Thursday, March 23, 2023

 🌹 శ్రీ రమణీయం -2 🌹
👌వివేకంతోనే వైరాగ్యసిధ్ధి👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 2. వివేకంతోనే వైరాగ్యసిద్ధి 🌈

✳️ భగవంతుని సాక్షాత్కారానికి ప్రధాన ద్వారం వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నీ వదులుకోవాలేమోనన్న అపోహ చాలామందికి ఉంటుంది. వైరాగ్యం పట్ల సరైన అవగాహన లేకపోవడమే అందుకు కారణం. మన మనసుకు విషయాలను గ్రహించే గుణం, శరీరానికి వాటిని స్వీకరించే గుణం ఉన్నాయి. ఈ మనోదేహాలు స్వీకరించేవి ఏవైనా నీటిమీద రాతల్లాగా అదృశ్యమైపోయేవే. బల్బులోని ఫిల్మెంట్లోకి కరెంట్ ప్రవహించినపుడు వెలుగు ఏర్పడుతుంది. ఆ వెలుగు తర్వాత కరెంటునుగానీ, ఫిల్మెంటును గానీ అంటి పెట్టుకుని ఉండటం లేదు. అలాగే మనసు, శరీరాలకు ఏ అనుభవాలూ అంటుకొని ఉండవు. కాకపోతే వాటి తాలూకూ అనుభూతి మాత్రం జ్ఞాపకాలుగా మిగిలిపోతుంది. ఆ జ్ఞాపకాలే వైరాగ్యానికి, ఆత్మానుభూతికి ప్రధాన అవరోధాలు. 

✳️ ఈ రోజూ తిన్న ఆహారం, త్రాగిననీరు, చేసిన స్నానం ఏవీ నిలిచిఉండటంలేదు. తిరిగి ఆ అవసరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. పోనీ మనసు పొందిన సంతోషం, తృప్తి అయినా అలా నిలబడతాయా? అంటే అదికూడా “చిల్లి కడవే”. ఎన్ని కోర్కెలు తీర్చినాసరే అప్పటి అనందం, బాధ ఏదీ ఎల్లకాలం కొనసాగటం లేదు. నీరు నిలవని ఓటుకుండలో 'తడి’ మాత్రం మిగిలినట్లు జ్ఞాపకాలు ఉండిపోతాయి. అదే జీవలక్షణం. ఆ జ్ఞాపకాలే తిరిగి కోర్కెలపై అసక్తిని పెంచి ఇష్టాయిష్టాలనే అహంకారంగా రూపుదిద్దుకుంటాయి. అందుకే అవసరాన్ని బట్టి జీవించాలిగానీ ఆసక్తిని బట్టికాదు.

✳️ మనం చాలా విషయాలను అవసరంతోగాక ఆసక్తితోనే స్వీకరిస్తాం. కోర్కెను ఇష్టంతో తీర్చుకునేటప్పుడు అది జ్ఞాపకంగా మారి కోర్కెను మరింత బలోపేతం చేస్తుంది. మనో దేహాలకు మనం అందించే విషయాలు జ్ఞాపకాలుగా తప్ప అనుభవంగా నిలిచి ఉండవు అనే వివేకం మనకి వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈభావనతో ఏది స్వీకరించినా, ఏది గ్రహించినా అవి జ్ఞాపకాలుగా మారవు. జ్ఞానికైనా, సామాన్యుడికైనా ఈ జ్ఞాపకాల విషయంలోనే వ్యత్యాసం మనోదేహాల అనుభవాల్లో తేడా ఉండదు. ఏదీ జ్ఞాపకంగా మారదు గనుక జ్ఞానిని ఏ అనుభవం తిరిగి బాధించదు. ఈ జన్మలో మనోదేహాలతో సాధించుకున్నవి ఏవీ మరుజన్మకు మిగలటంలేదు. ఎవరికీ, ఏదీ శాశ్వతంగా నిలిచి ఉండదన్న అవగాహనే వైరాగ్యానికి తొలి మెట్టు. మనం 'ఆత్మ'కు మాత్రమే ఏదీ అంటటంలేదని అనుకుంటున్నాం. మనోదేహాలు కూడా ఆత్మకు భిన్నంకాదు. కనుకనే ఏదీ అంటని ఆత్మలక్షణం వాటికికూడా ఉంది. కడవకు అంటిన ‘తడి’లా ఉన్న జ్ఞాపకాలు అ సత్యాన్ని గ్రహించనివ్వవు. మనోదేహాలకు జ్ఞాపకాల అనుభూతులు తప్ప ఏదీ అంటేది కాదని గ్రహించడమే జ్ఞానం. సూర్యచంద్రుల ఆకర్షణ వల్ల ఏ నిమిత్తం లేకుండానే కడలి కెరటాలు కదిలినట్లు మన ప్రతి కదలిక పూర్వ ప్రారబ్ధం వల్ల దైవంచేత జరుగుతుంది. మన ప్రస్తుత ప్రయత్నాలే మనకి అన్నీ సమకూర్చి పెడుతున్నాయన్న అజ్ఞానంచేత భ్రమలో ఉంటాం. సుఖసంతోషాలపై శ్రద్ధ పెట్టి జీవలక్షణాలు మరింత పెంచుకుంటున్నాం. దీనివల్లే ఆకర్షణ ఆసక్తిగామారి అహంకారంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే మనం అసక్తికి అనుగుణంగాకాక అవసరాలను అనుసరించి జీవిస్తే మంచిది.“ అవసరం తీర్చుకోవడానికి అసక్తితో పని లేనప్పుడు అసలు ఆసక్తితో అవసరం ఏముంది” ఈ వివేకం వైరాగ్యాన్ని, శాంతిని ఇస్తుంది.

꧁•••••┉┅━•••••🌹✳️🌹•••••━┅┉•••••꧂

🌈  భక్తిలో వివేకం అవసరం  🌈

✳️ భక్తిలో వివేకం ఉంటేనే సాధన ఫలిస్తుంది. సత్యాన్ని తెలుసుకోవాలన్న శుభేచ్చ సాధకుడికి ప్రాథమిక అవసరం. మన పూర్వజన్మ సుకృతంవల్ల సత్యంతో అనుసంధానమై జీవించే సద్గురువు సన్నిధి లభిస్తుంది. ఆత్మవస్తువే మనని ఉద్ధరించడంకోసం మనోదేహాలతో సద్గురువుగా వస్తుంది. తన సాధన ద్వారా సద్గురువు సాధించిన ఉన్నతి మనకు నేరుగా అందకపోయినా ఆ సన్నిధి మన సాధనను సులభతరం చేస్తుంది. గురువు అనుగ్రహం స్వీకరించేంత అర్హత, వివేకం సాధకుడికి ఉండాలి. తన జీవితకాల అనుభవాన్ని ఒక్క మాటలో గురువు మన అవగాహనలోకి తీసుకురాగలరు. దానివల్ల సత్యదర్శనం సులభం అవుతుంది. అయితే ఇక్కడ సాధకుడి ప్రయత్నం మాత్రం ప్రధానమని శ్రీరమణభగవాన్ స్పష్టంచేస్తున్నారు. భక్తిలో వివేకం ఉంటేనే సాధన ఫలిస్తుంది. మన అవివేకం సద్గురువుని సైతం గుర్తించనివ్వదు. భగవాన్ వంటి మహాను భావుల వద్దకూడా కొందరు అవివేకంతో ప్రవర్తించారు. పరిపూర్ణ ఆత్మ స్వరూపంగా ఉన్న శ్రీరమణభగవానికి అందరూ మహర్షులుగానే కన్పిస్తారు. మనని కూడా ఆస్థితికి చేర్చాలన్నదే మహర్షి ఆగమనంలోని ఆంతర్యం. మనసుకు ఆకర్షణ, ఆసక్తి, అహంకారం అనేగుణాలు ఏర్పడుతున్నాయి. వాటిని ఒక్కటొక్కటిగా తొలగిస్తూ వెళ్ళటమే భగవాన్ మనకు చూపిన విచారణ మార్గం. మన జీవితంలో ఉన్న సంతోషాన్ని ఎప్పటికప్పుడు గుర్తించాలి. అది శాశ్వత వస్తువులా మనతో నిలిచిపోతుందని ఉహించకూడదు. పాయసంతింటే తీపిజ్ఞాపకం మిగిలినట్లే మంత్ర జపంవల్ల దైవగుణాలు మనలో నిలిచిపోతాయి. ఆస్తికుడికి, నాస్తికుడికి తేడా ఏంటంటే కష్టసుఖాలకు తాను కర్తనని భావించి చలించేవారు ఒకరు. వాటిని దైవానుగ్రహంగా స్వీకరించేవారు మరొకరు.

No comments:

Post a Comment