Friday, March 24, 2023

పురుషార్థములు అనగా

 🙏🕉🙏                  ..... *"శ్రీ"*
       
      🪷 *"పురుషార్థములు అనగా"*  🪷
      🪷🟣🪷🟣🪷🟣🪷
            🪷🟣🕉🟣🪷
                  🪷🟣🪷
                        🪷
*"అన్ని జన్మలకంటే మానవ జన్మ ఉన్నతమైనది. ఈ మానవ జీవితంలో మానవులు సాధించాల్సిన పురుషార్థములు నాలుగు ఉన్నాయని పెద్దలు చెపుతుంటారు. పెద్దల మాట సద్దిమూటలాంటిదిగదా! ఈ చతుర్విధ పురుషార్థములే ధర్మం, అర్థం, కామం, మోక్షం. చతుర్విధ పురుషార్థములు పూలుగా పూచిన పుణ్య భారతదేశం మనది."*

 *"భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధించిన విధంగానే ఆధ్యాత్మిక రంగంలో కూడా మహోన్నతంగా ఎదిగింది. అయితే కొంతమంది ఆధ్యాత్మిక జీవనమునకు అర్థం, కామం ఆటంకం కలిగిస్తాయని అంటారు. ఇవి రెండు ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం కలిగిస్తే మన పూర్వీకులు వీటిని ధర్మం, మోక్షంకు ఎందుకు జత చేయవలసి వచ్చిందో ఒకసారి పరిశీలించాల్సిన, ఆలోచించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. సాధారణంగా ఆలోచించినా మన పూర్వీకులు తప్పు చేసి ఉండరని భావన కలుగుతుంది."*

*"చతుర్విధ పురుషార్థములలో ధర్మం తలవంటిది. మోక్షం గుండె వంటిది. అర్థం, కామం శరీరంలోని అవయవముల వంటివి. మానవులలో నూటికి తొంభై తొమ్మిదిమంది అర్థం, కామం స్వీకరించి, ఇదియే జీవితమని భావించి, ధర్మం, మోక్షం మరచి జీవితాన్ని గడుపుతారు. ధర్మం, మోక్షం మరచిన వారు ఆధ్యాత్మికంగా ఎదుగలేరు. అనుకున్నది సాధించలేరు. ఆకులు లేని చెట్టును గుర్తించుట ఎంత కష్టమో తల లేని మనిషిని గుర్తించుట కూడా అంతే కష్టం కదా! అలాగే ధర్మం, మోక్షం పాటించని మనిషిని భగవంతుడు గుర్తించడం కూడా అంతే కష్టం. అందుకే మానవులు ధర్మ, మోక్షాలని పాటించడం అంతే అవసరం. తల, గుండె లేని శరీరం ఎందుకు పనికిరాదు. అలాగే ధర్మం, మోక్షం లేని అర్థం, కామం మానవులకు ప్రయోజనం కలిగించవు. కావున కొంత మంది మహానుభావులు అర్థం, కామం ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం కలిగిస్తాయని భావించవచ్చు."*

*"కామం అంటే కోరిక. మనిషి కోరికల పుట్ట లాంటివాడు. గొంతెమ్మ కోరికలు కోరుతూనే ఉంటాడు. మానవుడు ధర్మబద్ధంగా ధనము సంపాదించాలి. ధర్మం కొరకే కామం ఉపయోగించాలి. అపుడే ఎటువంటి కీడు కలుగదు. ధర్మం అంటే సశ్చీలము. మనసా, వాచా, కర్మణా ఏ జీవికి హాని కలిగించరాదు. అర్థం అంటే ధనం. మనిషి జీవించుటకు ధనం కావాలి. కాని జీవించుటకు ఎంత ధనం కావాలో అంతే అవసరం. ఎక్కువ, తక్కువ ఉన్నా అది ప్రమాద హేతువుగా మారుతుంది. ఈ వ్యత్యాసం దుర్గుణములకు దారి తీస్తుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని హరిస్తుంది. మోక్షం అంటే మోహ క్షయం. మనిషి మాయా పరిధినుంచి బయటపడి స్వస్వరూప జ్ఞానం పొందుటకు ఇది ఉపయోగపడుతుంది. బంధ విముక్తిని చేస్తుంది."*

*"మానవులమానవులు సర్వసాధారణంగా తమ అవసరాలు తీర్చుకొనుటకు స్వార్థబుద్ధితో భగవంతుని కోరికలు కోరుతుంటారు. కోరికలు తీర్చుటకు భగవంతునికి నోములు నోస్తారు. మొక్కులు చెల్లిస్తారు. ఇంకా వీలైతే జీవులను బలి ఇస్తారు. తమ భక్తిని చాటుకుంటారు. జీవ హింసకు పాటుపడతారు. కోరిక తీరకపోతే భగవంతున్ని నిందిస్తారు. తూలనాడుతారు. మహానుభావులు పరమార్థంతో కోరికలు కోరుతారు. సర్వేజనా సుఖినోభవంతు అని కోరుతారు. లోక కళ్యాణం కోసం వారు అర్థం సంపాదిస్తారు. లోకుల కోసమే సంపదను వెచ్చిస్తారు. అతిథి, అభ్యాగతులకు అన్నదానం చేస్తారు"*
*"చతుర్విధ పురుషార్ధాలు:- ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు.''*

*"మనం నాలుగు పదార్థాలం:- అవి దేహం, మనస్సు, బుద్ధి, ఆత్మ."*

*"అందువలన..."*
*దేహానికి - కామం*
*మనస్సునకు - అర్థం*
*బుద్ధికి - ధర్మం*
*ఆత్మకు - మోక్షం కావాలి..."*

**ధ్యాన 'యజ్ఞం':-"*

*సంకల్ప రహితంగా శ్వాసపై నిలచిన మనస్సే - యజ్ఞకుండం*
*శ్వాసే - ఆహుతులు.*
*మరి మనస్సు అనుభవించే శూన్యత్వమే - యజ్ఞ ఫలం..."*
             🪷🟣🪷🟣🪷
                   🪷🕉️🪷
                        *"శ్రీ"*

No comments:

Post a Comment