*అమృతం గమయ*
*తొమ్మిదవ అవతారం - మహర్నవమి - సిద్ధిదాత్రి దుర్గ*
*23 అక్టోబరు 2023 9వ రోజు శరన్నవరాత్రి*
*ధ్యాన శ్లోకం*
*శ్లో ॥ సిద్ధగంధర్వయక్షాద్యైః ,* *అసురై రమరైరపి*
*సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదాసిద్ధిదాయినీ ॥*
శ్రీ దుర్గా మాత అవతారాలలో తొమ్మిదొవ అవతారం . 'సిద్ధిదాత్రి' అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది . సిద్ధిదాత్రి మాత భక్తులు కోరిన కోరికలను సిద్ధింప చేస్తుంది . ఈ దేవతను సిద్ధులు గంధర్వులు యక్షులు దేవతలు, దానవులు , నరులు అందరూ ఆరాధిస్తారు . సకలదేవతా స్వరూపాలన్ని ఈమెయందు అంతర్లినమైయున్నవి . ఈ దేవిని సిద్ధ పురుషులు అత్యంత భక్తితో ఉపాసిస్తారు . మానవాతీతమైన మహత్తులు కలవారిని సిద్ధపురుషులంటారు . వీళ్లల్లో ఎనిమిది రకాల విద్యలుంటాయి . వాటిని అష్టసిద్ధులని చెప్తారు . అణిమ , గరిమ , లఘిమ, మహిమ , ప్రాప్తి , ప్రాకామ్యము , ఈశత్వము , వశిత్వము ఇవి అష్ట సిద్ధులు .
1. అణిమ అనగా సూక్ష్మమైన అణుప్రమాణమైన అతి తెలికైనదని అర్ధం . ఈ సిద్ధవిద్య నేర్చినవారు గాలిలో తేలినట్లు తేలికగా మారిపోదురు . కొండను సైతం గడ్డిపరకగా అలతిగా మార్చివేస్తారు .
2. గరిమ అనగా గురుత్వశక్తికి సంభందించింది . తాము అణు పరిమాణంలో ఉన్నప్పటికీ బ్రహ్మాండమంత బరువును కలిగి ఉండేది . గడ్డిపోచను కూడా కొండంత బరువుగా మార్చి వేయగలిగేది .
3. లఘిమ అనగా వేగవంతమైనది . చేరవలసిన గమ్యాన్ని మనోవేగంగా సంకల్పమాత్రంతో చేరుకొంటారు .
4. మహిమ అనగా సర్వత్ర పూజితులై ఉండుట చూచిన వారంతా గౌరవించుట . అంటే పరిచయం లేనివారు కూడా పిలిచి సాదరంగా ఆదరిస్తారు . దీన్నే జనవశీకరణ అనికూడా అనవచ్చు .
5. ప్రాప్తి అనగా ఏది కోరుకున్నా దాన్నిపొందే సమర్ధత కలిగి ఉండుట . వీరుపొందలేని వస్తువేది ఈ ప్రపంచంలో ఉండదు .
6. ప్రాకామ్యము అనగా అంతటా వ్యాపించి ఉంటుంది . తానోక్కచోటనే ఉండి అన్నీ చోట్లలో తానెయై అంతా గమనించు చుండుట .
7. ఈశత్వము అనగా ఆధిపత్యాన్ని పొంది ఉండుట . అన్నిటిలోనూ అందరిలోనూ తానే అధికుడుగా అధికారాన్ని కలిగి ఉండుట .
8. వశిత్వము అనగా కామక్రోధాది షడ్వర్గాన్ని అణుచుకొని రాగద్వేషాలకు అతీతుడై ఆత్మను బుద్ధిని మనస్సును తన ఆధీనంలో ఉంచుకోవటమేకాక సమస్తాన్ని వశం చేసుకోవడం . ఇంకా ఇవే కాక సిద్ధులు అష్టాదశ విధాలుగా బ్రహ్మవైవర్తపురాణంలో చెప్పబడింది .
1. అణిమ 2. లఘిమ 3. ప్రాప్తి 4. ప్రాకామ్యము 5.మహిమ 6. ఈశత్వము 7. వశిత్వము
8. సర్వకామావసాయిత 9. సర్వజ్ఞత్వము 10. దూరశ్రవణం 11. పరకాయప్రవేశం 12. వాక్సిద్ధి 13. కల్పవృక్షత్వం 14. సృష్టి 15. సంహారకరణ సామర్ధ్యం 16. అమరత్వం 17. సర్వనాయకత్వం 18. భావనాసిద్ధి
ఈ సిద్ధిదాత్రి మాతవలన ఈ సిద్దులన్నీ పొందినవారు సిద్ధ పురుషులుగా చెప్పబడుతున్నారు . ఈ దేవి గంధర్వులకు సంగీతం మొదలైన గాంధర్వాంశలను ప్రసాదిస్తున్నది . యక్షులకు సమస్తైశ్వర్యాలను కటాక్షిస్తుంది . దేవతలకు దివ్య శక్తులను అనుగ్రహిస్తున్నది . రాక్షసులకు బలసంపన్నతను కలుగజేస్తున్నది . మానవులకు బుద్ధి, విద్యా , భోగ భాగ్యాలను ఒనగూరుస్తున్నది .
*స్వరూపం*
ఈమె చతుర్భుజ . కుడివైపున ఒకచేత చక్రాన్ని ఒకచేత గదను ధరిస్తుంది . ఎడమవైపున ఒకచేత శంఖాన్ని వేరోకచేత పద్మాన్ని ధరించి ఉంటుంది . సమస్త లోకాల్లోన్ని భక్తులంతా చుట్టూ నిలిచి ప్రస్తుతులు చేస్తుండగా మందహాసంతో కమలాసనయై కనిపిస్తుంది . సిరిని కోరేవారికి లక్ష్మీదేవిగా , విద్యలు కోరేవారికి సరస్వతీ దేవిగా సిద్ధులుకోరేవారికి సిద్ధిదాత్రి దేవిగా అన్నిరుపాలు తానై వారికోర్కెలు తీర్చుతున్నది . నిర్మల మనస్కులై ఈ తల్లి నారధించువారికి ప్రాప్తించని దేది ఈ ప్రపంచంలోనే లేదు . సంపూర్ణ విశ్వాసంతో ఈదేవిని కొలిచేవారికి అష్ట సిద్ధులు , నవనిధులు , అఖండ కీర్తి , భోగ భాగ్యాలు హస్తగతమౌతున్నవి .
నవరత్రోత్సవాలలో తొమ్మిదొవ రోజైన నవమినాడు 'సిద్ధిదాత్రి'ని ఉత్సవముర్తిగా అలంకరించి పూజిస్తారు . ఈ తొమ్మిది దినాలు నవదుర్గలను నియమ నిష్ఠలతో ఉపాసించిన భక్తుడు సంసారిక వ్యామోహం నుంచి విడిపడి విరక్తుడై ఆశాపాశాలనుండి భవబంధాలనుండి విముక్తుడై శ్రీ మాతృ చరణారవిందాలను చేరి అంబను హృదయంలో నిలిపి అలౌకికానందంలో తెలిపోతుంటాడు . అలాంటివాడు రాగరహితుడౌతాడు . బాహ్యానందాన్ని ఇచ్చు సాధారణ కోరికలపై మనసు పరుగులిడదు . అట్టి నిర్మల భక్తుడే అమ్మ సాన్నిధ్యాన్ని పొందటానికి అర్హుడౌతున్నాడు .
'నవదుర్గల్లో తొమ్మిదవ, ఆఖరి
అవతారం. నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ
నవమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పని
సిద్ధించడం, దాత్రీ అంటే ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక, జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రీ దుర్గాదేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించేవారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి.
No comments:
Post a Comment