️ మనని మనం మర్చిపోయే ప్రతిపని మనని ఆస్థితికే చేరుస్తున్నా దాన్ని గుర్తించే ప్రయత్నంలో లేముకనుక ఆ విషయం తెలియడంలేదు. మన ప్రయత్నంతో ఆ స్థితిని నిలుపుకోవడమే మనం చేసే సాధన.

  🙏ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment